మంత్రి పొన్నం వ‌ర్సెస్ మ‌హేష్ గౌడ్‌.. ఏం జ‌రిగిందంటే!

తెలంగాణ ర‌వాణా శాఖ‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌హేష్‌కుమార్ గౌడ్‌ల మ‌ధ్య వివాదం రేగింది.

Update: 2026-05-12 17:52 GMT

తెలంగాణ ర‌వాణా శాఖ‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌హేష్‌కుమార్ గౌడ్‌ల మ‌ధ్య వివాదం రేగింది. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత బండి సంజ‌య్ కుమారుడి వివాదానికి సంబంధించి.. మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న సొంత‌మ‌ని.. పార్టీకి, ప్ర‌భుత్వానికి కూడా సంబంధం లేద‌ని మ‌హేష్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌ను పొన్నం వ‌ర్గం ఖండించింది. మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌కు విలువ లేదా? అని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇరు వ‌ర్గాల ప్ర‌క‌ట‌నలు.. రాజకీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

ఏం జ‌రిగింది?

బండి సంజ‌య్ కుమారుడు.. బండి భ‌గీర‌థ్ పై 17 ఏళ్ల బాలిక త‌ల్లి ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. లైంగిక వేధింపుల‌కు గురి చేశార‌ని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భ‌గీర‌థ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. మ‌రోవైపు భ‌గీర‌థ్ రాష్ట్రం నుంచి పారిపోయార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించి అస‌లు కేసును కొట్టివేయాల‌ని కోరా రు. ఇక‌, బండి సంజ‌య్ కూడా ఈ వ్య‌వ‌హారంలో బాధితుల‌ను బెదిరించార‌న్న వాద‌న వినిపించింది. ఈ ప‌రిణామాల‌పై మంత్రి పొన్నం స్పందించారు. ఈ వ్య‌వ‌హారాన్ని కులం ఆధారంగా.. కులసంఘం పెద్ద‌ల మధ్యవర్తిత్వంతోనో.. లేక‌ వివాహం ద్వారా ఇలాంటి వాటిని ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు.

ఈ వ్య‌వ‌హారంపై మ‌హిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. మంత్రిగా ఉన్న పొన్నం ప్ర‌భాక‌ర్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తారా? అని నిలదీశాయి. కేసు న‌మోద‌య్యాక‌.. ఘ‌ట‌న‌కు కులాన్ని ఆపాదిస్తారా? అని ప్ర‌శ్నించాయి. దీంతో ఉలిక్కిప‌డిన కాంగ్రెస్ పార్టీ పొన్నం వ్య‌వ‌హారానికి, ఆయన చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధం లేద‌ని ప్ర‌క‌టించింది. తాజాగా పార్టీ చీఫ్ మ‌హేష్‌కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. పొన్నం చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. కులం ఆధారంగా ప్ర‌క‌టించ‌డం.. మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేసుకోవ‌డం వంటివాటికి పార్టీ వ్య‌తిరేక‌మ‌ని.. ఏదైనా కూడా చ‌ట్ట ప్ర‌కార‌మే జ‌ర‌గాల‌ని తెలిపారు. పొన్నం ప్ర‌భాక‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో త‌మ‌కు కానీ.. పార్టీకి కానీ, ప్ర‌భుత్వానికి కానీ.. సంబంధం లేద‌న్నారు.

ఈవ్య‌వ‌హారంపై పొన్నం నేరుగా స్పందించ‌లేదు. కానీ, ఆయ‌న అనుచ‌రులు మాత్రం మంత్రిగా ఉన్న పొన్నం చేసిన వ్యాఖ్య‌ల‌ను కొట్టి పారేస్తారా? అని ప్ర‌శ్నించారు. మ‌రోవైపు.. ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న సీఎంరేవంత్ రెడ్డి.. మంత్రి పొన్నంకు ఫోన్ చేసిన‌ట్టు తెలిసింది. ఇలాంటి వివాదాల విష‌యంలో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని.. చ‌ట్ట ప్ర‌కారం.. పోలీసులు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటార‌ని.. అన‌వ‌స‌ర వివాదాలు వ‌ద్ద‌ని సున్నితంగా హెచ్చ‌రించిన పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌ల అనంత‌రం.. మంత్రి పొన్నం మౌనంగా ఉండిపోయారు. మ‌రోవైపు భ‌గీర‌థ్ కోసం.. పోలీసులు గాలిస్తున్నారు. ఆయ‌న‌ను ఏ క్ష‌ణ‌మైనా అరెస్టు చేయొచ్చ‌ని పోలీసు వ‌ర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News