ఏనుగమ్మ ఏనుగు.. పుతిన్ ఎక్కని ఏనుగు.. పాతికేళ్ల నాడు తీరని కోరిక
అది 2000 సంవత్సరం.. రష్యాకు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పుతిన్. అప్పటికి ఆయన గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు.;
అది 2000 సంవత్సరం.. రష్యాకు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పుతిన్. అప్పటికి ఆయన గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఆ తర్వాత కొద్ది రోజులకే చిరకాల మిత్ర దేశం భారత్ కు వచ్చారు. అప్పటి ప్రధాని వాజ్ పేయీ ఘనంగా స్వాగతం పలికారు. అలా రష్యా అధ్యక్షుడు కాగానే మన దేశానికి వచ్చిన పుతిన్ పర్యటన విజయవంతంగా సాగింది. ఢిల్లీలో ఆయనకు అతిథి మర్యాదలు ఘనంగా జరిగాయి. భారత్ పై తన ఇష్టాన్ని వ్యక్తం చేసిన పుతిన్.. హ్యాపీగా స్వదేశం తిరిగి వెళ్లిపోయారు. కానీ, ఆయనకు ఒక కోరిక మిగిలిపోయింది. ఎందుకనో గాని.. అంతకుముందు భారత్ కు వచ్చిన రష్యా అధ్యక్షులకు దక్కిన ఒక మర్యాద పుతిన్ కు దక్కలేదు. ఈ విషయం అప్పట్లో చర్చనీయం అయింది.
జంతు ప్రేమికుడు పుతిన్..
పాతికేళ్ల కిందట పుతిన్ కు దక్కని గౌరవం మిగతా వారి విషయంలో అయితే పట్టించుకోనవసరం లేదు. కానీ, జంతు ప్రేమికుడిగా పేరున్న పుతిన్ కు కావడంతోనే చెప్పుకోవాల్సి వస్తోంది. రష్యా అధ్యక్షుడిగా తిరుగులేని అధికారం చెలాయించే పుతిన్ కు జంతువులంటే విపరీతమైన ప్రేమ. మరీ ముఖ్యంగా కుక్కలంటే వల్లమాలిన ఇష్టం. ప్రపంచ నాయకుల నుంచి బహుమతులుగా పలు జాతుల శునకాలను అందుకున్నారు. తరచూ జంతువులతో ఫొటో షూట్ లు కూడా చేస్తుంటారు. ఓ భారీ పులిని గతంలో ఆయన అడవిలోకి విడుదల చేస్తున్న వీడియో వైరల్ అయింది. దానిని పుతిన్స్ టైగర్ అని కూడా పిలుస్తుంటారు.
పుతిన్ -ఎలుగుబంటి...
పుతిన్ -ధ్రువపు ఎలుగుబంటి ఓ ప్రత్యేకత ఉంది. తరచూ రష్యా అధ్యక్షుడు ఎలుగుబంట్లను మచ్చిక చేస్తుంటారు. విదేశాల నేతలకు బహుమతిగా అందిస్తుంటారు. ఇటీవల ఉత్తర కొరియా నియంత కిమ్ కు ఇలానే సింహంతో పాటు రెండు ఎలుగుబంట్లను ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాల్లో భాగంగా... 2010లో ధ్రువపు ఎలుగుబంటికి పుతిన్ ట్యాగ్ అమర్చారు. గతంలో ఓసారి పుతిన్ ను ఎలుగుబంటి దాడి నుంచి భద్రతాధికారి కాపాడారు. ఆయనను గుర్తుంచుకుని మరీ ఉన్నత పదవి కల్పించారు.
ఏనుగు-ఎలుగు-డ్రాగన్
రష్యాకు సింబాలిక్ గా మీడియాలో ఎలుగుబంటిని ఉపయోగిస్తుంటారు. భారత్-చైనా-రష్యా సంబంధాల గురించి చెప్పాల్సి వచ్చినపుడు ఏనుగు-డ్రాగన్-ఎలుగుబంటి కలిశాయని విశ్లేషిస్తుంటారు. ఇక రష్యాలో ఏనుగులు ఉండవు. చలి దేశం కావడంతో అక్కడ మనుగడ సాగించలేవు. అందుకే వారు భారత్ లో ఏనుగులను ఆశ్చర్యంగా చూస్తుంటారు. రష్యా అధ్యక్షులు వచ్చినప్పుడు వారిని మన దేశంలో ఏనుగులపై (అంబారీ) ఊరేగిస్తుంటారు. కానీ, 2000లో పుతిన్ కు ఏనుగు అంబారీ దక్కలేదు.