ప్రేమ్ సాగర్ పక్క చూపులు.. ?
ఆయన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయాలు ప్రారంభించి.. ఈ పార్టీలోనే ఎదిగారు.;

ఆయన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయాలు ప్రారంభించి.. ఈ పార్టీలోనే ఎదిగారు. ఆ పార్టీని కూడా ఎదిగేలా చేశారు. ఆయనే మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు. గత 2023లో జరిగిన ఎన్నికల్లో బలమైన బీఆర్ఎస్‌ను ఎదిరించి.. విజయం దక్కించుకున్న ఆయన మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నించారు. అయితే.. ఆయనకు దక్కలేదు. పదే పదే ప్రయత్నాలు చేసినా.. అధిష్టానం నుంచి ఆయనకు అనుకూల నిర్ణయం రాలేదు. ఇదే సమయంలో ఇదే జిల్లాకు చెందిన వివేక్‌కు మంత్రి పదవి ఇచ్చారు.
దీంతో తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్న ప్రేమ్ సాగర్‌రావు.. తనకు మంత్రి పదవి రాకపోవడానికి కారణాలపై విమర్శలు చేస్తున్నారు. కొందరు తనను ఉద్దేశ పూర్వకంగానే అడ్డుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. రెండో విడత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు ఖచ్చితంగా చోటు ఉంటుందని ప్రేమ్ సాగర్ రావు అంచనా వేసుకున్నారు. అయితే.. రాష్ట్ర నేతలతో పనికాదని భావించిన ఆయన.. ఢిల్లీ వరకు ప్రయత్నించారు. కానీ, అక్కడ కూడా ఆయనకు సానుకూల నిర్ణయం రాలేదు. దీంతో స్థానికం గా ఉన్న నాయకులతో ఆదివారం ఆయన భేటీ అయ్యారు. 'వాట్ నెక్ట్స్?' అనే టైటిల్‌తో ఆయన ఈ భేటీ నిర్వహించారు.
పార్టీలో ఎలాంటి సానుకూలత కనిపించడం లేదని.. తనను పట్టించుకోవడం లేదని ప్రేమ్ సాగర్‌రావు వ్యాఖ్యానించారు. ''రెండు రోజుల కిందట 'పెద్దలను' కలిశాను. అయినా.. పనికాలేదు. ఏం చేయాలో మీరే చెప్పండి'' అని తన అనుచరులను ఆయన ప్రశ్నించారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ సమావేశంలో కీలకమైన పదిమంది అనుచరులతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ భేటీ అయ్యారు. రాజకీయంగా తనకు ఢోకా లేదన్న ఆయన.. అవకాశాలు కూడా అపారంగానే ఉన్నాయని వ్యాఖ్యానించడం గమ నార్హం. ''కేబినెట్ బెర్త్ ఖాయమని భావించినా పక్కన పెట్టడంతో తీవ్ర నిరాశకు గురయ్యా. వారి కంటే మనం ఏం తక్కువ.'' అని వ్యాఖ్యానించారు.
అయితే.. అనుచరులు మాత్రం మీ ఇష్టం .. మీరు ఎలాంటి నిర్నయం తీసుకున్నా.. మేం మీవెంటే అని తేల్చి చెప్పారు. దీంతో మరోసారి భేటీ అవుతామని తేల్చారు. ఇదిలావుంటే.. ఇటీవల ఏఐసీసీ చీఫ్ ఖర్గే తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను కలుసుకుని.. తన ఆవేదన చెప్పుకొనేందుకు ప్రయత్నించినా.. ప్రేమ్ సాగర్‌రావుకు అవకాశం రాలేదు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల విషయంలో ఆయనపై ఒత్తిడి ఉంది. ఈ క్రమంలో అసలు పార్టీ నుంచే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.