తిరుపతిలో ఏం జరుగుతోంది? జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జికి అవమానం!
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శాప్ ఆధ్వర్యంలో తిరుపతి ఎన్టీఆర్ స్టేడియంలో అమరావతి చాంపియన్ షిప్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వస్తున్నారు.;
తిరుపతిలో కొందరు టీడీపీ నేతల హవా కారణంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు అవమానాలు ఎదరవుతున్నాయా? తమను నియోజకవర్గంలో ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారా? అంటే ఇటీవల చోటుచేసుకున్న ఓ ఘటనతో ఆ ఇద్దరికీ అవమానాలే ఎదురవుతున్నాయని అంటున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఏ నియోజకవర్గంలో అయినా జరిగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేను ఆహ్వానించాలి? అదే సమయంలో ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారిని అతిథులుగా పరిగణించాలి. అయితే తిరుపతిలో జరిగే ఓ కార్యక్రమంలో ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను ఆహ్వానించారో లేదో కానీ ఆ ఇద్దరు కూడా రాష్ట్ర మంత్రి రామప్రసాద్ రెడ్డి వచ్చిన కార్యక్రమానికి ముఖం చాటేయడం మాత్రం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.
క్రీడాపోటీలకు గైర్హాజరు
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శాప్ ఆధ్వర్యంలో తిరుపతి ఎన్టీఆర్ స్టేడియంలో అమరావతి చాంపియన్ షిప్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వస్తున్నారు. దీని ప్రారంభ కార్యక్రమానికి శాప్ చైర్మన్ రవి నాయుడు, రాష్ట్ర యువజన, క్రీడాశాఖ మంత్రిగా రామప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడి కొడుకు, సినీ నటుడు నారా రోహిత్, ఇతర టీడీపీ నాయకులు కూడా ఈ పోటీలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కానీ, జనసేనకు చెందిన తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా సుగుణమ్మ మాత్రం హాజరుకాలేదు. ఈ ఇద్దరూ తిరుపతిలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు వెళ్లకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
పట్టించుకోని మంత్రి
ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా సుగుణమ్మ తిరుపతి నియోజకవర్గంలో కీలక నేతలు. అయితే ఈ ఇద్దరినీ పక్కన పెట్టేలా ఇతర టీడీపీ నాయకులు వ్యవహరించడమే రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఏ రకంగా చూసినా ఆ ఇద్దరు రాకపోవడానికి ఏదో బలమైన కారణం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంపై కూటమికి చెందిన ఇద్దరు కీలక నేతలు కన్నెత్తి చూడకపోవడం, వారు ఎందుకు రాలేదన్న విషయంపై కార్యక్రమానికి వచ్చిన మంత్రి రామప్రసాద్ రెడ్డి కూడా పట్టించుకోకపోవడంపై జనసేన, టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే తమ నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేడర్లో అసంతృప్తి
స్థానిక టీడీపీ నేతలు హవా నానాటికి ఎక్కువ అవుతుండటంతోనే ఎమ్మెల్యే ఆరణి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ క్రీడా పోటీలకు గైర్హాజరయ్యారని వారి అనుచరులు చెబుతున్నారు. తిరుపతిలో తాము ఉంటుండగా, చోటామోటా నాయకులు పెత్తనం చెలాయించడాన్ని వారిద్దరూ జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే ఆరణి స్వస్థలం చిత్తూరు కాగా, గత ఎన్నికల ముందు జనసేన కోటాలో ఆయనకు తిరుపతి నియోజకవర్గం కేటాయించారు. అదే సమయంలో టీడీపీ తరఫున టికెట్ ఆశించిన సుగుణమ్మకు ప్రభుత్వం రాగానే నామినేటెడ్ పదవి ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే స్థానికేతరుడని, వచ్చే ఎన్నికల నాటి ఆయన ఇక్కడ ఉండరనే ఆలోచనతో కొందరు టీడీపీ నేతలు ఎమ్మెల్యేను ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సుగుణమ్మ వయసురీత్యా వచ్చేఎన్నికల నాటికి ఆమెకు పోటీచేసే అవకాశం ఉండదనే ఆలోచన కూడా కొందరు టీడీపీ నేతలు నిర్లక్ష్యం చేయడానికి కారణంగా అనుమానిస్తున్నారు. కారణం ఏదైనా సరే అధికారంలో ఉండగా, తమకు ఎదురవుతున్న అవమానాలపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం నొచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు.