బీట‌క్ ర‌వి ఇలా అయితే క‌ష్ట‌మే బాసు...!

అయినప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లో జగన్ను ఓడించి పులివెందులను కైవసం చేసుకోవాలన్నది టిడిపి రాజకీయ వ్యూహాల్లో ప్రధానమైనది.;

Update: 2026-04-16 11:30 GMT

పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ ను ఓడించాలి అన్నది టిడిపి పెట్టుకున్న భారీ లక్ష్యం. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే బలంగా పోరాడి, కూటమి ప్రభావం ఉన్న నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గం కైవసం చేసుకోవాలని భావించింది. కానీ, రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ఓడిపోయినా కడపలో కూడా బలమైన నియోజకవర్గాలను పోగొట్టుకున్నా.. పులివెందుల వంటి వైఎస్‌కు పట్టున్న నియోజకవర్గంలో జగన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది.

అయినప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లో జగన్ను ఓడించి పులివెందులను కైవసం చేసుకోవాలన్నది టిడిపి రాజకీయ వ్యూహాల్లో ప్రధానమైనది. దీనిని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. ముఖ్యంగా స్థానిక రైతులకు సాగునీటిని అందిస్తున్నారు. పట్టిసీమ నుంచి కూడా నీటిని పులివెందులకు తరలిస్తున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాల విషయంలో కూడా మెరుగైన సంతృప్తి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కానీ, ఇంత జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎంత చేస్తున్నప్పటికీ టిడిపి పరంగా కార్యక్రమాలు నిర్వహించే విషయంలోనూ.. కేడర్ను ముందుకు నడిపించే విషయంలోనూ ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న సీనియర్ నాయకుడు గత ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన బీటెక్ రవి వెనుక పడడం చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. వచ్చే ఎన్నికలనాటికి ఇక్కడ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో మరింతగా పని చేయాలని పదేపదే చెప్పినప్పటికీ ఎందుకు వినిపించుకోవడం లేదని ఇటీవల కడపలో పర్యటించిన సందర్భంగా బీటెక్ రవికి ఆయన సూటిగా చెప్పుకొచ్చారు.

ఇటీవల మంత్రి నారా లోకేష్ కూడా పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి సమీక్షించినప్పుడు బీటెక్ రవి వెనుకబడిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇలా కుదరదని భవిష్యత్తులో మనం పెట్టుకున్న లక్ష్యం సాధించి తీరేందుకు ఇప్పటినుంచి కష్టపడాలని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తే గత ఏడాది జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడంతోపాటు బీటెక్ రవి సతీమణి కూడా విజయం సాధించారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా తన హవా ప్రారంభమైందని రవి భావిస్తున్నట్టు స్థానికంగా చర్చ‌ నడుస్తోంది.

కానీ పులివెందుల‌లో వైయస్ అనుకూల వర్గాలు వైయస్ కుటుంబానికి అభిమాన వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో నియోజకవర్గంపై నిరంతరం దృష్టి పెట్టాలన్నది చంద్రబాబు ఆలోచన. ఆ దిశగా బీటెక్ రవి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే వచ్చే ఎన్నికలనాటికి మరోసారి గెలుపు గుర్రం ఎక్కుతారా లేదా అనేది సందేహంగా మారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News