అందుకే ఉప రాష్ట్రపతినయ్యా...ఫ్లాష్ బ్యాక్ చెప్పిన వెంకయ్య
తనకు ఇష్టం లేకపోయినా ఉప రాష్ట్రపతి పదవిని ఎలా చేపట్టాల్సి వచ్చిందో విశాఖ వేదికగా వెంకయ్యనాయుడు పంచుకున్నారు.
తనకు ఇష్టం లేకపోయినా ఉప రాష్ట్రపతి పదవిని ఎలా చేపట్టాల్సి వచ్చిందో విశాఖ వేదికగా వెంకయ్యనాయుడు పంచుకున్నారు. విశాఖలో తన జీవిత చరిత్ర మీద రాసిన ఒక పుస్తకం విడుదల సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన విషయాలను ఆయన జనం ముందు ఉంచారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ, ఇతర పార్టీ పెద్దలు తనను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తున్నామని చెప్పారని ఆయన అన్నారు. అయితే తొలుత ఆ పదవికి తాను ఆసక్తి కనబర్చలేదని అవసరమనుకుంటే తిరిగి పార్టీలో బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమని చెప్పినట్లు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అయితే ప్రధాని, ఇతర నేతలు ఉప రాష్ట్రపతి పదవికి తనను ఎంపిక చేయడానికి కారణం చెప్పారని అన్నారు.
కీలక బిల్లుల ఆమోదం :
ఉప రాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరిస్తారని, రాజ్యసభలో అప్పడు బీజేపీ సంఖ్యాబలం తక్కువగా ఉన్నదని ఆర్టికల్ 370 రద్దు సహా పలు ముఖ్యమైన బిల్లులను ఆమోదింప చేసుకోవాల్సి ఉందని బీజేపీ నేతలు చెప్పారని అన్నారు. అందుకే రాజ్యసభను సమర్థంగా చాకచక్యంగా నిర్వహించే వారు కావాలని ఓర్పు నేర్పు ఉన్నవారు కావాలని అందుకే తనను ఎంపిక చేస్తున్నామని చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే ఈ పదవి వల్ల పార్టీకి దూరమవుతున్నాననే బాధ ఉన్నా అంగీకరించానని వెంకయ్యనాయుడు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తానని సభ మధ్యలోకి వచ్చి రభస చేస్తే కఠినంగా వ్యవహరిస్తానని సభ్యులకు ముందుగానే చెప్పానని అన్నారు. అలా రాజ్యసభలో చివరకు ఎలాంటి గొడవ జరగకుండా 370 అధికరణం రద్దు బిల్లు ఆమోదం పొందిందని చెప్పారు. ఇది తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమని వెంకయ్య చెప్పారు.
జపింగ్ జఫాంగులకు చెక్ పెట్టాల్సిందే :
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరే వారికి రాజ్యాంగం ప్రకారం కట్టడి చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ఈ విషయంలో ఫిరాయింపుల చట్టం పదవ షెడ్యూలులో నిబంధనలను సడలించాలని ఆయన కోరారు. ఎవరైనా సరే తమ పదవులకు రాజీనామా చేశాకే పార్టీలు మారాలని ఆయన సూచించారు. అంతే తప్ప పదవులు ఒక పార్టీ ద్వారా అందుకుని మరో పార్టీలో చేరే సంస్కృతిని చెక్ పెట్టాల్సిందే అని వెంకయ్యనాయుడు కోరారు.
సిద్ధాంత పరమైన రాజకీయాలు చేయాలి :
ఇదిలా ఉంటే వర్తమాన రాజకీయ తీరు మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా సరే సిద్ధాంతపరమైన రాజకీయాలు చేయాలని ఆయన కోరారు. అంతే కాదు బాగా కష్టపడాలని సూచించారు. ప్రస్తుత సమాజంలోనూ అలాగే రాజకీయాల్లోనూ విలువలు నైతిక ప్రమాణాలు పడిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పార్టీలకు చెందిన . నేతలు సిద్ధాంత పరమైన రాజకీయాలు చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రాజకీయనేతలు హుందాగా వ్యవహరించాలని, సంస్కారవంతమైన భాష ఉపయోగించాలని ఆయన సూచించారు.
యువత రావాల్సిందే :
రాజకీయాలు అంటే ప్రజా సేవగా ఆయన పేర్కొన్నారు. అందువల్ల యువత రాజకీయాల్లోకి రావాలని కోరారు. ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణ సమయపాలన అలవర్చుకోవాలని అన్నారు. ఈనాటి యువత రేపటి భవిత అని ఆయన అంటూ వారికి తన అనుభవాన్ని తెలియచెప్పాలని అలాగే వారిలో స్ఫూర్తి నింపాలనే తాను ఇప్పటికీ దేశమంతా తిరుగుతున్నాను అని అన్నారు. ఇదే తీరున దేశమంతా పర్యటిస్తూనే వెళ్లిపోవాలన్నది తన కోరిక అని ఆయన ఉద్వేగభరితంగా పేర్కొన్నారు.
విశాఖతో అనుబంధం :
తనకు విద్యార్థి నాయకుడిగా ఎదిగే అవకాశం విశాఖపట్నంలోనే లభించిందని గత స్మృతులను ఆయన నెమరేసుకున్నారు. తనకు రాజకీయ పునాది ఇక్కడే పడిందని విశాఖపట్నంతో ఉన్న అనుబంధం గురించి ఆయన చెప్పారు. తాను పదహారవ ఏట విద్యార్థి పరిషత్తులో చేరానని, అప్పటి నుంచి ప్రజల్లో నిత్యం తిరుగుతూనే ఉన్నానని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలొ దేశంలోని ప్రతి రాష్ట్రం ప్రతి జిల్లాలో తిరిగానని గుర్తు చేసుకున్నారు.