అస్సాం కూడా అయిపోయింది.. కేర‌ళ మాటేంటి?

గ‌త నెల‌లో జ‌రిగిన ఐదు రాష్ట్రాల‌(ఒక కేంద్ర పాలిత ప్రాంతం) ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేసి 8 రోజులు పూర్త‌య్యాయి.

Update: 2026-05-12 17:41 GMT

గ‌త నెల‌లో జ‌రిగిన ఐదు రాష్ట్రాల‌(ఒక కేంద్ర పాలిత ప్రాంతం) ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేసి 8 రోజులు పూర్త‌య్యాయి. ఈ క్ర‌మంలో నాలుగు రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థులు ఖ‌రారు కావ‌డం.. మూడు రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రుల ప్ర‌మాణ స్వీకారం కూడా పూర్తయింది. వీటిలో త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ముందున్నాయి. అస్సాంలో తాజాగా మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రిగా హిమంత బిశ్వ‌శ‌ర్మ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎన్డీయే కూట‌మి ప‌క్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా హాజ‌ర‌య్యారు.

ఇక‌, పుదుచ్చేరిలో ముఖ్య‌మంత్రి ఎన్ . రంగ‌స్వామి బుధ‌వారం(13వ తేదీ)నాడుప్ర‌మాణ స్వీకారం చేయ నున్నారు. దీనికి కూడా ప్ర‌ధాని మోడీ, ఏపీ సీఎం చంద్ర‌బాబు హాజ‌రు కానున్నారు. ఇలా.. ఎన్నిక‌లు జ‌రిగిన రాష్ట్రాల్లో వ‌డివ‌డిగా ముఖ్య‌మంత్రుల ఏర్పాటు, ప్ర‌భుత్వాల పాల‌న కూడా మొద‌లైంది. కానీ, కేర‌ళ విష‌యంలో ఇప్ప‌టికీ ఒక నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక్కడ 140 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూట‌మి 102 స్థానాలు ద‌క్కించుకుంది.

ఫ‌లితంగా ఎలాంటి అర‌మ‌రిక‌లు లేకుండా.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవ‌కాశం ఏర్ప‌డింది. కానీ, ముఖ్య‌మంత్రి పీఠం విష‌యంలో రాజుకున్న వివాదం ఇంకా ఒక కొలిక్కిరాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కేసీ వేణుగోపాల్‌కు ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని భావిస్తున్నా.. సీనియ‌ర్ నేత‌, కేర‌ళ రాజ‌కీయాల్లో కీల‌క వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న స‌తీశ‌న్ కూడా ఈ ప‌ద‌విని ఆశిస్తున్నారు. దీంతో ఎవ‌రికి ఇవ్వాల‌న్న విష‌యం కాంగ్రెస్‌ను అంత‌ర్మ‌థ‌నంలో ప‌డేసింది.

ఎఫెక్ట్ ఏంటి?

కేర‌ళ‌లో జ‌రుగుతున్న ప్ర‌భుత్వ ఏర్పాటు జాప్యం జాతీయ రాజ‌కీయాల‌పైనా ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల‌పై ఇప్ప‌టికే అధిష్టానం పెత్త‌నం ఉంద‌న్న వాద‌న వినిపిస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఆ పార్టీకి ద‌క్కిన రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఏర్పాటు వారం రోజులుగా న‌లుగుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇది కాంగ్రెస్ పార్టీ ఆధిప‌త్య రాజ‌కీయాల‌పై బీజేపీ ప్ర‌చారం చేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే బీజేపీ కేర‌ళ వ్య‌వ‌హారాన్ని దేశ‌స్థాయిలో ప్ర‌చారం చేస్తోంది.

Tags:    

Similar News