బీజేపీని వేడెక్కిస్తున్న బాంకీపూర్ బై పోల్ !
ఇక బాంకీపూర్ అసెంబ్లీ సీటు ఇపుడు గట్టి పోటీగా మారింది. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్ధి నామినేషన్ వేసి తప్పుకోవడం రాజకీయ రచ్చగా మారింది.
బీహార్ లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక. అయితే ఇపుడు ఆ ఉప ఎన్నిక ఏకంగా జాతీయ స్థాయిలోనే ఆకట్టుకునేలా మారుతోంది. దాని పేరు బాంకీపూర్ ఇక్కడ ఉప ఎన్నిక వచ్చిపడింది. దానికి కారణం ఈ సీటు నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిన నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. 2025 చివరిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఇక నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా మొదట్లో బాధ్యతలు చేపట్టినా ఈ ఏడాది ఏప్రిల్ లో రాజ్యసభకు వెళ్ళి ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. దాంతో పాటు బాంకీపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నితిన్ నబీన్ బీజేపీ పగ్గాలు అందుకున్నారు. దీంతో ఈ రెండూ కూడా ఈ సీటు ఉప ఎన్నిక మీద తీవ్రంగా ప్రభావం చూపనున్నాయి.
నామినేషన్ వేసి వెనక్కి :
ఇదిలా ఉంటే బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీ ఎంపిక చేసిన ఒక అభ్యర్ధి తన నామినేషన్ ని అట్టహాసంగా వేసి మరీ మరుసటి రోజు తాను పోటీకి దూరం అని తప్పుకోవడం. ఆ అభ్యర్ధి అభిషేక్ కుమార్ సిన్హా. ఆయన నామినేషన్ దాఖలు కి బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి కూడా హాజరయ్యారు. అయితే కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఆయన తప్పుకోవడానికి కారణం ఏంటి అంటే ఆయన కుటుంబం మీద పశు గ్రాసం కుంభకోణం కేసు ఉందని అంటున్నారు. ఈ కేసులోనే మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పదవిని కోల్పోయి కోర్టుల చుట్టూ ఏళ్ళ తరబడి తిరిగారు. బీజేపీ అభ్యర్ధికి లింక్ ఏంటి అంటే అభిషేక్ కుమార్ సిన్హా తల్లిదండ్రులు గతంలో ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో దోషులుగా తేలారు అని అంటున్నారు. దాంతో ఇదే అంశం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతోందని గ్రహించిన బీజేపీ తమ అభ్యర్ధి చేత పోటీ నుంచి విరమించుకుంటున్నట్లుగా ప్రకటింపచేసింది అని అంటున్నారు.
వెంటనే కొత్త అభ్యర్ధి రంగంలోకి :
ఇక ఇది జరిగిన వేంటనే నీరజ్ కుమార్ సిన్హా అనే అభ్యర్ధిని బీజేపీ రంగంలోకి దించింది. అయితే దీని మీద విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ అయితే ఇదే విషయం మీద గట్టిగానే మాట్లాడుతున్నారు. ఇతర పార్టీలను ఈడీ సీబీఐలతో బెదిరించే బీజేపీకి ఇపుడు తన సొంత పార్టీ అభ్యర్థి విషయంలో ఇదే పరిస్థితి ఎదురైంది అని సెటైర్లు వేశారు. అందుకే బీజేపీ అభ్యర్ధి మొదటి పోరాటంలోనే పోటీ నుంచి తప్పుకుని పారిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ అవినీతి పరులకు టికెట్లు ఇస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ అని ప్రశాంత్ కిశోర్ విమర్శలు గుప్పించారు.
గట్టి పోటీగా మారింది :
ఇక బాంకీపూర్ అసెంబ్లీ సీటు ఇపుడు గట్టి పోటీగా మారింది. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్ధి నామినేషన్ వేసి తప్పుకోవడం రాజకీయ రచ్చగా మారింది. పైగా ఆయన జాతీయ అధ్యక్షుడు నిన్నటి ఎమ్మెల్యే నితిన్ నబీన్ కి అత్యంత సన్నిహితుడు. ఇపుడు కొత్త అభ్యర్ధి ఏ మేరకు నెగ్గుకుని రాగలరు అన్నది కూడా చర్చగా ఉంది. మరో వైపు చూస్తే ఆర్జేడీ నుంచి రేఖా గుప్తా పోటీలో ఉన్నారు. జన సురాజ్ నుంచి ప్రశాంత్ కిశోర్ బరిలో ఉన్నారు. 1995 నుంచి బీజేపీ ఇక్కడ ఓటమి లేకుండా గెలుస్తూ వస్తోంది. నితిన్ నబీన్ తండ్రి నవీన్ కిశోర్ సిన్హా తొలిసారి గెలిచారు. ఆయన 2006 దాకా ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఆ మీదట నితిన్ నబీన్ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఇపుడు ఈ సీటుని నిలబెట్టుకోవడం బీజేపీకి అత్యంత ప్రతిష్టగా మారుతోంది. ఇక బీహార్ లో నితీష్ కుమార్ సీఎం గా లేరు, బీజేపీ సీఎం గా ఉన్న సామ్రాట్ చౌదరికి ఇది తొలి అగ్ని పరీక్షంగా చెబుతున్నారు. ఈ సీటులో బీజేపీ ఇబ్బంది పడి గెలిచినా కూడా అది పార్టీకి దెబ్బే అని అంటున్నారు. భారీ మెజారిటీతో గెలవాలి. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడాది కూడా కాలేదు కాబట్టి. మరి ఈ నెల 30న జరిగే ఈ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.