నెతన్యాహుకి మోడీ ఫోన్...ఏం చెప్పారంటే ?
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో భారత్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.;
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో భారత్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అంతే కాదు అన్ని వైపుల నుంచి సమాచారాన్ని సేకరిస్తూ అధ్యయనం చేస్తోంది. తటస్థ విధానంతో ఉన్న భారత్ ఎపుడూ యుద్ధం కంటే చర్చలు దౌత్య మార్గమే మేలు అని భావిస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరంద్ర మోడీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో తాజాగా చర్చించారు. ఆయన ఏమి మాట్లాడారు అన్నది ఇపుడు ఆసక్తికరంగా ఉంది.
భారత్ ఆందోళన :
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త మైన పరిస్థితిపై చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో తాజాగా మాట్లాడారు. ఇటీవలి పరిణామాలపై భారతదేశ ఆందోళనలను ఆయన బెంజమిన్ నెతన్యాహు తెలియజేశారని అంటున్నారు. ఈ కీలక సమయంలో తమ పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అంతే కాదు శత్రుత్వాలను పక్కన పెట్టాలని వీలైనంతగా ఘర్షణలను నిలిపివేయాల్సిన అవసరాన్ని భారతదేశం పునరుద్ఘాటిస్తుందని కూడా ప్రధాని నరేంద్ర మోడీ బెంజమిన్ నెతన్యాహుకు వెల్లడించారు అని అంటున్నారు.
ఏమి చేయాలన్నది :
ఇదిలా ఉంటే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తన నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశానికి అత్యవసరంగా నిర్వహించారు. . హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భద్రత వ్యూహాత్మక వ్యవహారాలపై దేశంలోని అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సీసీఎస్ ఈ భేటీకి హాజరయ్యారు. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం కారణంగా తలెత్తిన పరిస్థితులను ఈ సమావేశంలో చర్చించారు. అంతే కాదు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో ఈ తరహా ఘర్షణలు ఇబ్బందికరమని భావిస్తున్నారు.
ఉద్రిక్తతలు తగ్గించాలి :
మరో వైపు చూస్తే చర్చలు దౌత్య మార్గం ద్వారానే పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతను తగ్గించాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ప్రకటించారు. పశ్చిమాసియా పరిధిలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపధ్యంలో యూనైటెడ్ అరబ్ ఎమిరెట్స్ యుఎఇ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్-నహ్యాన్‌తో ఆయన చర్చించారు. పెరుగుతున్న పరిస్థితి పట్ల భారతదేశం ఆందోళన చెందుతోందని ఈ చర్చల సందర్భంగా పేర్కొన్నారు. గల్ఫ్‌లో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితి గురించి సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌తో జైశంకర్ మాట్లాడారని చెబుతున్నారు. అదే విధంగా ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీకి కూడా జై శంకర్ ఫోన్ చేసి ఖతార్‌లో పరిస్థితి గురించి తెలుసుకున్నారు. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో కూడా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్-అహ్మద్ అల్-సబాతో కూడా జై శంకర్ మాట్లాడారని చెబుతున్నారు.
కోటి మంది దాకా :
ఇదిలా ఉంటే గల్ఫ్ దేశాలలో ఏకంగా కోటి మంది దాకా భారతీయ పౌరులు ఉన్నారు. యుద్ధ భీభత్సం నేపథ్యంలో వీరంతా చిక్కుకుని పోయారు. పైగా భీకర యుద్ధం కారణంగా బిక్కుబిక్కుమంటున్నారు. దాంతో ఆయా దేశాలలో భారతీయ పౌరుల భద్రత గురించి భారత్ ఆందోళన చెందుతోంది. ఆయా దేశాల అధినేతలతో నిరంతరం చర్చలు జరుపుతూ భారత పౌరులను కాపాడాలన్నది కోరుతోంది. ఇదే విషయం మీద విదేశాంగ శాఖ నిరంతరం పనిచేస్తోంది అని అంటున్నారు. అదే విధంగా పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న భారత పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భద్రతాపరమైన ఆదేశాలను పాటిస్తూ సురక్షింతంగా ఉండాలని విదేశాలలోని భారత రాయబార కేంద్రాల నుంచి సందేశాలు కూడా పంపిస్తున్నారు. మొత్తం మీద పశ్చిమాసియా లో సాగుతున్న పరిస్థితులను భారత్ అన్ని విధాలుగా గమనిస్తోంది అని అంటున్నారు.