అవినాష్ సత్తా తేల్చే ఉప ఎన్నిక
కడప లోక్ సభ నుంచి మూడుసార్లు వరసగా వైఎస్ అవినాష్ రెడ్డి గెలిచారు. ఆయన పదకొండేళ్లుగా ఎంపీగా కొనసాగుతున్నారు.;
కడప లోక్ సభ నుంచి మూడుసార్లు వరసగా వైఎస్ అవినాష్ రెడ్డి గెలిచారు. ఆయన పదకొండేళ్లుగా ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన మొత్తం కడప జిల్లాకే బాధ్యత వహిస్తూ వైసీపీ రాజకీయాలను చేస్తున్నారు. ఆయన పరిధిలోని పులివెందులలో జెడ్పీటీసీకి ఉప ఎన్నిక వచ్చి పడింది. ఇదిపుడు అవినాష్ సత్తాను తేల్చేదిగా మారబోతోంది. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఉన్నా ఆ బాధ్యతలను మొత్తం చూసుకునేది అవినాష్ రెడ్డి అన్నది తెలిసిందే.
మరో వివేకా మాదిరిగా :
ఒకపుడు వైఎస్సార్ కి తోడబుట్టిన తమ్ముడుగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి పులివెందుల బాధ్యతలను మోసేవారు. ఆయన ఎమ్మెల్యే కాకపోయినా అనధికారికంగా ఆ హోదాలో కొనసాగేవారు. ఆయన వైఎస్సార్ లేని లోటు ఎక్కడా కనబడనిచ్చేవారు కాదు. ఏ సమస్య వచ్చినా జనాలు వివేకా వద్దకే వెళ్ళేవారు. ఆయన సైతం దానికి సరైన పరిష్కారం చూపేవారు. ప్రజలతో పాటే నేరుగా వచ్చి అధికారులను కలసి దానిని పరిష్కరించేవారు. అలా ఆయన పులివెందులను వైఎస్సార్ కుటుంబానికి పెట్టని కోటగా మార్చేశారు. ఇపుడు అవినాష్ రెడ్డి మరో వివేకాగా ఉన్నారా ఉంటే ఎంతవరకూ అన్నది ఈ ఉప ఎన్నిక తేల్చనుంది.
చిన్న ఎన్నిక పెద్ద సమరం :
పులివెందుల జెడ్పీటీసీ నిజానికి చాలా చిన్న ఉప ఎన్నిక. కేవలం పది వేల మంది ఓటర్లు ఉన్న ఎన్నిక. పైగా మరో ఏడాదితో ఈ జెడ్పీటీసీ పదవులకు కాల పరిమితి పూర్తి అవుతుంది. అంటే బొత్తిగా ఏడాది కూడా గెలిచిన వారికి అవకాశం లేదు అన్న మాట. ఇక చూస్తే జెడ్పీటీసీలకు ప్రత్యేకంగా అధికారాలు కూడా లేవు. జెడ్పీ మీటింగులకు వెళ్ళడం సమస్యలు చెప్పడం వరకే పరిమితం అవుతారు. మరి అటువంటపుడు రాష్ట్ర స్థాయిలోనే ప్రతిష్టగా ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఆ జెడ్పీటీసీ పులివెందులలో ఉంది కాబట్టి. వైఎస్ జగన్ సొంత ఇలాకా కాబట్టి. అందుకే దానికి అంత ప్రాముఖ్యత వచ్చింది.
అభ్యర్థులు వీరే :
ఈ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ కూటమి తరఫున పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి సతీమణీ లతా రెడ్డి అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నామినేషన్లు రెండు వైపులా పడ్డాయి. ఇక నామినేషన్ ఘట్టం అయితే పూర్తి అయింది అసలైన ఎన్నిక ఈ నెల 12న ఉంది. చూస్తే కనుక పట్టుమని పది రోజులు కూడా వ్యవధి లేదు ఈ ఉప ఎన్నికను టీడీపీ కూటమి చాలా ప్రతిష్టగా తీసుకుంటోంది. పైగా మందీ మార్బలం ఉంది. అధికారం ఉంది. అన్నీ ఉన్నాయి వైసీపీ విషయానికి వస్తే ఒంటరి పోరు చేయాలి. కూటమిలోని మూడు పార్టీలను ధీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అంతా అవినాష్ దే భారం :
ఒకే ఒక్క జెడ్పీటీసీ ఉప ఎన్నిక అంటే జగన్ జోక్యం నేరుగా ఉండదు. సలహాలు సూచనలే ఉంటాయి. బాధ్యతలు భారాలూ అన్నీ అవినాష్ రెడ్డికే ఆయా అప్పగిస్తారు. అలా చూస్తే పాల ముంచినా నీట ముంచినా అన్నట్లుగా అవినాష్ రెడ్డే అన్నీ చూసుకోవాలి. అధికారంలో టీడీపీ ఉంది కాబట్టి దేనికీ లోటు ఉండదు, ఏదీ చూసుకోవాల్సినది అంతకంటే లేదు. కానీ వైసీపీకే అన్ని రకాల సవాళ్ళూ ముందు ఉన్నాయని అంటున్నారు. బీటెక్ రవి సతీమణి అంటే నేరుగా బరిలో బీటెక్ రవి ఉన్నట్లే అని అంటున్నారు.
ఆయన గతంలో వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన వైఎస్ వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అపుడు కూడా వైసీపీ విపక్షంలో ఉంది. ఇపుడు అదే సెంటిమెంట్ తో గట్టిగా దెబ్బ తీయాలని కూటమి స్కెచ్ గీస్తోంది. మరి అవినాష్ రెడ్డి వ్యూహాలు ఎలా ఉంటాయి ఏ విధంగా కూటమికి ఎదుర్కొంటారు అన్నది మరో 10 రోజులలో తేలిపోబోతోంది. ఇంతటి ఒత్తిడిలో పులివెందులను వైసీపీ సిట్టింగ్ సీటుగా నిలబెట్టుకున్నా రికార్డే. అలా కాకుండా టీడీపీ గెలిస్తే అది అతి పెద్ద రాజకీయ సంచలనమే అవుతుంది. ఎందుకంటే నేరుగా పులివెందుల నట్టింటే పసుపు జెండా ఎగురుతుంది కాబట్టి అని అంటున్నారు అంతా.