అందరికీ ఒకే సమాధానం.. అంబటితో వేదిక పంచుకోవడంపై ఏబీవీ క్లారిటీ
ఏపీ రాజకీయాల్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ABV) వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏపీ రాజకీయాల్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ABV) వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అణిచివేతను ఎదుర్కొన్న వ్యక్తిగా, కూటమి ప్రభుత్వానికి సానుభూతిపరుడిగా ఆయన పట్ల ప్రజల్లో ఒక అభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో ఇటీవల ఏబీవీ తీరు హాట్ టాపిక్ అవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తూ, ప్రభుత్వ నిర్ణయాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడంపై సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతిపరులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
అంబటితో వేదిక... ఏబీవీ స్పందన
యూట్యూబర్ రావణ్ పై ఉపా చట్టం కింద నమోదైన కేసుపై చర్చించేందుకు విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వేదికను పంచుకోవాల్సి వచ్చింది. ఈ సన్నివేశం కూటమి మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. సోషల్ మీడియాలో ఏబీవీ తీరుపై రకరకాల కామెంట్లతో రచ్చకు తెరతీశారు. దీంతో ఏబీవీ కూడా ఘాటుగానే స్పందించారు. కేవలం ఒక వేదికను పంచుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి చెప్పే ప్రతి విషయాన్ని సమర్థించినట్లు కాదని స్పష్టత నిచ్చారు. సభలో అంబటి రాంబాబు మాట్లాడుతున్నప్పుడు తాను వినలేదని, మర్యాదపూర్వకంగానే అక్కడ ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. "మీ అందరితో హీరో అనిపించుకోవడం కోసం నేను నా సంస్కారాన్ని వదిలేయాలా? మీరు నా గురించి పొరబడ్డారు, నేనలాంటి వాడిని కాదు" అని ఆయన సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ విధానాలపైనా విమర్శలు
ఏబీవీ కేవలం అంబటి అంశంపైనే కాకుండా, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ వ్యాఖ్యలపై 'యూఏపీఏ' (UAPA) వంటి కఠినమైన చట్టాలను ప్రయోగించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం వాక్ స్వాతంత్య్రాన్ని ఎలా అణచివేసిందో గుర్తు చేస్తూ, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే బాటలో నడవాలని చూస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. రాజద్రోహం వంటి కేసులు అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నాభిప్రాయాలు సహజమని ఆయన వాదిస్తున్నారు.
ఇక రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రెండో విడతలో వేలాది ఎకరాల భూమిని సేకరించాలన్న ప్రభుత్వ ఆలోచనను కూడా ఏబీవీ తప్పుబడుతున్నారు. రైతులు రోడ్డెక్కే పరిస్థితి వస్తే అది ప్రభుత్వానికి నష్టమని, భూసేకరణ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. అలాగే, అమరావతి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయకపోతే అది రాష్ట్రానికి తీరని అన్యాయం అవుతుందని సూచించారు. జగన్ హయాంలో ప్రతిపాదించిన కొన్ని అంశాలను కూడా ఆయన విశ్లేషిస్తూ, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజా ప్రయోజనాల కోణంలో చూడాలని కోరుతున్నారు.
తన వ్యాఖ్యలను 'సద్విమర్శలుగా' స్వీకరించాలని ఏబీ వెంకటేశ్వరరావు తన అభిమానులను కోరుతున్నారు. గతంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ఏబీవీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కూడా అదే స్థాయిలో ప్రశ్నిస్తుండటమే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తనపై విమర్శలు చేస్తున్న వారిని ఒకేసారి సమాధానమిస్తున్నానంటూ ఏబీవీ చేసిన పోస్టు వైరల్ అవుతోంది.