హైదరాబాద్‌లో మోదీ పొలిటికల్ మాస్టర్ ప్లాన్! బాబు, పవన్ నివాసాలకు ప్రధాని..
పశ్చిమ బెంగాల్ విజయంతో మంచి జోష్ మీదున్న భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు తన పూర్తి దృష్టిని తెలంగాణపై మళ్లించడం రాజకీయంగా పెను సంచలనమే.;
పశ్చిమ బెంగాల్ విజయంతో మంచి జోష్ మీదున్న భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు తన పూర్తి దృష్టిని తెలంగాణపై మళ్లించడం రాజకీయంగా పెను సంచలనమే. సాధారణంగా ప్రధాని పర్యటనలు ప్రోటోకాల్ ప్రకారం సాగుతుంటాయి, కానీ ఇలా మిత్రపక్షాల నేతల నివాసాలకు స్వయంగా వెళ్లడం వెనుక బలమైన రాజకీయ సంకేతాలు ఉన్నాయని అర్థం అవుతోంది. ముఖ్యంగా చిరంజీవిని తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేలా ఒప్పించడం అనే వ్యూహం ఫలిస్తే, అది రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం కాకుండా, ఎన్డీఏ మిత్రపక్షాల నేతలను వ్యక్తి గతంగా కలవాలని ఆయన నిర్ణయించుకోవడం వెనుక తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చే భారీ వ్యూహం దాగి ఉంది.
వ్యక్తిగత పలకరింపు
ప్రధాని మోదీ తన పర్యటనలో ముగ్గురు కీలక వ్యక్తులతో భేటీ కానున్నారు. అస్వస్థత నుంచి కోలుకుంటున్న జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఆయన నివాసంలోనే కలిసి ప్రధాని పరామర్శించనున్నారు. ఇది ఇద్దరు నేతల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటిచెబుతోంది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి కూడా ప్రధాని వెళ్లనున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న మిత్రపక్షాల మధ్య సమన్వయాన్ని తెలంగాణకు కూడా విస్తరించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం మెగాస్టార్ చిరంజీవితో ప్రధాని భేటీ.
తెలంగాణలో 'మెగా' ఆపరేషన్.. బీజేపీ వ్యూహం
తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీ ఒక వినూత్న వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి చిరంజీవి ఇమేజ్‌ను వాడుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చాలా సందర్భాల్లో అన్న తమ్ముళ్లను (చిరంజీవీ-పవన్ కళ్యాణ్) ను ఆయన నేతృత్వంలో పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ వంటి జిల్లాల్లో ఇప్పటికీ ఉన్న టీడీపీ సానుభూతిపరులను, అభిమానులను చిరంజీవి ద్వారా ఏకీకృతం చేయాలన్నది బీజేపీ ప్లాన్. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ఆ ఊపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. దానికి చిరంజీవిని పెద్ద ఎత్తున వాడుకోవాలని అనుకుంటుంది.
బెంగాల్ స్ఫూర్తితో తెలంగాణపై ఫోకస్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ అధిష్టానం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. బెంగాల్ తరహాలోనే తెలంగాణలో కూడా గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు అమిత్ షా, మోదీ ద్వయం వ్యూహాలు రచిస్తోంది. ప్రధాని పర్యటన ముగిసేలోగా తెలంగాణ రాజకీయాల్లో సంచలన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చంద్రబాబు అనుభవం, పవన్ కల్యాణ్ ఛరిష్మా, చిరంజీవి ఇమేజ్ కలుపుకొని తెలంగాణలో పవర్ లోకి రావాలన్నది ప్రధాని మోదీ ఆలోచన. ఇది కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో పోటీ త్రిముఖంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఇది గట్టి సవాలుగా మారనుంది.