మహిళల పట్ల వాడే భాష...జర జాగ్రత్త సుమీ
ఇక ఈ రోజున మహిళలు అనేక సవాళ్ళతో కూడిన రంగాలలో పనిచేస్తున్నారని విజయాలు సాధిస్తున్నారు అని గుర్తు చేశారు.;
ఎంత సాంకేతికత అందుబాటులోకి వస్తే అంత సౌఖ్యం ఉంటుంది. దానితో పాటుగా సవాల్ కూడా పొంచి ఉంటుంది. ఇది ఎక్కువగా మహిళల విషయంలో ఉంటుంది. దానిని అధిగమించగలిగితేనే సాంకేతిక ఫలితాలు సంపూర్ణంగా అందుకున్న సార్ధకత దక్కుతుంది. ఈ విషయం మీద ఆదివారం తిరుపతి వేదికగా జరుగుతున్న జాతీయ మహిళా సాధికార సదస్సు దృష్టి పెట్టి సరైన పరిష్కారాలను చూపిస్తుంది అని అంటున్నారు పార్లమెంట్ మహిళా సాధికార కమిటీ చైర్ పర్సన్ దగ్గుబాటి పురందేశ్వరి. ఆమె ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ మహిళా సాధికారత గురించి అనేక విషయాలను చెప్పారు.
అభివృద్ధి వారితోనే :
జనాభాలో సగం దాకా ఉన్న మహిళలు అవకాశాలలో కూడా సగం అందుకోవాలని ఆమె అంటున్నారు. మహిళలు ఏ విషయంలోనూ ఎవరితోనూ తీసిపోరని అన్నారు. వారు ఎంతో నైపుణ్యం సాధిస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ విషయంలో కూడా ముందున్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా గ్రామీణ మహిళలు ఈ విషయంలో ఎలా చేస్తారు అన్న అనుమానాలు ఉంటే వాటిని పటాపంచలు చేశారు అని ఆమె అన్నారు. అనేక యాప్ లను కూడా వారు ఉపయోగిస్తూ టెక్నాలజీని బహు చక్కగా ఉపయోగించుకుంటున్నారు అని అన్నారు.
సవాళ్ళతో సావాసం :
ఇక ఈ రోజున మహిళలు అనేక సవాళ్ళతో కూడిన రంగాలలో పనిచేస్తున్నారని విజయాలు సాధిస్తున్నారు అని గుర్తు చేశారు. తమ కమిటీ ఇటీవల కోల్ కమిటీ ఇండియాని సందర్శించినపుడు అనేక మంది మహిళలు మైనింగ్ విభాగంలో కూడా పనిచేస్తూ కనిపించారు అని అన్నారు. అంతే కాదు ఎన్ఐటీలు ఐఐటీ వంటి ప్రముఖ విద్యా సంస్థలలో మహిళలు ఎక్కువ అవకాశాలు అంది పుచ్చుకుంటున్నారు అని అన్నారు. కీలక రంగాలలో గతంతో పోలిస్తే ఈ రోజున మహిళల పాత్ర చాలా అధికంగా ఉంటోంది అని పురంధేశ్వరి అన్నారు.
జెండర్ న్యూట్రల్ భాషా వియోగం :
లింగ వివక్ష లేని భాషను అంతా వాడాలి అది విరివిగా వినియోగంలోకి రావాలని ఆమె కోరారు పార్లమెంట్ లో జెండర్ న్యూట్రల్ భాషా వియోగాన్ని స్పీకర్ ఓం బిర్లా ప్రవేశపెట్టారని ఆమె చెప్పారు. లోక్ సభలో ప్రవేశ పెట్టే బిల్లు కానీ తీర్మానాల్లో కానీ ఎక్కడా లింగ వివక్ష లేని విధానం అమలు చేస్తున్నారని అది రాష్ట్రాలు కూడా అందిపుచ్చుకోవాలని అంతే కాదు గ్రామీణ స్థాయి వరకూ దీనిని తీసుకుని వెళ్ళాలని ఆమె అభిప్రాయపడ్డారు.
డ్రోన్ల ద్వారా పొలం పనులు :
డ్రోన్ల ద్వారా పొలాలలో పనులు చేయడం అన్నది మహిళలకు సాధ్యమా అని అనుకున్నారని ఈ రోజున కేంద్రం ప్రవేశపెట్టిన డ్రోన్ దీదీ పధకం విజయవంతం అయింది అని ఆమె అన్నారు. శిక్షణ పొందిన మహిళలు పొలలలో పురుగుల మందులు ఎరువుల పిచికారీ సులువుగా చేయగలుగుతున్నారని ఆమె అన్నారు మహిళలు ఈ రంగంలో రాణించేలా కేంద్రం కూడా ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటోంది అని అన్నారు.
మహిళలకు సైబర్ సెక్యూరిటీ :
ఈ రోజున ఐటీ ఫీల్డ్ లో పనిచేసే మహిళల నుంచి ఒక కూలి పనిచేసుకునే మహిళ వరకూ అందరికీ సైబర్ సెక్యూరిటీ కావాల్సిన అవసరం ఉందని పురంధేశ్వరి చెప్పారు. ఆన్ లైన్ లో మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని ఆమె చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలకు ఎదురయ్యే ఇబ్బందుల మీద చర్యలు తీసుకోవాలని ఐటీ హోం మంత్రిత్వ శాఖలకు పార్లమెంట్ మహిళా సాధికార కమిటీ సూచించింది అని ఆమె తెలిపారు. అన్ని వర్గాలతో మెధావులతో చర్చించి మహిళలకు సైబర్ సెక్యూరిటీ అందించే విషయంలో తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తల గురించి ఆయా మంత్రిత్వ సాశఖలకు నివేదికలను పంపిస్తున్నామని చెప్పారు.
జెండర్ బడ్జెటింగ్ :
ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే బడ్జెట్ లో మహిళలకు కూడా సమాన వాటా ఉండాలని ఆమె అన్నారు. అయితే ప్రభుత్వాలు కేటాయిస్తున్న మొత్తాలు మహిళల కోసం ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు అన్నది ముఖ్యమని అన్నారు. తిరుపతిలో జరిగే సదస్సులో ఈ విషయాల మీద కూడా కూలంకషంగా చర్చిస్తున్నట్లుగా ఆమె చెప్పారు. ఈ రోజున మహిళలు బహుముఖీయమైన ప్రతిభను చూపిస్తున్నారని ఆమె అన్నారు. అవకాశం రావాలే కానీ తమ ప్రతిభను చాటుకుంటున్నారు అని ఆమె అంటూ తాము కూడా ఎన్టీఆర్ కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చినా నేనేమిటో నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నానని ఆమె చెప్పారు.