రవీంద్రుడి ఇల్లు ధ్వసం.. బంగ్లాదేశ్ లో ఆగని విధ్వంసం
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆ దేశంలో హింసాత్మక ఘటనలు పెరిగాయి.;
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆ దేశంలో హింసాత్మక ఘటనలు పెరిగాయి. ముఖ్యంగా హిందువులు, ఇతర మైనార్టీ సముదాయాలపై దాడులు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ కవి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్‌కు చెందిన చారిత్రాత్మక కచ్చారిబారి ఇల్లు దాడులకు గురైంది. సిరాజ్‌గంజ్ జిల్లాలోని షాజహాన్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఠాగూర్ పూర్వీకుల నివాసం, రవీంద్ర కచ్చారిబరిపై ఓ గుంపు దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఆ ఇంటి కిటికీలు, తలుపులు, ఫర్నిచర్, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ దాడికి కారణం ఓ చిన్న వివాదమే కావడం ఆందోళన కలిగించే అంశం. కచ్చారిబరిని సందర్శించడానికి వచ్చిన ఓ సందర్శకుడు మోటార్ సైకిల్ పార్కింగ్ ఛార్జీల విషయంలో అక్కడి ఉద్యోగులతో వాగ్వాదానికి దిగాడు. ఈ వాగ్వాదం తీవ్రమై, సందర్శకుడిని కార్యాలయంలోకి లాక్కెళ్లి కొట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఉద్రిక్తతను ఆసరాగా చేసుకుని కొంత మంది కచ్చారిబారిపై దాడి చేశారు.
ఈ దాడిలో జమాతే-ఇ-ఇస్లామి, హెఫాజత్-ఇ-ఇస్లాం వంటి రాడికల్ సంస్థల సభ్యులు కూడా ఉన్నారని సమాచారం. వారు ఠాగూర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళనకరంగా ఉన్నాయని భారత పార్లమెంటులో పేర్కొంది.
ప్రస్తుతం సంఘటనా స్థలంలో పోలీసులు మోహరించగా, ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. చారిత్రకంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న కచ్చారిబారి ఇల్లు ధ్వంసమవడం పట్ల సాహితీ ప్రపంచం సహా భారతదేశంలోని పలువురు ప్రముఖులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతుందా? దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటారా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటన పట్ల భారత పార్లమెంటు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీల హక్కులు, వారి ఆస్తులు, ప్రదేశాలు కాపాడాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వానిదని పేర్కొంది.
బంగ్లాదేశ్‌లో మతరాధారిత హింస కొత్త విషయం కానప్పటికీ, నోబెల్ బహుమతి గ్రహీత అయిన ఠాగూర్‌కు చెందిన చారిత్రక కట్టడంపై దాడి జరగడం ఆ దేశంలోని మౌలికవాద దృక్పథాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఇది భారత దేశంతో పాటు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల దృష్టిని ఆకర్షించేలా ఉంది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.