జగన్‌కు పులివెందుల అగ్ని పరీక్ష.. అప్పుడు కుప్పంలో చేసినట్లే..
పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఇంకా ఏడాది పదవీకాలం మాత్రమే ఉంది. ఇక్కడ గెలవడం ద్వారా జడ్పీ రాజకీయాలు కూడా ఏమాత్రం ప్రభావితం కావు.;
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో రాజకీయం వేడెక్కింది. వైఎస్ కుటుంబానికి ఓటమే లేని పులివెందులలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయనే ఉత్కంఠ రేపుతున్నాయి. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి ఇంతవరకు ఎదురులేదు. వారికి ఎదురు నిలిచి గెలిచిన చరిత్ర కూడా ఎవరికీ లేదు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందులలో మరింత పట్టు సాధించారు. వైఎస్ ఫ్యామిలీ నుంచి అభ్యర్థి ఎవరైనా ప్రత్యర్థి డిపాజిట్ తెచ్చుకోవడం కూడా గగనమని గత గణాంకాలు చెబుతున్నాయి. వైఎస్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన మాజీ సీఎం జగన్మోహనరెడ్డి హయాంలో తన ప్రత్యర్థులను కూడా తనతో కలుపుకున్నారు. గతంలో వైఎస్ కుటుంబానికి ప్రత్యర్థిగా తలపడిన సతీశ్ రెడ్డిని వైసీపీలో చేర్చుకుని ఎమ్మెల్సీ చేశారు. ఈ పరిస్థితుల్లో పులివెందుల అంటే వైఎస్ కోటగా భావిస్తారు. అయితే తొలిసారిగా వైఎస్ కోటలో వణుకు పుట్టించేలా ఓ చిన్న ఎన్నిక ద్వారా టీడీపీ సవాల్ విసురుతోంది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది.
ఏకగ్రీవం కోసం వైసీపీ ప్రయత్నం?
మాజీ సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల జడ్పీటీసీ పదవికి ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో పులివెందుల జడ్పీటీసీని వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. అలా గెలిచిన జడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 1న నామినేషన్ల దాఖలకు గడువు ముగిసింది. గతంలో ఏకగ్రీవం చేసుకున్న స్థానాన్ని మళ్లీ ఏకగ్రీవం చేసుకోవడానికి తొలుత వైసీపీ ప్రయత్నాలు చేసింది. మహేశ్వరరెడ్డి భార్యను పోటీకి పెట్టి మరణించిన నేత కుటుంబానికే పదవి వదిలేద్దామని ప్రతిపాదన చేసింది. అయితే అధికార టీడీపీ కూటమి ఈ ప్రతిపాదనకు ఎంత మాత్రం అంగీకరించలేదని చెబుతున్నారు. దీనికి కారణం మాజీ ముఖ్యమంత్రి జగన్ పై పైచేయి సాధించే అవకాశం తొలిసారి దక్కడమే అంటున్నారు.
రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం
పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఇంకా ఏడాది పదవీకాలం మాత్రమే ఉంది. ఇక్కడ గెలవడం ద్వారా జడ్పీ రాజకీయాలు కూడా ఏమాత్రం ప్రభావితం కావు. కానీ, పులివెందుల గెలుపు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. అందుకే ఈ స్థానంలో గెలపును టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డిని బరిలోకి దింపింది. పులివెందులలో ఇప్పటివరకు వైఎస్ కుటుంబానిదే హవా అయినప్పటికీ తొలిసారి ఆ కుటుంబానికి చెక్ చెబుతామంటున్నారు బీటెక్ రవి. గతంలో అధికారం అండతో స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని, ఇప్పుడు ఆ అవకాశం తమకు వచ్చిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని పలువురు వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకుంటున్నారు. వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు.
అవినాశ్ రెడ్డికి గెలుపు బాధ్యత
మరోవైపు సిట్టింగు స్థానాన్ని కాపాడుకోవడం వైసీపీకి ముఖ్యంగా అధినేత జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యతలను ఎంపీ అవినాశ్ రెడ్డికి అప్పగించారు జగన్. కడప పార్లమెంటు పరిధిలో రెండు చోట్ల జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఒకటి పులివెందుల కాగా, మరొకటి ఒంటిమిట్ట. ఇక్కడ జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఒంటిమిట్టలోనూ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. అయితే ఒంటిమిట్ట ఫలితం ఎలా ఉన్నా పులివెందుల నిలుపుకోవడం వైసీపీకి ప్రాణసంకటంగా మారిందని అంటున్నారు. ఇక్కడ ఏ మాత్రం పొరపాటు జరిగినా అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోయిన పార్టీకి మరింత నష్టమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్ సొంత ఇలాకాలో ఓటమి అన్న ఊహనే వైసీపీ కేడర్ తట్టుకోలేకపోతున్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉండగా, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో స్థానిక సంస్థలు అన్నింటిని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నాటి పరాభవానికి తగిన సమాధానం పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ద్వారా తెలియజేయాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. దీంతో పులివెందుల సమరం రాష్ట్ర రాజకీయాన్ని ఆకర్షిస్తోంది.