కూటమి దుప్పటి చాలడం లేదు...కాళ్ళూ వేళ్ళూ బయటకే !
తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో మొత్తం 144 స్థానాలకు పోటీ చేసి 135 స్థానాలకు గెలుచుకుంది. కూటమిలో పెద్దన్నగా టీడీపీ ఉంది.;
టీడీపీ కూటమి కట్టింది. ఉమ్మడి ఏపీలో కొత్త రాజకీయానికి తెర తీసింది. 1953 నుంచి ఆంధ్ర రాష్ట్రంగా ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయిన నాటి నుంచి చూస్తే కనుక సంకీర్ణ ప్రభుత్వాలు అన్నవి ఏపీలో లేవు. తొలి మూడున్నర దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యంగా అధికారాన్ని చలాయించింది. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయ్యాక అదే తీరు సాగింది. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయంగా బలమైన పార్టీగా ఉంటూ ఉమ్మడి ఏపీలో నాలుగు సార్లు, విభజన ఏపీలో రెండు సార్లు గెలిచింది. గెలిచిన ప్రతీ సారీ టీడీపీకి మంచి మెజారిటీయే దక్కింది. 2024లో మాత్రం టీడీపీ తొలిసారి మిత్రులతో కలసి అధికారాన్ని పంచుకుంది.
కొత్త అనుభవమే :
తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో మొత్తం 144 స్థానాలకు పోటీ చేసి 135 స్థానాలకు గెలుచుకుంది. కూటమిలో పెద్దన్నగా టీడీపీ ఉంది. ఏపీలో అధికారం చేపట్టాలి అంటే మ్యాజిక్ ఫిగర్ 88 అయితే టీడీపీకి అదనంగా 47 సీట్లు ఉన్నాయి. ఇక ఏపీలో మంత్రివర్గంలో టీడీపీకి 20 బెర్తుకు దక్కాయి. మిత్రులకు మరో నాలుగు ఇచ్చారు. ఒక సీటు ఖాళీగా ఉంది. 135 మంది గెలిస్తే 20 మందికే చాన్స్ అంటే ప్రతీ ఏడుగురు ఎమ్మెల్యేలలో ఒకరే మంత్రిగా ఉన్నారు. ఇక ఈసారి అంతా కొత్త వారినే ఎక్కువగా మంత్రులుగా తీసుకోవడంతో సీనియర్లలో అసంతృప్తి ఉంది అని ప్రచారంలో ఉంది. అలాగే సామాజిక సమీకరణలు సరిపోక చాలా మందికి చాన్స్ దక్కలేదు. ఆ ఆవేదన కూడా అనేక మందిలో ఉంచి అని అంటారు.
మిత్రులలో చూసుకుంటే :
ఇక మిత్ర పార్టీలుగా జనసేన బీజేపీ ఉన్నాయి. ఈ రెండు పార్టీలలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. జనసేన నుంచి పవన్ తో కలిపి ముగ్గురుకే అవకాశం దక్కింది. మరో ముగ్గురుకు అయినా సర్దుబాటు చేస్తే బాగుండుని అన్నది వారికి కూడా ఉందని అంటారు ఎందుకంటే కూటమి కట్టడంలో కానీ వేవ్ క్రియేట్ చేయడంలో కానీ జనసేన పాత్ర ముఖ్యంగా ఉంది కదా అన్నదే వారి వైపు వాదన. బీజేపీలో చూసుకుంటే ఒక్కరికే మంత్రిగా అవకాశం ఇచ్చారు. గతంలో 2014 నుంచి 2018 మధ్య నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి ఉంటే అందులో ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కింది. ఈసారి ఎనిమిది మంది గెలిస్తే కనీసం నలుగురు లేదా ముగ్గురు అయినా మంత్రులు కాలేరా అని ఆ మధ్య బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు కూడా.
సామాజికంగా లెక్కతో చిక్కు :
ఇంకో వైపు చూస్తే మిత్రులకు కొన్ని బెర్తులు ఇచ్చి ఆయా సామాజిక వర్గాలకు టీడీపీలో తగ్గించేశారు అన్నది ఉంది. దాంతో మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వారు సామాజిక కోణంలో కూడా లెక్కలే తమకు చిక్కులు తెచ్చాయా అని ఆవేదనతో ఉన్నారు. దాంతో వారు కూడా అసంతృప్తిని ఆపుకోలేకపోతున్నారు. అన్నీ కలసి వెరసి ఈసారి వర్షాకాల సమావేశాల్లో మెల్లగా సణుగుడుగా గొణుగుడుగా బయటకు వచ్చాయని అంటున్నారు.
సర్దుకోవడం అంటే :
ఒకే దుప్పటిలో ముగ్గురు అంటే ఎవరికి వారుగా ఇబ్బంది పడాల్సిందే. ఒద్దికగా ఉండాలని అనుకున్నా వీలు పడేది ఉండదు. ఎవరి కాళ్ళు అయినా బయట పెట్టాల్సి వస్తుంది. అలాగే ఎవరి చేతులు అయినా దుప్పటి ఆసరా లేక బయటకు ఉంచాల్సి వస్తుంది. ప్రస్తుతం టీడీపీ కూటమి అనే దుప్పటి చాలక అదే జరుగుతోందా అన్నది చర్చగా ఉంది. చూస్తే పట్టుమని పదిహేను నెలలే అయింది. ఇంకా మూడు వంతుల అధికారం ఉంది. మరి రానున్న రోజులల్లో ఈ దుప్పటిలో ఒద్దికగా ఉంటారా లేక ఏమి చేస్తారు అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.