రఘురామ Vs సునీల్ కుమార్.. ఈ గొడవకు ఎండ్ కార్డు లేదా?

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ పోలీసు అధికారి పీవీ సునీల్ కుమార్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది.;

Update: 2026-04-04 10:01 GMT

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ పోలీసు అధికారి పీవీ సునీల్ కుమార్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. గత ప్రభుత్వంలో రఘురామపై దేశద్రోహం కేసు నమోదు చేయడంతో ఆయనపై కస్టోడియల్ టార్చర్ కు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కారణమంటూ రఘురామ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్ కుమార్ పై పోలీసు కేసు నమోదు చేయించడం, ఆయనను సస్పెండ్ చేయడం వరకు పరిస్థితి వెళ్లింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగడం సంచలనంగా మారింది.

డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సొంత నియోజకవర్గమైన ఉండి పరిధిలోని ఆకివీడులో శిథిలమైన రామాలయ పునః నిర్మాణంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే రామాలయాన్ని రూ.80 లక్షల రూపాయలతో పునరుద్ధరిస్తామని ప్రకటించిన రఘురామరాజు ప్రజల నుంచి విరాళాలు సేకరించడం ప్రారంభించారు. ఇదే సమయంలో రామాలయ పునః నిర్మాణానికి ముందు రఘురామపై దాడికి కొందరు ప్రయత్నించారు. దీనివెనుక పీ.వీ.సునీల్ కుమార్ హస్తం ఉందని రఘురామ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సీనియర్ పోలీసు అధికారిని వాడు.. వీడు.. అని పేర్కొంటూ విమర్శలు, ఆరోపణలు చేశారు.

దీనిపై ఘాటుగా స్పందించిన పీ.వీ.సునీల్ కుమార్ అంతే తీవ్రంగా మాటల యుద్ధం ముమ్మరం చేశారు. రఘురామను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేసిన పీ.వీ.సునీల్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రఘురామపై పరోక్ష విమర్శలు చేస్తూ ‘గేదెలా పెరిగావ్’ అంటూ తన వీడియోలో సునీల్ కుమార్ ధ్వజమెత్తారు. దీంతో ఇద్దరి మధ్య తాజా వివాదంపై హాట్ డిబేట్ కొనసాగుతోంది. సీనియర్ అధికారి అయిన తనను వాడు వీడు అనడం ఏంటని ప్రశ్నిస్తున్న పీ.వీ.సునీల్ కుమార్ ‘‘గేదెలా పెరిగావు, నీకు సంస్కారం లేదా? మీ అమ్మానాన్న నీకు నేర్పించలేదా? అంటూ ప్రశ్నించారు.

ఇక రఘురామ సైతం ‘నీలి కోటుగాడు’ అంటూ మరింత రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాను ఏ కోటు వేసుకుంటే ఏమైందని నువ్వేమైనా కొనిచ్చావా? అంటూ నిలదీస్తున్న సునీల్ కుమార్, బ్యాంకులను మోసగిస్తే తప్ప నీకు తెల్లారదు అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘నువ్వెంత, నీ బతుకెంత?’’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇద్దరు పరస్పర విమర్శలు చేసుకుంటా తమ స్థాయిని మరింత దిగజార్చుకుంటున్నారని, ఒకరి విషయాలు మరొకరు బయటపెడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News