ఒక్క చాన్స్ కోరిన మోడీ...తెలంగాణా బీజేపీ రెడీనా ?
తెలంగాణా రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకుని రావాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. తమ పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వాలని ఆయన తెలంగాణా ప్రజలకు వినతి చేశారు.;
తెలంగాణా రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకుని రావాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. తమ పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వాలని ఆయన తెలంగాణా ప్రజలకు వినతి చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ కి అధికారం ఇస్తే తెలంగాణా ప్రగతిపధంలో దూసుకుని పోతుందని మోడీ చెప్పుకొచ్చారు. తెలంగాణా రాష్ట్రాన్ని పాలకులు అవినీతి మయం చేశారు అని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ఏలుబడిలో ఎక్కువ అవినీతి జరిగిందని అన్నారు. అందుకే ఆ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళు పై దాటిందని కానీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అభివృద్ధి చేయకుండా నమ్మించి మోసం చేస్తోంది అని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను ప్రజలు తరిమికొట్టి కాషాయానికి పట్టం కట్టాలని ఆయన కోరారు.
బెంగాల్ లో అదే జరిగింది :
పశ్చిమ బెంగాల్ ప్రజలు అక్కడ అవినీతి ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీ పాలనకు పట్టం కట్టారు అని మోడీ చెప్పుకొచ్చారు. దేశమంతటా బీజేపీ ప్రభంజనం వీస్తోందని ఆయన చెప్పారు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ లను ఓడించి ఈసారి చాన్స్ బీజేపీకి ఇవ్వమని ఆయన కోరారు. ఒక్క చాన్స్ ఇస్తే చాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తామని రాష్ట్రాన్ని ప్రగతి పధంలో పెడతామని కూడా అంటున్నారు. అయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారా అన్నది పక్కన పెడితే తెలంగాణా బీజేపీ రెడీగా ఉందా అన్న చర్చ ముందుకు వస్తోంది.
ఆ స్పూర్తి కావాలి :
మిగిలిన రాష్ట్రాలలో బీజేపీ గెలుపు కోసం పార్టీ క్యాడర్ అంతా రోడ్డున ఉంటారు. నాయకులు సైతం వీధుల్లోకి వస్తారు. బెంగాల్ లో గత పదేళ్ళుగా బీజేపీ పడిన కష్టమే ఈ రోజు విజయం. ఒక్కో నాయకుడిదీ ఒక్కో వీరోచిత పోరాటం. బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ని ఎదిరించి నిలబడడం అంటే మాటలు కాదు, కానీ తెగించి వచ్చారు. అలా చేయడం వల్లనే పార్టీ బతికింది. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం వల్లనే బీజేపీ వైపు జనాలు చూశారు. ఆ విధంగా ప్రభుత్వ వ్యతిరేకత కాస్తా బీజేపీ వైపు మళ్ళింది.
కానీ తెలంగాణాలో బీజేపీ చూస్తే మూడు గ్రూపులూ ఆరు వర్గాలుగా ఉంది. అందరూ నాయకులే అన్నట్లుగా ఉంది గతంలో కాంగ్రెస్ ఏ విధంగా ఉందో ఆ పరిస్థితి ఉందని అంటున్నారు. ఇపుడు తెలంగాణా కాంగ్రెస్ ఏకీకృతం అవుతోంది. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుని పోతున్నారు. కానీ బీజేపీలో మాత్రం ఆ పరిస్థితి లేదని అంతా అంటున్నారు నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి బీజేపీని కదిలించాల్సి వస్తోంది. కానీ ఈ తరహా ఉత్సాహాన్ని సభలు పెట్టి పార్టీ నేతలు చేయాల్సి ఉంది కదా అని అంటున్నారు. మొత్తానికి చూస్తే సౌత్ కి గేట్ వేగా తెలంగాణాను బీజేపీ పెద్దలు భావిస్తున్నారు కానీ తెలంగాణా బీజేపీ నేతలు సమాయత్తం అయితేనే అది సాధ్యపడుతుంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.