పోలవరం ఎత్తుపైన కేంద్రం క్లారిటీ ఇచ్చేసినట్లేనా ?
అయితే పోలవరం వాస్తవంగా ఎంత ఎత్తులో నిర్మించాలని అనుకున్నారు, ఆ ఎత్తులో నిర్మిస్తేనే పోలవరం ప్రాజెక్ట్ వల్ల మేలు జరుగుతుందని భావించి ఆ దిశగానే అడుగులు వేశారు
పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఏపీకి జీవనాడి. ఏపీకి అది బహుళార్ధక సాధక ప్రాజెక్టు. తాగు నీరు సాగు నీరు మాత్రమే కాదు విద్యుత్ ఉత్పత్తికి అలాగే పారిశ్రామిక అవసరాలకు కూడా పోలవరం ప్రాజెక్ట్ అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని ఆనాడు పెద్దలు భావించారు. పై నుంచి ఉధృతంగా ప్రవహించే గోదావరి నీరు నేరుగా వచ్చి వృధాగా సముద్రంలో కలవడంతో సస్యశ్యామలమైన ప్రాంతాలు బీడు బారుతున్నాయి. నీరు అంతా ఉప్పు సముద్రం పాలు అవుతోంది. అందుకే పోలవరం ప్రాజెక్ట్ ని ఇప్పటికి ఎనభై ఏళ్ల క్రితం తలపెట్టారు. అయితే పోలవరం వాస్తవంగా ఎంత ఎత్తులో నిర్మించాలని అనుకున్నారు, ఆ ఎత్తులో నిర్మిస్తేనే పోలవరం ప్రాజెక్ట్ వల్ల మేలు జరుగుతుందని భావించి ఆ దిశగానే అడుగులు వేశారు
ఇంతకీ అసలు ఎత్తు ఎంత :
ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్దేశిత పూర్తి స్థాయి నీటి మట్టం గరిష్ఠ ఎత్తు 45.72 మీటర్లుగా ఉంది. అంటే 150 అడుగులు అన్న మాట. 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఈ ప్రాజెక్టును అసలు ఈ ప్రామాణిక ఎత్తుతోనే రూపకల్పన చేశారు. అలా 45.72 మీటర్లు ఎత్తు ఉంటే స్పిల్‌వే పైర్లు ఎత్తు 54 మీటర్లు భూమి డ్యామ్ గరిష్ఠ ఎత్తు దాదాపు 50 మీటర్లుగా నిర్ధారించారు. అలా అంతటి ఎత్తుతో నిర్మిస్తేనే పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ దక్కుతాయని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే పోలవరం ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఎంత ఎత్తులో అది నిర్మితం అవుతోంది అన్న చర్చ అయితే ఉంది. దానికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది.
అంత వరకే ఎత్తు అంటూ :
పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఎంత అన్న ఏపీ నుంచి నెగ్గిన రాజ్యసభ సభ్యుడు ఆర్ క్రిష్ణయ్య అడిగిన ప్రశ్నకు 41.5 మీటర్లు మాత్రమేనని కేంద్రం కచ్చితమైన సమాధానం చెప్పింది. అయితే దానికి పోలవరం ఫేజ్ వన్ అని కూడా పేర్కొంది. ఇది 2027 మార్చి నాటికి పూర్తి అవుతుందని కూడా కేంద్రం వెల్లడించింది. ఇక ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం చేసిన ఖర్చు 2,620.53 కోట్లు గా వెల్లడించింది. మరి ఫేజ్ టూ ఉంటుందా ఉంటే ఎపుడు అన్నది అయితే స్పష్టం చేయలేదు.
మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అయితేనే :
కేంద్రం అహ్యితే పోలవరం ప్రాజెక్ట్ తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వతో 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రెండో దశ అంటే 45.72 మీటర్ల పూర్తి స్థాయి ఎత్తుతో నిర్మాణం ఎప్పుడు చేపడారనే దానిపై కేంద్రం నుంచి ఇంకా నిర్దిష్టమైన కాలపరిమితి ప్రకటించలేదు. మరి తొలి దశ పూర్తయిన తర్వాత భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం పూర్తి కావాల్సి ఉంది అని అంటున్నారు. రెండో దశ ఎత్తు 45.72 మీటర్లుగా పెట్టుకుంటే అది పూర్తి చేయడానికి దానికి భారీగా భూసేకరణ పునరావాస వ్యయం అవసరం ఉండటంతో తదుపరి సర్వేలు అనుమతుల తర్వాత స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా ముందు అనుకున్నట్లుగా అంటే 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం పూర్తి అయితేనే ఏపీకి అది అద్భుత వరం అవుతుంది అని అంటున్నారు. ఆ దిశగనే అంతా కృషి చేయాలని కోరుతున్నారు.