ఇందిరమ్మ మాట మోడీ నోట...ఫ్లాష్ బ్యాక్ ఇదే !
శ్రీమతి ఇందిరా గాంధీ దేశానికి ప్రధాని అయిన కొత్తలో దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేది.
శ్రీమతి ఇందిరా గాంధీ దేశానికి ప్రధాని అయిన కొత్తలో దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేది. అలాగే ఆహార ఉత్పత్తులు కూడా దిగుమతి చేసుకునే వాతావరణం ఉండేది. దాంతో నెహ్రూ తరువాత రెండవ ప్రధాని అయిన లాల్ బహుదూర్ శాస్త్రి మరణం అనంతరం దేశానికి మూడవ ప్రధానిగా ఇందిరా గాంధీ 1966 జనవరి 10న ప్రమాణం చేశారు. అది జరిగిన తరువాత సరిగ్గా ఏణ్ణర్థం తరువాత అంటే 1967 జూన్ 5న ఇందిరా గాంధీ ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసి దేశ ప్రజల మద్దతు కోరారు.
బంగారం కొనొద్దు :
ఆనాడు ఉన్న దేశ ఆర్ధిక పరిస్థితులు విదేశీ మారక ద్రవ్యం నిల్వలను కాపాడుకునే ఉద్దేశ్యంతో శ్రీమతి ఇందిరా గాంధీ నాటి దేశ ప్రజలకు అప్పీల్ చేశారు. ఈ కీలక సమయంలో సహకరించాలని కోరారు. బంగారాన్ని కొనుగోలు చేయవద్దు అని ఆమె విజ్ఞప్తి చేశారు. బంగారం కొనుగోలు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువగా భారత్ విదేశీ నిల్వలు తరిగిపోతాయని ఆమె చెప్పారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.
జాతీయ క్రమశిక్షణ కోసం :
జాతీయ క్రమశిక్షణ కోసం ప్రజలు అంతా సహకరించాలని కూడా ఇందిరా గాంధీ కోరడం విశేషం. ఇప్పటికే విదేశీ మారక నిల్వల పరిస్థితి ఇబ్బంది కరంగా ఉందని కూడా ఆమె చెప్పడం జరిగింది. బంగారం కానీ అభరణాలు కానీ ఏ రూపంలో ఉన్నా కొనుగోలు చేయవద్దు అని ఇందిరాగాంధీ చెప్పుకొచ్చారు. ఈ చర్యల వల్ల విదేశీ మారక నిల్వలు సేవ్ అవుతాయని ఆమె చెప్పారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని కూడా నాటి ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో బంగారం దిగుమతులు అన్నవి దేశ ఆర్థిక భారాన్ని మరింత పెంచేస్తాయని ఆమె అన్నారు. మరో వైపు బంగారం కొనుగోలు మీద కేంద్రం అప్పటికే ఆంక్షలను కూడా విధించింది. దీనికి తోడు అన్నట్లుగా ప్రజల సహకారాన్ని కూడా ఇందిరాగాంధీ అర్ధించారు.
నాన్నమ్మ మాటలనే :
ఇదిలా ఉంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే చెప్పారు. బంగారం కొనుగోళ్ళను కనీసంగా ఏడాది పాటు నిలుపుదల చేసుకోవాలని ఆయన తెలంగాణా గుజరాత్ రాష్ట్రాల పర్యటనలలో దేశ ప్రజలకు సూచించారు. అదే సమయంలో బంగారం కొనుగోలు మీద కేంద్రం అయితే ఇప్పటివరకూ ఆంక్షలు మాత్రం విధించలేదు. కానీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం మోడీ వచ్చాక ఏమీ తినవద్దు కొనవద్దు అని అంటున్నారు అని విమర్శలు సంధించారు. దీనిని ప్రతిగా బీజేపీ నేతలు ఆనాటి ఇందిరా గాంధీ ప్రకటనను బయటకు తీసి ఆరు దశాబ్దాల క్రితం నాటి ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేశారు. మీ నాన్నమ్మ ప్రధాని అయిన ఏడాదిలోనే ఏమీ కొనవద్దు అని చెప్పారు, మరి దాని సంగతి ఏమిటని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. నిజానికి భారత్ ఎక్కువగా బంగారం కొనుగోళ్ళతో విదేశీ మారక ద్రవ్యం మీద భారం పడుతోంది. అందుకే ఏ ప్రభుత్వం అయినా ఈ విధంగా మొదట విజ్ఞప్తి చేస్తుందని ఇది ఆర్థిక క్రమశిక్షణలో ఒక భాగం అని నిపుణులు చెబుతున్నారు.