పటేల్ జయంతి వేళ నెహ్రూని టార్గెట్ చేసిన మోడీ

కాశ్మీర్ లో ఒక భాగం పాకిస్థాన్ ఆక్రమించుకుని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా దానిని స్వాధీనం చేసుకోవడం వెనక కూడా నాటి కాంగ్రెస్ పాలకుల అనుసరించిన దుర్విధానలు ఉన్నాయని మోడీ విమర్శించారు.;

Update: 2025-10-31 13:27 GMT

ప్రధాని నరేంద్ర మోడీ కాశ్మీర్ విషయంతో పాటు నెహ్రూ పాలన గురించి మరోసారి ప్రస్తావించారు. ఈ రోజుకు కూడా ఏదో ఒక సందర్భంలో కాశ్మీర్ అలా వివాదంగానే ఉంది అంటే దానికి కారణం ఏమిటి ఎవరూ అని ఆయన చెబుతూ ఫ్లాష్ బ్యాక్ లోతుల్లోకి వెళ్ళారు. గుజరాత్ లోని ఎక్తానగర్ లో నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ తొలి ప్రధాని నెహ్రూ పాలన గురించి విమర్శలు చేశారు. కాశ్మీర్ వివాదానికి కారణం నెహ్రూ అనుసరించిన విధానాలే కారణం అన్నారు. కాంగ్రెస్ కాశ్మీర్ సమస్యను పూర్తిగా పట్టించుకోలేదని ఆయన నిప్పులే చెరిగారు. కాశ్మీర్ ని ఒక ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేక జెండాతో విభజించారు అని మోడీ మండిపడ్డారు.

పాక్ ఆక్రమణల వెనక :

కాశ్మీర్ లో ఒక భాగం పాకిస్థాన్ ఆక్రమించుకుని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా దానిని స్వాధీనం చేసుకోవడం వెనక కూడా నాటి కాంగ్రెస్ పాలకుల అనుసరించిన దుర్విధానలు ఉన్నాయని మోడీ విమర్శించారు. నాటి పాలకుల వైఖరి కారణంగానే కాశ్మీర్ తో పాటు దేశం కూడా భారీ మూల్యాన్ని చెల్లించింది అని మోడీ హాట్ కామెంట్స్ చేశారు.

ఉగ్రవాదం విషయంలో :

ఇక దేశంలో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ రెచ్చగొట్టిందని ఆ విషయంలో కూడా కాంగ్రెస్ పాలకులు సరిగ్గా పట్టించుకోలేదని మోడీ నిందించారు. కాంగ్రెస్ ఈ విధంగా దశాబ్దాలుగా చేసిన ఎన్నో తప్పుల మూలంగానే ఈ రోజున దేశం అగ్నికి ఆహుతి అయింది అని కూడా మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పటేల్ దార్శనికత ఏదీ :

సర్ధర్ పటేల్ దేశానికి తొలి ఉప ప్రధానిగా హోం మంత్రిగా ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించారు అని మోడీ కొనియాడారు. ఆయన దార్శనికత వల్లనే దేశం ఈ రోజున ఐక్యంగా ఉందని మోడీ చెప్పారు. అటువంటి మోడీ విధానాలను కాంగ్రెస్ ఏనాడో మరచిపోయింది అని మోడీ విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం అలా చేయకుండా సర్దార్ ఆశయాలను ఆచరణలో పెట్టిందని చెప్పారు.

ఓటు బ్యాంక్ పాలిటిక్స్ :

కాంగ్రెస్ ఎపుడూ ఓటు బ్యాంక్ రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చిందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని వల్ల దేశ అంతర్గత భద్రత ఇబ్బందుల్లో పడినా కూడా దానిని కనీసంగా కూడా పట్టించుకోలేదని ఆయన అంటున్నారు. సర్దార్ పటేల్ దేశాన్ని చూసిన కోణాన్ని కాంగ్రెస్ అర్ధం చేసుకోవడంలో విఫలం అయిందని నెహ్రూ సైతం పటేల్ అభిప్రాయాలను గౌరవించకపోవడం వల్లనే ఎన్నో ఇబ్బందులు దేశం ఎదుర్కోందని మోడీ చెప్పుకొచ్చారు. దేశం ఐక్యత కోసం పటేల్ చేసిన కృషి ఎన్న తగినదని మోడీ అన్నారు. పటేల్ ఆశయాలను తమ ప్రభుత్వం సాకారం చేస్తోంది అని ఆయన అన్నారు. అందులో భాగంగానే ఆర్టికల్ 370 ని రద్దు చేసి కాశ్మీర్ ని భారత్ లో అంతర్భాగంగా చేసినట్లుగా చెప్పారు.

ఉగ్రపీచం అణిచేస్తాం :

భారత్ వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సిందే అని మోడీ స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ తో పాక్ తో సహా ఉగ్రవాదులకు భారత్ సత్తా ఏమిటో తెలిసి వచ్చిందని అన్నారు. అర్బన్ నక్సలైట్లను సైతం విడిచిపెట్టేది లేదని మోడీ స్పష్టం చేశారు. భారత్ అతర్గత భద్రతకు మావోలు ఆటంకంగా మారారని ఈ విషయంలో రాజీ పడేది లేదని మోడీ గట్టిగానే చెప్పారు.

Tags:    

Similar News