ముందు నీ భార్యలకు న్యాయం చేయి పవన్: పోతుల సునీత
పవన్ కి బుర్ర లేదని, చంద్రబాబు జెండా, ఎజెండా పట్టుకుని తిరగడం తప్ప ఏమీ తెలీదని సంచలన వ్యాఖ్యలు చేశారు.;
జగన్ హయాంలో రాష్ట్రంలోని మహిళలకు తీరని అన్యాయం జరుగుతోందని జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వీర మహిళలతో సమావేశమైన పవన్...ఏపీలో మహిళల మిస్సింగ్ పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల రక్షణకు పెద్దపీట వేస్తానని, 33% సీట్లు వీర మహిళలకే కేటాయిస్తానని పవన్ హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రజాకోర్టు పెడతానని పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై వైసీపీ మహిళ నేత, ఎమ్మెల్సీ పోతుల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహిళల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు ఉందా అని ఆమె ప్రశ్నించారు. తన భార్యలకు పవన్ ఎలాంటి గౌరవం ఇచ్చాడో రాష్ట్ర ప్రజలకు తెలుసని, అటువంటి పవన్ కళ్యాణ్ మహిళలను గౌరవించి వారికి న్యాయం చేస్తాడా అని ఆమె నిలదీశారు.
అసలు ప్రజా కోర్టు అంటే ఏంటో పవన్ కు తెలుసా అని సునీత ప్రశ్నించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ తాపత్రయపడుతున్నారని, పవన్ తపనను కాపు జాతి ఎన్నటికీ క్షమించబోదని హెచ్చరించారు. స్త్రీల పుట్టుకను చంద్రబాబు గతంలో అవమానించారని, అటువంటి వ్యక్తితో పవన్ అంటకాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు స్క్రిప్ట్ చదివే ప్యాకేజీ స్టార్ గానే పవన్ ను ప్రజలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో మహిళలే మహ రాణులని, ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు జగన్ పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తున్నారని ప్రశంసించారు. ఇవేమీ పవన్ కు కనపడవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని అవమానించిన వారితోనే పవన్ ప్యాకేజీ సెట్ చేసుకున్నారని, ఆ రకంగా ఆయన తల్లిని పవన్ అవమానించారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
పవన్ కి బుర్ర లేదని, చంద్రబాబు జెండా, ఎజెండా పట్టుకుని తిరగడం తప్ప ఏమీ తెలీదని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పవన్ ఎంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారో అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.