ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం... పోక్సో కోర్టు సంచలన తీర్పు!

ఈ సమయంలో ఆ చిన్నారి అత్యాచారం కేసులో కేరళ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Update: 2023-11-14 09:11 GMT

కేరళలో ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడి కర్కశంగా గొంతుకోసి హతమార్చిన ఉదంతం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో ఆ చిన్నారి అత్యాచారం కేసులో కేరళ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా... అత్యంత పాశవికంగా చేసిన కామాంధుడికి మరణ శిక్ష విధించింది. దీంతో ఈ కేసు మరోసారి సంచలనంగా మారింది.

అవును... అలువా చిన్నారి హత్య కేసులో మంగళవారం తీర్పును వెల్లడించిన ఎర్నాకులం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు.. దోషికి పోక్సో చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ రోజు తీర్పు చెప్పే ముందు దోషిని ఉదయం 11 గంటలకు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శిక్షను చదువుతుంటే.. ఒక అనువాదకుడు అతడికి వివరించాడు.

వాదనల సందర్భంగా... ఇది అరుదైన నేరమని, దోషికి గరిష్టంగా శిక్ష విధించాలని వాదించారు. ప్రాసిక్యూషన్ వినిపించిన ఈ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ సందర్భంగా... నిందితుడికి 29 ఏళ్లని, అతడి చిన్న వయస్సును పరిగణనలోకి తీసుకోవాలని డిఫెన్స్ న్యాయవాది కోరారు. దీనిని న్యాయమూర్తి నిరాకరిస్తూ... దోషిగా మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.

కాగా, బిహార్‌ నుంచి కేరళకు వలస వచ్చిన బాధిత చిన్నారి కుటుంబం అలువాలో ఉపాధి చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో జులై 28న చిన్నారి ఆరుబయట ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న అస్ఫాక్‌ ఆలాం (29) అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్‌ చేశాడు. ఏడవకుండా ఉండేందుకు చాక్లెట్‌ కొనిచ్చాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గొంతుకోసి హతమార్చాడు.

Read more!

ఆ సమయంలో పాప కిడ్నాప్‌ అయినట్లు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సీసీటీవీ ఆధారంగా రాత్రి 9:30 గంటలకు అస్ఫాక్‌ ను పోలీసులు పట్టుకుని విచారించడంతో బాలికను చంపినట్టు తేలింది. ఆ సమయంలో బాలికను కాపాడలేకపోయామంటూ చిన్నారికి క్షమాపణలు చెప్పారు పోలీసులు.

ఈ క్రమంలో ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం నవంబర్ 4న అస్ఫాక్‌ ను దోషిగా నిర్ధారించింది. తాజాగా శిక్షను ఖరారు చేసింది. ఇందులో భాగంగా... మరణశిక్ష విధించింది.

ఈ తీర్పు వెలువడిన అనంతరం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. అత్యంత దారుణమైన నేరానికి చిన్నారి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్థుడికి గరిష్ఠంగా శిక్ష పడేలా న్యాయ వ్యవస్థ సమర్థంగా పనిచేసిందని కొనియాడారు. బాలల దినోత్సవం రోజున వెలువడిన ఈ తీర్పు.. హింసకు పాల్పడే వారికి బలమైన హెచ్చరికగా భావించాలని ఆయన తెలిపారు.

Tags:    

Similar News