మోడీ సర్కార్ ను షేక్ చేసిన రాఘవ్ చడ్డాను ఆప్ ఎందుకు తొలగించింది.. ఏం జరిగింది?

రాఘవ్ చడ్డా... ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో ఒకప్పుడు కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తుడు, పార్లమెంటులో పార్టీ గళాన్ని బలంగా వినిపించే యువ నేత.;

Update: 2026-04-03 17:30 GMT

రాఘవ్ చడ్డా... ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో ఒకప్పుడు కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తుడు, పార్లమెంటులో పార్టీ గళాన్ని బలంగా వినిపించే యువ నేత. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. రాజ్యసభలో పార్టీ ఉపనేత పదవి నుంచి ఆయన్ను తొలగించడం జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అసలు రాఘవ్ చడ్డాను ఆప్ ఎందుకు పక్కన పెట్టింది? ఆయన చేసిన తప్పేంటి? ఈ పరిణామాల వెనుక ఉన్న రాజకీయ కోణాలేమిటి అన్నది హాట్ టాపిక్ గా మారింది.

విధేయుడిపై వేటు..ఏం జరిగింది?

రాజ్యసభలో ఆప్ తరపున అత్యంత చురుగ్గా వ్యవహరించే రాఘవ్ చడ్డాను అకస్మాత్తుగా డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. దీనిపై చడ్డా స్పందించిన తీరు పార్టీలో ముదిరిన అసమ్మతిని స్పష్టం చేస్తోంది. "ప్రజా సమస్యల గురించి మాట్లాడటం నేరమా? నేను నా గళాన్ని ప్రజల కోసమే ఉపయోగించాను. నన్ను మాట్లాడకుండా చేయాలని మా పార్టీనే రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాయడం బాధాకరం " అని చడ్డా ఆవేదన వ్యక్తం చేశారు.

ఆప్ వివరణ వర్సెస్ చడ్డా వాదన

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. రాఘవ్ చడ్డా గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని.. ముఖ్యంగా కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన సమయంలోనూ ఇతర కీలక సమయాల్లోనూ ఆయన విదేశాల్లో ఉండటం లేదా అందుబాటులో లేకపోవడంపై అధిష్ఠానం అసంతృప్తితో ఉంది. క్రమశిక్షణారాహిత్యం పేరుతోనే ఆయనపై ఈ చర్య తీసుకున్నట్లు ఆప్ సంకేతాలిస్తోంది. అయితే రాఘవ్ చడ్డా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. తాను పార్లమెంటులో లేవనెత్తిన అంశాలే తనకు శాపంగా మారాయా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎయిర్‌పోర్టుల్లో ఆహార పదార్థాల అధిక ధరలు... గిగ్ వర్కర్ల (డెలివరీ బాయ్స్, డ్రైవర్లు) సంక్షేమం...

టోల్ ప్లాజాల వద్ద జరుగుతున్న దోపిడీ... టెలికాం సంస్థల రీఛార్జ్ ప్లాన్ల పెంపు లాంటి వాటిపై మాట్లాడినందుకు తనను నొక్కివేస్తున్నారని "నేను నది లాంటి వాడిని.. సమయం వచ్చినప్పుడు వరదలా మారుతాను" అంటూ ఆయన చేసిన హెచ్చరికలు పార్టీతో తెగతెంపులకు సిద్ధమైనట్లు సూచిస్తున్నాయి.

భాజపా వైపు చూపు? ఊహాగానాలు ఇవే..

చడ్డా వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో మరో బలమైన ప్రచారం జరుగుతోంది. ఆయన త్వరలోనే భారతీయ జనతా పార్టీ లో చేరే అవకాశం ఉందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. మోడీ సర్కార్‌ను తీవ్రంగా విమర్శించే చడ్డా ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్తారా అన్నది సందేహమే అయినా రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. ఒకవేళ ఆయన ఆప్ వీడితే అది పంజాబ్ , ఢిల్లీ రాజకీయాల్లో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే భావించాలి.

ఆప్‌లో అంతర్గత సంక్షోభం?

కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. కీలక నేతల మధ్య సమన్వయ లోపం, ఆధిపత్య పోరు ఇప్పుడు రాఘవ్ చడ్డా రూపంలో బయటపడింది. చడ్డాను పక్కన పెట్టి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీని ప్రక్షాళన చేయాలని కేజ్రీవాల్ భావిస్తున్నారా? ప్రజల్లో క్రేజ్ ఉన్న యువ నేత ఎక్కడ తనను మించిపోతాడో అన్న భయంతో పార్టీ పెద్దలే ఆయన్ను అణచివేస్తున్నారా? అన్నది అనుమానంగా మారింది.

రాఘవ్ చడ్డా తదుపరి అడుగుపైనే ఇప్పుడు అందరి కళ్లు ఉన్నాయి. ఆయన తిరుగుబాటు చేస్తారా లేదా సర్దుకుపోతారా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా మోడీ సర్కార్‌ను షేక్ చేసిన గళం.. ఇప్పుడు సొంత పార్టీలోనే పోరాడాల్సిన పరిస్థితి రావడం విచారకరం.

Tags:    

Similar News