ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింధూర మొక్క నాటిన ప్రధాని మోదీ

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యావరణ పరిరక్షణ పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు;

Update: 2025-06-05 12:22 GMT

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యావరణ పరిరక్షణ పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. ఢిల్లీలో మొక్కలు నాటడం ద్వారా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకున్నారు. పర్యావరణ దినోత్సవం కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదని, మన భూమిని రక్షించడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేకమైన మొక్కను నాటి, దాని వెనుక ఉన్న స్ఫూర్తిదాయక కథను కూడా ఆయన పంచుకున్నారు.

గురువారం నాడు న్యూఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోదీ ఒక సింధూర మొక్కను నాటారు. ఈ ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదిక అయిన 'ఎక్స్' (X)లో పంచుకున్నారు. 1971 యుద్ధంలో వీరోచితంగా పోరాడిన గుజరాత్‌లోని కచ్ (Kutch) ప్రాంతానికి చెందిన మహిళలు తనకు బహూకరించిన సింధూర మొక్కనే పర్యావరణ దినోత్సవం రోజున నాటినట్లు ఆయన తెలిపారు. "నా గుజరాత్ పర్యటన సందర్భంగా ఒక సింధూర మొక్కను శౌర్యానికి, ధైర్యానికి నిదర్శనంగా నిలిచిన తల్లులు నాకు బహూకరించారు. ఈరోజు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో ఆ మొక్కను నాటిన భాగ్యం నాకు కలిగిందని" మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "ఈ మొక్క మన దేశ మహిళా శక్తికి చిహ్నంగా నిలుస్తుందని" ఆయన అన్నారు.

కచ్ మహిళలు 1971 యుద్ధంలో భారత సైన్యానికి అండగా నిలబడి, శత్రువుల దాడిని ఎదుర్కొనేందుకు ధైర్యంగా సహకరించిన తీరు చారిత్రకమైంది. వారి ఈ అకుంఠిత దీక్షకు, సాహసానికి నిదర్శనంగా ఈ సింధూర మొక్క నిలుస్తుందని ప్రధాని ఉద్ఘాటించారు. సింధూర మొక్క నాటిన అనంతరం, ప్రధాని మోదీ ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్‌లో కూడా ఒక మొక్కను నాటినట్లు 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. "ఇది ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆరావళి పర్వత శ్రేణిలో అడవులను పెంచే మా ప్రయత్నంలో ఒక భాగమని" మోదీ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఆరావళి పర్వత శ్రేణి వెంట 1,400 కిలోమీటర్ల పొడవైన, 5 కిలోమీటర్ల వెడల్పైన 'గ్రీన్ కారిడార్'ను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పర్యావరణ క్షీణతను నివారించడంలో, ఎడారీకరణను తగ్గించడంలో, జీవవైవిధ్యాన్ని (Biodiversity) పెంచడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News