టీవీకే తుఫాన్ వెనుక మాస్టర్‌మైండ్ ‘పీకే’ వ్యూహం

తమిళనాడు రాజకీయాల్లో సంచలనానికి కేంద్రబిందువైన ప్రశాంత్ కిషోర్ మరోసారి తన వ్యూహపాటవాన్ని నిరూపించుకున్నట్టు చర్చలు సాగుతున్నాయి.;

Update: 2026-05-04 10:42 GMT

తమిళనాడు రాజకీయాల్లో సంచలనానికి కేంద్రబిందువైన ప్రశాంత్ కిషోర్ మరోసారి తన వ్యూహపాటవాన్ని నిరూపించుకున్నట్టు చర్చలు సాగుతున్నాయి. ఒకప్పుడు “పీకే పని అయిపోయింది” అని విమర్శలు వచ్చినా… ఇప్పుడు అదే పీకే చెప్పిన మాట నిజమైందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం వెనుక ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి.

రాజకీయాలు ఒకప్పుడు సిద్ధాంతాల ఆధారంగా సాగేవి. కానీ కాలక్రమేణా అవి వ్యాపార ధోరణికి మారిపోయాయి. కుటుంబ రాజకీయాలు, బంధుప్రీతి, భారీ ఖర్చులు రాజకీయాల్లో పెరిగిపోయాయి. ఈ మార్పులో ఎన్నికల వ్యూహకర్తల పాత్ర ఎంతో కీలకమైంది. ఆ జాబితాలో ముందుండే పేరు ప్రశాంత్ కిషోర్‌ది. ఆయన వ్యూహాలు సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. ప్రజల మానసిక స్థితి, ఓటర్ల అభిరుచులు, ప్రాంతీయ అంశాలను విశ్లేషించి కచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత.

బీహార్‌లో జన్ సూరజ్ పార్టీతో నిరాశ చెందిన తర్వాత పీకే పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తమిళనాడు ఎన్నికల్లో ఆయన మరోసారి బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. టీవీకే పార్టీకి ఆయన వ్యూహకర్తగా వ్యవహరించడం ఈ ఎన్నికల్లో గేమ్‌చేంజర్‌గా మారింది. ముఖ్యంగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక పార్టీ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ… “చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో ఐదు సార్లు విజేతగా నిలిచింది. ప్రతి సారి మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహించారు. అలాగే నేను కూడా విజయ్ పార్టీని గెలిపిస్తాను” అని ప్రకటించారు. అలాగే విజయ్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోరని, ఒంటరిగానే పోటీ చేసి భారీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలు అప్పట్లో చాలామందికి అతిశయోక్తిగా అనిపించినా… ఫలితాలు వెలువడిన తర్వాత అవే నిజమయ్యాయి. టీవీకే పార్టీ ఏకపక్షంగా విజయం సాధించి, తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్ ముఖ్యమంత్రి పదవికి చేరువయ్యారు.

ఇక మరో ఆసక్తికర అంశం ఏమిటంటే… గతంలో ఎం.కే. స్టాలిన్ కు కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేశారు. అదే రాష్ట్రంలో ఇప్పుడు ఆయన కొత్త నాయకుడిని ముందుకు తీసుకురావడం రాజకీయాల్లో పెద్ద మార్పుగా విశ్లేషిస్తున్నారు.

టీవీకే నేతలు చెబుతున్నదేమిటంటే… ఈసారి పీకే వ్యూహం “స్లో పాయిజన్”లా పనిచేసిందని. ఒక్కసారిగా కాదు… క్రమంగా ప్రజల మద్దతు పెరిగేలా ప్రణాళిక అమలు చేశారని వారు పేర్కొంటున్నారు. గ్రౌండ్ లెవల్ క్యాంపెయిన్లు, డేటా ఆధారిత నిర్ణయాలు, సోషల్ మీడియా వినియోగం అన్ని కలిపి ఈ విజయం సాధ్యమైందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

మొత్తానికి… ఒకప్పుడు విమర్శల పాలైన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ తన ముద్ర వేసినట్టు స్పష్టమైంది. “చెప్పినది చేసి చూపించాడు” అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది.

Tags:    

Similar News