ఖమేనీ అంత్యక్రియల్లో మాస్క్ మ్యాన్ ఎవరు? తొలిసారి ప్రజల ముందుకు కొత్త సుప్రీం లీడర్?

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

Update: 2026-07-12 15:29 GMT

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ కార్యక్రమంలో ముఖానికి నల్లటి మాస్క్, తలపై క్యాప్ ధరించి పాల్గొన్న వ్యక్తి ఎవరు అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఆ 'మాస్క్ మ్యాన్' ఎవరు?

'ఇరాన్ ఇంటర్నేషనల్' నివేదికల ప్రకారం.. ఆ రహస్య వ్యక్తి ఖమేనీ మనవడు, ముస్తఫా ఖమేనీ కుమారుడైన మహమ్మద్ జావెద్ ఖమేనీ అని తెలుస్తోంది. ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో జావెద్ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన శరీరంలో పెద్ద భాగం కాలిపోవడం వల్లే ముఖాన్ని పూర్తిగా కప్పుకుని అంత్యక్రియలకు హాజరయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఈ వార్తలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఎక్కడ?

ఇరాన్ అత్యున్నత పదవైన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజల ముందుకు రాకపోవడం గమనార్హం. తండ్రి అంత్యక్రియలతో పాటు, తన సోదరి, కూతురు, కోడలు, మనవరాలి అంతిమ సంస్కారాల్లో కూడా ఆయన కనిపించలేదు. ముస్తఫా, మేసమ్, మసౌద్ వంటి ఖమేనీ ఇతర కుమారులు పాల్గొన్నా.. మొజ్తబా గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి దాడుల్లో మొజ్తబా కూడా గాయపడ్డారని కొందరు విశ్లేషకులు భావిస్తుండగా, భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను అజ్ఞాతంలోకి తీసుకెళ్లారని మరికొందరు పేర్కొంటున్నారు.

జూలై 23న ఏం జరగబోతోంది?

ఈ గందరగోళం మధ్య, జూలై 23న టెహ్రాన్‌లో అయతుల్లా అలీ ఖమేనీ స్మారక సభను ప్రభుత్వం ప్రకటించింది. అలీ ఖమేనీని "అమరవీరుడు, ముజాహిద్ ఇమామ్"గా పేర్కొంటూ ఈ కార్యక్రమం మొజ్తబా ఖమేనీ పర్యవేక్షణలోనే జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆ రోజున మొజ్తబా ఖమేనీ తొలిసారిగా బహిరంగంగా ప్రజల ముందుకు వస్తారా? లేక మళ్ళీ గైర్హాజరవుతారా? అని ప్రపంచవ్యాప్తంగా నిఘా సంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మొజ్తబా తొలి బహిరంగ ప్రసంగం లేదా దర్శనం ఇరాన్ అంతర్గత రాజకీయాలతో పాటు.. మధ్యప్రాచ్య భద్రతా పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News