ప్రియాంక సెటైర్లు...అమిత్ షా నవ్వులు
కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఎంపీ అయిన ప్రియాంకా గాంధీ లోక్ సభలో ప్రత్యేక సమావేశాల తొలి రోజున జరిగిన చర్చలో మాట్లాడుతూ బీజేపీ మీద సెటైర్లు వేశారు.;
కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఎంపీ అయిన ప్రియాంకా గాంధీ లోక్ సభలో ప్రత్యేక సమావేశాల తొలి రోజున జరిగిన చర్చలో మాట్లాడుతూ బీజేపీ మీద సెటైర్లు వేశారు. ఆమె నెమ్మదిగా మాట్లాడుతూనే అధికార ఎన్డీయేకు చురకలు అంటించారు. దాంతో ఆమె మాటలకు సభలో ఉన్న హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు ఒక దశలో నవ్వుతూ ఆస్వాదించాల్సి వచ్చింది. ఇంతకీ ప్రియాంకా గాంధీ సభలో మాట్లాడుతూ ఏమన్నారు అంటే అపర చాణక్యం, పక్కా ప్లాన్ బీజేపీది అని. అంతే కాదు చాణక్యుడు దిగి వచ్చినా ఈ రోజు బీజేపీ కుయుక్తుల ముందు ఆయన కూడా ఎక్కడా సరిపోడని ఆమె బీజేపీ నేతల వ్యూహాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
కాషాయం తరహా కుయుక్తులు :
బీజేపీ వేస్తున్న ఎత్తులు పన్నుతున్న కుయుక్తులకు చాణక్యుడు బతికి ఉన్నా కూడా చూసి ఆశ్చర్యపోతారని ప్రియాంకా గాంధీ సభలో అన్నపుడు అమిత్ షాతో పాటు మంత్రి కిరణ్ రిజుజు కూడా నవ్వుతూ ఉండిపోయారు. ఒక వైపు దేశంలో రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రత్యేక సమావేశాలు పెట్టడం మహిళా బిల్లు అమలు అని చర్చలు జరపడం అందులో కూడా డీలిమిటేషన్ అని ముడి పెట్టడం ఇలా చేస్తూనే మహిళల కోసం ప్రధాని మోడీ అంతా చేస్తున్నారు అని మీడియా ద్వారా ప్రచారం చేయించుకోవడం ఇవన్నీ బీజేపీ కుయుక్తులు అని ఆమె ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ వ్యతిరేకం కాదు :
మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు అని ప్రియాంకా గాంధీ అన్నారు. అయితే మహిళా కోటా అమలు చేయాలంటూ డీలిమిటేషన్ ని ముందుకు తేవడం పట్లనే తాము వ్యతిరేకంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. ఇది పక్కా ప్లాన్ ఎన్నికల్లో గెలిచేందుకు ఒక రాజకీయ అస్త్రమని ఆమె విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని దెబ్బ తీస్తున్నారని అదే సమయంలో బీజేపీ తన రాజకీయ పునాదులను బలోపేతం చేసుకుంటోంది అని ఆమె నిందించారు
విపక్షాలు గందరగోళం :
సడెన్ గా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మహిళ బిల్లు డీలిమిటేషన్ ముడిపెట్టడం ద్వారా బీజేపీ తన వ్యూహాలను ఏమిటో చెప్పేసిందని, ఈ విధంగా విపక్షాలను గందరగోళంలో పడేసింది అని ఆమె విమర్శించారు. మహిళా అభ్యున్నతి అని బీజేపీ ఈ విధంగా చాటుకుంటూ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ఒక ఎత్తుగడగా ఆమె పేర్కొంటూ కాషాయం పార్టీ నేతల తీరుని తప్పు పట్టారు. లోక్ సభలో ప్రియాంకా మాట్లాడుతున్నంతసేపూ అధికార పక్షం కూడా ఆసక్తిగానే వింటూ వచ్చింది. ఇక ఆమె కూడా ఎక్కడ ఆగ్రహించాలో అక్కడ దానిని ప్రదర్శిస్తూ ఎక్కడ నవ్వుతూ చురకలు అంటించాలో అక్కడ అంటిస్తూ వచ్చారు మొత్తానికి ఒక పరిణతి చెందిన నాయకులురాలిగా ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ సభలో కాంగ్రెస్ వాదనను వినిపించడమే కాదు బీజేపీ మీద సెటైర్లు పేల్చారు. దాంతో అమిత్ షా సహా అంతా నవ్వుతూ ఉండిపోవాల్సి వచ్చింది.