బాబు మిత్రులందు పవన్ వేరయా !

ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ జీవితం ఒక అర్ధ శతాబ్దం. ఇంతటి సుదీర్ఘ జీవితంలో బాబుకు ఎంతో మిత్రులు ఉన్నారు.

Update: 2026-07-12 15:30 GMT

ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ జీవితం ఒక అర్ధ శతాబ్దం. ఇంతటి సుదీర్ఘ జీవితంలో బాబుకు ఎంతో మిత్రులు ఉన్నారు. ఆయన ప్రతీ దశలోనూ వారి కనిపిస్తూ ఉంటారు. తొలినాళ్ళలో వైఎస్సార్ బాబు మంచి మిత్రులు. ఇద్దరూ ఒకేసారి ఎమ్మెల్యేలుగా నెగ్గారు, ఒకెసారి మంత్రి పదవులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందుకున్నారు. ఆ తరువాత బాబు టీడీపీలోకి వెళ్తే వైఎస్సార్ కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఇక టీడీపీలో కూడా బాబుకు సహచరులలో మంచి మిత్రులు ఉన్నారు. అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు, యనమల రామక్రిష్ణుడు, అయ్యన్నపాత్రుడు వంటి వారు బాబుకు అత్యంత సన్నిహితులు అలాగే మిత్రులుగా చెప్పుకోవాలి. ఇక టీడీపీకి కూడా మిత్రులు ఉన్నారు. అవన్నీ రాజకీయ బంధాలు. ఒక ఎన్నికలో మిత్రులుగా ఉండే పార్టీలు మరో ఎన్నికలో ప్రత్యర్ధిగా మారుతాయి.

మిత్ర పక్షాలతో బంధం :

ఇదిలా ఉంటే టీడీపీ తొలి మిత్ర పక్షం ఇందిరాగాంధీ చిన్న కోడలు మేనకా గాంధీ స్థాపించిన సంజయ్ విచార్ మంచ్. 1983లోనే పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఆ తరువాత బీజేపీ వామపక్షాలు అలా తలో ఎన్నికల్లో మిత్రులుగా ఉంటూ వచ్చాయి. ఈ మధ్యలో టీఆర్ఎస్ కూడా టీడీపీకి ఒక అసాధారణ సందర్భంలో దోస్త్ గా మారింది. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన టీడీపీకి మరో అనూహ్య సందర్భంలో ఆ పార్టీ కూడా మిత్ర పక్షం అయింది అంటే అదంతా రాజకీయ అనివార్యతగా రాజకీయ సహజ ప్రక్రియగానే తీసుకోవాల్సి ఉంది.

పవన్ మాత్రం ప్రత్యేకం :

అయితే ఇంతలా మిత్ర బంధాలు నెరపిన టీడీపీకి పవన్ మాత్రం మిత్రుడు కంటే ఎక్కువ అనే చెప్పాలి. పవన్ 2014లో టీడీపీకి జనసేన అధినేత కంటే కూడా ఒక మిత్రుడిగానే బాసటగా నిలిచారు. ఇక 2019 నాటికి జనసేన వేరుగా పోటీ చేసి టీడీపీకి ప్రత్యర్ధిగా మారింది. అయితే 2024 నాటికి మళ్ళీ టీడీపీ కూటమిలో చేరింది. ఈ పన్నెండేళ్ళ ప్రస్థానంలో టీడీపీ జనసేనల అన్న పార్టీల కంటే కూడా బాబు పవన్ ల వ్యక్తిగత స్నేహ బంధం గట్టిగా నిలిచింది. 2018 నుంచి ఒక ఏడాది పాటు మాత్రమే పవన్ బాబు ప్రత్యర్ధులుగా మారారు అంతే.

అరుదైన స్నేహంగానే :

రాజకీయ పార్టీల మితృత్వం సాధారణంగా ఎన్నికల ముందు తరువాత అని మాత్రమే చూడాలి. ఎన్నికలు ముగిసాక ఆ బంధంలో మార్పులు వస్తాయి. అలాగే రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే జనసేన టీడీపీ విషయంలో వీటికి మించి అతీతమైన అనుబంధం ఉంది. అదే శ్రీరామ రక్షగా నిలుస్తోంది. ఏపీ అభివృద్ధికి తొలి ప్రాధాన్యత పవన్ ఇస్తారు. అలాగే చంద్రబాబుని ఆయన మంచి పాలకుడిగా పవన్ గుర్తిస్తారు. అలాగే పవన్ లోని నిబద్ధతకు బాబు సైతం ఆకర్షితులు అవుతున్నారు. ఆయన అందరి లాంటి మిత్రుడు కాడు అన్నది కూడా బాబు గుర్తించి మరీ ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.

పవన్ కోసం బాబు :

పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబైలోకి కోకిలాబెన్ ఆసుపత్రిలో తన భుజానికి శస్త్ర చికిత్స చేసుకున్నారు. చంద్రబాబు ప్రత్యేకంగా పనిగట్టుకుని ఆసుపత్రికి వెళ్ళి మరీ పవన్ ని పరామర్శించడం ఈ ఇద్దరి మధ్య అనుబంధాన్ని చాటి చెబుతోంది. చంద్రబాబు పవన్ ఆరోగ్యం విషయంలో చూపించిన శ్రద్ధ కూడా ఈ సందర్భంగా అంతా చెప్పుకుంటున్నారు. ఒక మిత్ర పక్షం నాయకుడు కోసం బాబు ఇలా వెళ్ళడం అన్నది రాజకీయాలకు అతీతంగా వారిద్ధరి మధ్య ఉన్న బంధాన్ని చాటుతోంది.

ఈ బంధం గట్టిది మరి :

చంద్రబాబు పవన్ ల మధ్య ఏజ్ గ్యాప్ ఉంది. అనుభవం విషయం తీసుకుంటే బాబు అత్యంత సీనియర్. అదే సమయంలో ఇద్దరి మధ్య ఒక సారూప్యత ఉంది. అదే ఏపీ అభివృద్ధి అన్నది. ఈ లక్ష్యం కోసం ఇద్దరూ చేతులు కలిపారు. అందుకే ఈ బంధం బహు గట్టిగా మారింది అని అంటున్నారు. ఇక చంద్రబాబు విషయంలో ఒక విమర్శ ఉంది, మిత్రులను ఆయన రాజకీయంగా సాయం తీసుకుని ఆనక పట్టించుకోరు అని. దానికి పూర్తి విరుద్ధం జనసేనతో బంధం. ఈ రెండు పార్టీల మధ్య దృఢమైన బంధానికి ఎన్నో ఉదాహారణలు ఉన్నాయి. తాజాగా బాబు పరామర్శ దానిలో ఒకటిగా చెబుతున్నారు.

Tags:    

Similar News