కొత్త పంచాయతీ... ఇంతకూ తొలి స్వదేశీ క్వాంటం కంప్యూటింగ్ ఎవరిది..?
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటర్ విషయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.;
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటర్ విషయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. భారతదేశంలో తొలి స్వదేశీ క్వాంటం కంప్యూటర్ ను ఏపీలో ఏర్పాటు చేయబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించగా.. అది తమ రాష్ట్రంలో స్టార్ట్ అయ్యి మూడు నెలలు కావొస్తుందని కర్ణాటక చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
అవును... దేశంలోనే తొలి స్వదేశీ గా తయారైన 8 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ నవంబర్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రముఖ టెక్నాలజీ సంస్థ క్యూపీఐఏఐ సహకారంతో, నేషనల్ క్వాంటం మిషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ క్వాంటం కంప్యూటర్.. వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్య సేవల రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుందని ఈ సందర్భంగా ఏపీ సీఎం తెలిపారు. ఇది భారతదేశంలో క్వాంటం టెక్నాలజీలో ఒక పెద్ద అడుగు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. క్యూపీఐఏఐ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఖండించిన కర్ణాటక!:
ఆ సంగతి అలా ఉంటే... ఈ విషయంపై తాజాగా కర్ణాటక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎన్.ఎస్.బోసె రాజు స్పందించారు. ఈ సందర్భంగా.. బెంగళూరుకు చెందిన క్యూపీఐ ఏఐ సంస్థ నిర్మించిన 'ఇండస్' అనే 25 క్విట్ క్వాంటం కంప్యూటర్ ఇప్పటికే (ఏప్రిల్ 2025) తమ రాష్ట్రంలో వాణిజ్య సేవలు అందిస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా... ఆరోగ్య సంరక్షణ, రక్షణ, ఆర్థికం వంటి రంగాల్లో ఇది ఇప్పటికే పనిచేస్తోందని మంత్రి బోసె రాజు తెలిపారు. క్వాంటం ఆవిష్కరణలో కర్ణాటక రాష్ట్రం యావత్ దేశాన్ని నడిపిస్తోందని, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో భారతదేశపు మొట్టమొదటి క్వాంటం రీసెర్చ్ పార్క్ కూడా స్థాపించబడిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా... వాస్తవాలు మాట్లాడుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుదామంటూ చంద్రబాబు నాయుడుకు కర్ణాటక మంత్రి సూచించారు.
మొన్న ఏరో స్పేస్ గురించి...!:
కాగా... ఇటీవల ఏరో స్పేస్ తయారీ ఆధిపత్యానికి సంబంధించిన వాదనలపైనా ఏపీ, కర్ణాటకల మధ్య ఇలాంటి ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... రెండు ప్రభుత్వాలు తమ రాష్ట్రాలను భారతదేశ ఏరోస్పేస్ పరిశ్రమకు భవిష్యత్తుగా చూపించాయి.
ఇందులో భాగంగా... కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ప్రతిపాదిత ఏరోస్పేస్ పార్క్ కోసం దేవనహళ్లీ తాలుకాలో 1777 ఎకరాల వ్యవసాయ భూములను సేకరించే ప్రతిపాదనను కర్నాటక ప్రభుత్వ విరమించుకుంటుందని.. సీఎం సిద్దరామయ్య ప్రకటించిన అనంతరం... ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇందులో భాగంగా... ఈ విషయం తెలిసిన తర్వాత తనకు బాధగా ఉందని.. మీ కోసం తమ దగ్గర మంచి ఆలోచన ఉందని.. మీరు ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూడకూడదు? అంటూ ఏరో స్పేస్ ఇండస్ట్రీని లోకేష్ ప్రశ్నించారు. మీ కోసం మా వద్ద ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీ ఉందని.. 8000 ఎకరాలకు పైగా భూమి సిద్ధంగా ఉందని అన్నారు.
ఈ నేపథ్యంలోనే కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. కర్ణాటక భూమిని మాత్రమే అందించదని.. ఇది భారతదేశంలో నంబర్ 1 ఏరోస్పేస్ & డిఫెన్స్ ఎకోసిస్టమ్ ను అందిస్తుందని.. తామంతా దశాబ్దాలుగా దేశంలోనే బలమైన ఏరోస్పేస్ స్థావరాన్ని నిర్మించామని.. భారతదేశ ఏరోస్పేస్ ఉత్పత్తిలో 65% తోడ్పడి జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో నిలిచామని వెల్లడించారు.