'హిందీ రాదు సార్.. తెలుగులో మాట్లాడతా' మోడీనే నేరుగా చెప్పేసింది
మొత్తం 13 రోజుల ట్రైనింగ్ తర్వాత కెనరా బ్యాంక్ వారు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.2 లక్షలు ముద్రా లోన్ కింద ఇచ్చారన్నారు.;
ఆసక్తికర పరిణామాలకు వేదిగా నిలిచింది ముద్రా యోజన పదో వార్షికోత్సవ సమావేశం. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావటమే కాదు.. పలువురు చెప్పిన విజయగాథల్ని వినటమే కాదు. ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఈ సమావేశానికి హాజరు అయ్యేందుకు ఒక మహిళను హెలికాఫ్టర్ పంపి మరీ ఢిల్లీకి తీసుకురావటం.. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సక్సెస్ స్టోరీ చెప్పినప్పుడు.. ఎంత సంపాదించావని ప్రధాని మోడీ అడగటమే కాదు.. ఇన్ కం ట్యాక్స్ అధికారులు సోదాలకు రారులే అంటూ సరదా వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
ఇదే సమావేశంలో తన అనుభవాన్ని షేర్ చేసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక మహిళకు అవకాశం లభించింది. అయితే.. ఆమెకు హిందీ రాదు. తెలుగులో తప్పించి మరో భాషలో మాట్లాడలేని పరిస్థితి. ఇదే విషయాన్ని ఆమె ప్రధాని మోడీతో సూటిగా చెప్పేయటం గమనార్హం. 'సార్.. నాకు హిందీ రాదు. తెలుగులో మాట్లాడతా' అని కోరగా.. అందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. దీంతో ఆమె తన నేపథ్యాన్ని చెప్పుకొచ్చారు.
తనకు 2009లో పెళ్లైందని.. 2019 వరకు ఇల్లాలిగానే ఇంటికే పరిమితమైనట్లు ఆమె చెప్పారు. ఆ తర్వాత కెనరా బ్యాంక్ రీజినల్ సెంటర్ ఫర్ ట్రైనింగ్ సెంటర్ లో జనపనార బ్యాగుల తయారీపై శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు.
మొత్తం 13 రోజుల ట్రైనింగ్ తర్వాత కెనరా బ్యాంక్ వారు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.2 లక్షలు ముద్రా లోన్ కింద ఇచ్చారన్నారు. దీంతో 2019 నవంబరులో తాను వ్యాపారాన్ని ప్రారంభించినట్లుగా చెప్పిన ఆమె.. "చెల్లింపులు సకాలంలో ఉండటంతో బ్యాంక్ వారు 2022లో రూ.9.5 లక్షల రుణాన్ని ఇచ్చారు. ఇప్పుడు నా దగ్గర 15 మంది పని చేస్తున్నారు. అందరూ ఇంట్లో ఉండే మహిళలే. ఒకప్పుడు నేను ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నానో.. ఇప్పుడు అక్కడే నాలాంటి మహిళలకు బోధిస్తున్నా" అంటూ చెప్పారు.ఆమె సక్సెస్ స్టోరీకి ప్రధాని అభినందించారు.