గవర్నర్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేత? రోడ్డుపై గర్భిణి భర్త నిరసన.. బెంగళూరులో వైరల్ వీడియో కలకలం!
దేశంలో వీఐపీ సంస్కృతి సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తోందనే విమర్శలు మరోసారి ఊపందుకున్నాయి.
దేశంలో వీఐపీ సంస్కృతి సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తోందనే విమర్శలు మరోసారి ఊపందుకున్నాయి. గవర్నర్ కాన్వాయ్ వెళ్లేందుకు వీలుగా దాదాపు అరగంట పాటు ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో ఓ గర్భిణి భర్త రోడ్డుపైనే కూర్చొని నిరసనకు దిగిన ఘటన ఐటీ హబ్ బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
అసలేం జరిగిందంటే..?
బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక గవర్నర్ కాన్వాయ్ హెచ్‌ఏఎల్ విమానాశ్రయం నుంచి ప్రయాణించాల్సి ఉంది. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఐఎస్‌ఆర్‌వో జంక్షన్ సమీపంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అయితే అప్పటికే అక్కడ అండర్‌పాస్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో రహదారి ఇరుకుగా మారి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
గర్భిణితో చిక్కుకున్న వ్యక్తి ఆవేదన..
ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వారిలో ఓ గర్భిణి, ఆమె భర్త కూడా ఉన్నారు. అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పటికీ వాహనాలను ముందుకు కదలనివ్వకపోవడంతో సదరు వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. గవర్నర్ ఇంకా ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరకముందే రోడ్డును బ్లాక్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నేరుగా జీబ్రా క్రాసింగ్‌పై కూర్చొని నిరసన వక్రీకరించాడు. "నా భార్య గర్భిణి.. అత్యవసర పరిస్థితిలో ఉన్నాం. వీఐపీల కోసం సామాన్యులను ఇంతసేపు రోడ్డుపై నరకం చూపించడం ఏంటి?" అని సదరు వ్యక్తి ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.
దీనికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' లో ఓ ఖాతాదారుడు పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం రంగంలోకి దిగిన హోయసళా పోలీసులు సదరు వ్యక్తిని రోడ్డుపై నుంచి లేపి, కాన్వాయ్‌కు మార్గం సుగమం చేశారు.
పోలీసుల వివరణ.. రంగంలోకి ఉన్నతాధికారులు
ఈ వివాదంపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. వీఐపీ మూవ్‌మెంట్ కోసం 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారనే ఆరోపణలను వారు ఖండించారు. సాధారణంగా అంతసేపు వాహనాలను నిలిపివేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల నేపథ్యంలో జీవన్ భీమా నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ "వైరల్ వీడియో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించాం. హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్ట్ నుంచి నిరసన జరిగిన జంక్షన్ వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేసినట్లు తేలితే బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.
మరోసారి తెరపైకి ‘వీఐపీ కల్చర్’ వివాదం..
ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీవ్రంగా ఉన్నాయని.. ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రోగులు, గర్భిణుల వాహనాలను ఆపేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సామాన్యుల అత్యవసర అవసరాల కంటే వీఐపీల భద్రతే ముఖ్యామా? అంటూ నెటిజన్లు పాలకులను, అధికారులను నిలదీస్తున్నారు.