హరీష్ ఎందుకు టార్గెట్...రేవంత్ ఆరోపణల్లో లాజిక్ ?
బీఆర్ఎస్ లో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు హరీష్ రావు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన టీఆర్ఎస్ పునాదుల నుంచి ఉన్న వారు.
బీఆర్ఎస్ లో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు హరీష్ రావు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన టీఆర్ఎస్ పునాదుల నుంచి ఉన్న వారు. కేసీఆర్ తెలుగుదేశం పార్టీని ఆ పార్టీతో దశాబ్దాల అనుబంధాన్ని ఒక్క రాజీనామాతో తెంచుకుని 2020లో బయటకు వచ్చేశారు. ఆ సమయంలో ఆయన సిద్ధిపేట ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు. ఆయన వెంట వెళ్ళేందుకు కూడా ఎవరూ లేని పరిస్థితి అది. 1999 నవంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ మరోసారి గెలిచి చంద్రబాబు నాయకత్వంలొ అత్యంత పటిష్టంగా ఉంది. కేవలం ఏడాది కూడా కాకుండానే అంతటి బలమైన ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి కేసీఆర్ రావడం ఒక సాహసం అయితే ఆయనకు టీడీపీ నుంచి మద్దతు ఇచ్చే అనుచరులు పెద్దగా ఎవరూ లేరు. తాను ఒంటరిగా ఆయన నిలిచి టీఆర్ఎస్ ని 2001 ఏప్రిల్ 27న స్థాపించారు. ఆ సమయంలో ఆయన వెంట ఉన్నది మేనల్లుడు హరీష్ రావు మాత్రమే. ఆయనే కేసీఆర్ తో నడిచారు. ఆయన ఆనాటికి రాజకీయంగా పెద్దగా ఏమీ కారు, సిద్ధిపేటకు కేసీఅర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న రోజులల్లో ఆయన వెంట ఉండే అనుచరుడిగానే కనిపిస్తారు.
ఉద్యమాలలో రాటుదేలి :
ఇక మామను నమ్మి హరీష్ రావు తన ప్రజా జీవితాన్ని మొదలెట్టారు. ఆయన టీఆర్ఎస్ తరఫున ఉద్యమాలలో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయనలోని నాయకుడు బయటకు వచ్చారు. కేసీఆర్ మాదిరిగానే హరీష్ రావు కూడా మాస్ పల్స్ తెలిసిన వారు. మంచి మాటకారి. మాస్ లీడర్ గా ఎదిగారు. అంతే కాదు వ్యూహాలలోనూ ఆయన అందె వేసిన చేయిగా చెబుతారు. ఇక 2004లో తొలిసారి సిద్ధిపేట నుంచి గెలిచిన హరీష్ రావు వైఎస్సార్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత తెలంగాణా సాధన కోసం అనేక సార్లు ఉప ఎన్నికలను ఎదుర్కొని తిరిగి గెలిచారు. ఇలా జనంలో తనకు బలం ఉందని నిరూపించుకుంటూ వచ్చారు.
కేసీఆర్ తరువాత సీనియర్ :
ఇక కేసీఆర్ తరువాత బీఆర్ఎస్ లో సీనియర్ నేత ఎవరు అంటే హరీష్ రావు పేరునే అంతా చెబుతారు. ఆ తరువాత కాలంలో కేటీఆర్ కూడా పార్టీలో కీలకం అయ్యారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరూ కీలక శాఖలను చూసిన మంత్రులుగా కనిపిస్తారు. ఇక పార్టీలో చూస్తే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. హరీష్ రావు శాసన సభా పక్ష నాయకుడిగా ఉన్నారు. ఇలా సరిసమానంగా బాధ్యతలను మోస్తున్నారు. అయితే హరీష్ రావు మీద మాత్రం విమర్శలు ఆరోపణలు అయితే ప్రత్యర్ధులు తరచూ చేస్తూంటారు. ఆయన బీఆర్ఎస్ ని వీడి వేరే పార్టీలో చేరుతారు అని కూడా అంటూంటారు. దానిని ఆయన అనేక సార్లు ఖండిస్తూ వస్తున్నా కూడా ఎందుకో ఆ ఆరోపణల జడి ఎక్కడా ఆగడం లేదు.
రేవంత్ రెట్టింపుతో :
ఇక తాజాగా చూస్తే ఖమ్మంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ మారుతారు అని కూడా గట్టిగా చెప్పారు. లేకపోతే ఒట్టేయమని కూడా రెట్టించారు. బీజేపీ నేతలతో హరీష్ రావు మంతనాలు సాగిస్తున్నారు అని కూడా ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. దానికి తాజాగా ఘాటుగానే హరీష్ రావు జవాబు చెప్పారు. తన పుట్టుక చావూ రెండూ బీఆర్ఎస్ లోనే అని భావోద్వేగంతో కూడిన స్టేట్మెంట్ ఇచ్చారు. తాను ఎన్నో సార్లు ఈ విషయం చెప్పినా ప్రత్యర్ధులు మాత్రం అదే ఆరోపణలు పదే పదే చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు. తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సింది లేదంటూనే బీఆర్ఎస్ ని వీడిపోయేది లేదని అన్నారు. బీజేపీలో తాను చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నాను అన్నది ఒట్టిది అన్నారు. బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్ ని తాను కలసి చాలా కాలం అయింది అని కూడా వివరణ ఇచ్చారు.
ఆగని ఆరోపణలు ఎందుకు :
అయితే హరీష్ రావు ఇంతలా చెబుతున్నా ఆరోపణలు మాత్రం ఆగడం లేదు, ఎందుకు ఇలా అంటే ఇదంతా ప్రత్యర్ధుల రాజకీయ వ్యూహం అని అంటారు. అయితే ఇక్కడ లాజిక్ కూడా ఉంది. హరీష్ రావు బీఆర్ఎస్ లో కీలక నాయకుడు, కేసీఆర్ తరువాత సీనియర్. సహజంగా ఆ పార్టీలో అగ్ర భాగాన ఉంటూ సీఎం అభ్యర్థిగా ఆయన ముందుకు రావాల్సి ఉంది. అయితే కాబోయే సీఎం గా ఎపుడూ కేటీఆర్ పేరు ప్రచారంలో ఉండడంతో హరీష్ రావు పాత్ర ఏమిటి అన్న చర్చ కూడా వస్తోంది. సరిగ్గా ఈ సందేహాలను అనుమానాలను అవకాశంగా తీసుకునే ప్రత్యర్ధులు ఆయన పార్టీ మారుతారు అని విమర్శలు చేస్తున్నారు.
వీటికి ఎపుడు చెక్ అంటే :
ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ సీఎం అని అంటున్నారు. హరీష్ రావు కూడా సీఎం క్యాండిడేట్ కాబట్టి ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు కదా అన్న సూత్రాన్ని ఆధారం చేసుకుని ప్రత్యర్ధులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే హరీష్ రావు మాత్రం తన జీవితం అంతా బీఆర్ఎస్ లోనే అని అంటున్నారు. అయినా రాజకీయాల్లో పరమ పద సోపానం అన్నది ముఖ్యమంత్రి వంటి పదవులే కాబట్టి ఆయన మీద ఈ తరహా విమర్శలు ఆగడం లేదు అని అంటున్నారు. పైగా బీజేపీ వంటి జాతీయ పార్టీలు మహారాష్ట్రలో ఏక్ నాధ్ షిండేను, పశ్చిమ బెంగాల్ లో సువేందు అధికారిని తమతో కలుపుకున్నారు. తెలంగాణాలో కూడా వారి అన్వేషణ సాగుతోంది. ఈ క్రమంలోనే హరీష్ రావు ఎంత గట్టిగా చెప్పినా ఈ తరహా విమర్శలు వస్తున్నాయని అంటున్నారు. మరి వీటికి ఎపుడు చెక్ అంటే కాలమే సరైన సమయంలో తెర దించాల్సి ఉంటుందని అంటున్నారు.