కిందా మీద అవుతున్న బండి !
బండి సంజయ్ ఆషా మాషీ నాయకుడు కాదు, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.
బండి సంజయ్ ఆషా మాషీ నాయకుడు కాదు, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. కేంద్ర బీజేపీ పెద్దలు నరేంద్ర మోడీ అమిత్ షాలకు ఎంతో ఇష్టుడైన నాయకుడు. తెలంగాణా బీజేపీ ఫైర్ బ్రాండ్. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నపుడే ఆ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఏకంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లూ 45 కి పైగా డివిజన్లను గెలుచుకుని అధికార బీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చింది. ఉప ఎన్నికల్లోనూ ఆనాడు సత్తా చాటింది. అనూహ్యంగా బండి సంజయ్ ని తప్పించడంతోనే బీజేపీ స్పీడ్ తెలంగాణాలో ఆగిందన్న చర్చ కూడా పార్టీ వర్గాలలో ఉంది. ఇక కరీం నగర్ లోక్ సభ ఎన్నికల్లో రెండోసారి వరసగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా అయిన బండి తెలంగాణాలో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో అగ్ర స్థానంలో ఉన్న వారు. ఆయన పొలిటికల్ కెరీర్ ప్రస్తుతం చాలా దూకుడుగా సాగుతున్న క్రమంలో ఒక్కసారిగా బ్రేక్ పడినట్లు కొడుకు కేసు ఇష్యూ వచ్చిపడింది.
ఫుల్ ఎమోషన్ అవుతున్న తీరు :
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసు విషయం ఇపుడు తెలంగాణాలో రాజకీయ ప్రత్యర్ధులకు అస్త్రంగా మారుతోంది. అంతే కాదు సొంత పార్టీలో ప్రత్యర్ధులకు కూడా ఖుషీగా ఉంది అని అంటున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటనకు రావడం అదే సమయంలో బండి కొడుకు ఇష్యూ బయటకు రావడం ఇదంతా పక్కాగా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందని తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసే భారీ కుట్ర ఇందులో దాగుందని బండి సంజయ్ అయితే అనుమానిస్తున్నారు. అంతే కాదు ఆయన ఆగ్రహిస్తున్నారు. ప్రత్యర్ధుల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
నిప్పు అంటుకుంటుంది అంటూ :
హనుమంతుడి జయంతి సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక యాత్రలో సైతం బండి సంజయ్ ఆవేశంతో ఊగిపోయారు అంటే ఆయన కుమారుడి కేసు విషయంలో ఎంత డిస్టర్బ్ గా ఉన్నారో అర్ధం అవుతోంది అని అంటున్నారు. అంతే కాదు ఆయన ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ప్రత్యర్థుల మీద మాటల మంటలే కురిపించారు. తన లాంటి వారి విషయానికి వస్తే అగ్ని వారిని దహించేస్తుంది అని అన్నారు. హనుమంతుడితో పోల్చుకుంటూ లంకను ఆయన తగలబెట్టినట్లుగా ప్రత్యర్ధులకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. తన రాజకీయ జీవితం తెరచిన పుస్తకం అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని గట్టిగా చెప్పుకున్నారు. తన కుమారుడు కూడా ఏ తప్పూ చేయలేదని బండి సంజయ్ అంటూ తమను ఇరికిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహించారు.
తీవ్ర మధనంతో :
బండి సంజయ్ అంటేనే అఫెన్సివ్ మోడ్ లో ఉంటారు. ప్రత్యర్థుల మీద మాటల తూటాలు పేలుస్తారు. అలాంటిది ఆయన ఇపుడు డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోయారా అన్న చర్చ సాగుతోంది. తాము ఏ తప్పూ చేయలేదని పదే పదే చెప్పుకోవడం వెనక తీవ్ర అంతర్మధనం ఉందని అంటున్నారు. బీజేపీ అధినాయకత్వం ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో తెలియదు, అలాగే రాజకీయ ప్రత్యర్ధులకు ఇపుడు జవాబు ఇచ్చుకోవడం కూడా ఇబ్బంది కలిగించే అంశమే అని అంటున్నారు. దాంతో బండి సంజయ్ నిప్పులు కక్కుతూనే హెచ్చరికలు జారీ చేస్తూనే కర్మ సిద్ధాంతం వల్లిస్తున్నారు. అయితే ఈ ఇష్యూలో బయట పార్టీల సంగతి పక్కన పెడితే బీజేపీలో ఆయనకు ఏ మేరకు మద్దతు లభిస్తోంది అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా బండి సంజయ్ రాజకీయ బండి అయితే ఇపుడు అతి పెద్ద కుదుపుతో పక్కకు ఒరిగినట్లు అయిందా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.