శత్రు సేనలకు ఐఎన్ ఎస్ విక్రాంత్ అంటే గుండె దడ: మోడీ సంచలన వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన శత్రు సేనలకు ఐఎన్ ఎస్ విక్రాంత్ అంటే గుండెదడ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.;
భారత ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన శత్రు సేనలకు ఐఎన్ ఎస్ విక్రాంత్ అంటే గుండెదడ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఐఎన్ ఎస్ విక్రాంత్ మన సైనిక దళాల సామర్థ్యానికి ప్రతీక అని తెలిపారు. శివాజీ మహరాజ్ స్ఫూర్తితో మన సైనిక దళం ముందుకు సాగుతోందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియాలకు రక్షణ రంగంలో ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వే వారికి ఐఎన్ ఎస్ విక్రాంత్ పేరు వింటే నిద్ర కూడా పట్టడం లేదని తెలిపారు.
దీపావళిని పురస్కరించుకుని ప్రధాని గోవాలో పర్యటించారు. ఇక్కడి ఐఎన్ ఎస్ విక్రాంత్ సిబ్బందితో కలిసి ఆయన దీపావళిని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ భూమిపై జన్మించినందుకు ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత.. ఈ భూమి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సైనిక దళాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేసిన త్రివిధ దళాలకు ప్రధాని సెల్యూట్ చేశారు.
మాల్దీవులకు కష్టం వచ్చినప్పుడు భారత్ ఆదుకుందని, తాగునీరు అందించిందని ప్రధాని తెలిపారు. అదేవిధంగా ఇండోనేషియా, మయన్మార్ సహా పొరుగు దేశాలకు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా సాయం చేస్తున్నామన్నారు. దేశంలో నక్సలిజానికి, ఉగ్రవాదానికి చోటు ఉందని ప్రధాని స్పష్టం చేశారు. నక్సల్స్ అభివృద్ధి నిరోధకులుగా మారారని వ్యాఖ్యానించారు. 11 ఏళ్ల కిందట 125 జిల్లాల్లో విస్తరించిన నక్సల్స్‌ను ఆపరేషన్ కగార్ ద్వారా దారిలోకి తెచ్చామని తెలిపారు. ప్రస్తుతం మూడు జిల్లాలకే పరిమితమయ్యారని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి మావోయిస్టు రహిత భారత దేశమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు.
దేశీయంగా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయని ప్రధాన మంత్రి మోడీ వెల్లడించారు. దేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోందని తెలిపారు. జీఎస్టీ పొదుపు ఉత్సవం అతి పెద్ద రికార్డు సృష్టించిందన్నారు. దేశ ప్రజలంతా పొదుపు పాటిస్తున్నారని తెలిపారు. అనంతరం.. ప్రధాని నరేంద్ర మోడీ నావికా దళ సిబ్బందితో వందే మాతరం నినాదాలు చేయించారు.