ప్రధానిగా రాజీవ్ పర్యటిస్తే ఆమె షాక్ ఇచ్చింది....ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ !

రాజీవ్ గాంధీ ఈ దేశానికి అనూహ్యంగా ప్రధాని అయ్యారు. అలా కావాలని ఆయన ఏ కోశానా కోరిక అయితే లేదు.;

Update: 2025-11-06 23:30 GMT

రాజీవ్ గాంధీ ఈ దేశానికి అనూహ్యంగా ప్రధాని అయ్యారు. అలా కావాలని ఆయన ఏ కోశానా కోరిక అయితే లేదు. అసలు రాజకీయాలే ఆయనకు ఇష్టం లేదు. ఆయన తల్లి శ్రీమతి ఇందిరాగాంధీకి కూడా తన రాజకీయ వారసుడు సంజయ్ గాంధీ అనే బలంగా ఉండేది. చిన్న కొడుకునే ఆమె అలా తీర్చిదిద్దింది. అయితే సంజయ్ గాంధీ 1980 జూన్ లో దుర్మరణం పాలు కావడంతో రాజీవ్ గాంధీ బలవంతంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.

అయిదేళ్ల పాలన :

రాజీవ్ గాంధీ అయిదేళ్ళ పాటు పాలన చేసినా కూడా దేశాన్ని కీలక మలుపు తిప్పే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. కంప్యూటర్ నిదేశానికి పరిచయం చేయడంతో పాటు ఐటీ రంగానికి బీజాలు వేయడం కానీ టెలి ఫోన్ వ్యవస్థలో భారీ మార్పులు తేవడం కానీ రాజీవ్ గాంధీ సమయంలోనే జరిగాయి ఇదిలా ఉంటే రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉంటూ ఒకసారి తన సొంత లోక్ సభ నియోజకవర్గం అమేధీలో పర్యటించినపుడు ఆయనకు షాక్ ఇచ్చే సంఘటన జరిగిందట.

నిలదీసిన మహిళ :

రాజీవ్ అమేధీ పర్యటనలో ఒక సాధారణ మహిళ ప్రధానిని నేరుగా నిలదీసింది. తమ ప్రాంతానికి కుళాయిలు వేయిస్తామని చెప్పి ఎందుకు వేయలేదని ఒక దేశ ప్రధానినే ఆమె ప్రశ్నించిందట. అంతే కాదు మీకు మళ్ళీ ఓటేయబోమని కూడా రాజీవ్ గాంధీ ఎదుటనే చెప్పేసిందట. ఈ విషయం ఆనాటి పత్రికలు ఏ మేరకు కవర్ చేశాయో తెలియదు కానీ ఈ షాకింగ్ ఇన్సిడెంట్ ని ఇన్నేళ్ళ తరువాత రివీల్ చేసింది ఎవరో కాదు ఆయన కుమార్తె ప్రియాంకా గాంధీ.

ప్రజాస్వామ్యం అంటే :

ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ఆమె చెబుతూ తన తండ్రి ప్రధానిగా ఉన్నపుడు జరిగిన ఈ సంఘటనను గుర్తుకు తెచ్చారు. బీహార్ లో మహా ఘట్ బంధన్ ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ తనకు అపుడు పది పన్నెండు ఏళ్ళు ఉంటాయి. తన తండ్రి రాజీవ్ గాంధీని ఒక మహిళ నిలదీసిన సందర్భం తనకు ఇంకా గుర్తు అన్నారు. ఒక దేశ ప్రధానిని నిలదీసే స్వేచ్చ స్వాతంత్ర్యం ఆనాడు ఉంది అంటే అది కదా ప్రజాస్వామ్యం అని ఆమె చెప్పుకొచ్చారు.

ఎన్డీయే తీరిలా :

ఈ రోజున ప్రధానిని సాధారణ మహిళ సంగతి పక్కన పెడితే ఎవరూ కూడా ప్రశ్నించే పరిస్థితి లేదని ఆమె అన్నారు. ఒక భయానక వాతావరణం దేశంలో ఉంది అని ఆమె అన్నారు ప్రధానిని ప్రశ్నించాలని అనుకుంటే పోలీసులు కొడతారు అధికారులు అయితే నోరు మూయిస్తారు అని ప్రియాంక దేశంలో ఎన్డీయే పాలన మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ తన తండ్రి రాజీవ్ గాంధీ పాలనలో అలా లేదు, అంతా స్వేచ్చగా తమ హక్కులను వాడుకున్నారని ఆమె చెప్పారు. ఎప్పటికైనా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు వారే ప్రభువులు అని అది పాలకులు తెలుసుకోవాలని ప్రియాంకా గాంధీ అన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా అందరికీ అందుబాటులో ఉండేవారు అని సామాన్య ప్రజలకు ఆయన దగ్గరగా ఉండేవారు అని ప్రియాంకా గాంధీ చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే ప్రియాంకా గాంధీ చెప్పిన రాజీవ్ గాంధీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది.

Tags:    

Similar News