ఆర్ఎస్ఎస్ ఈజ్ గ్రేట్ అన్న మోడీ
దేశానికి 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్ర కోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ అనేక విషయాలను ప్రస్తావించారు.;
దేశానికి 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్ర కోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ అనేక విషయాలను ప్రస్తావించారు. తన రికార్డును తానే బద్ధలు కొడుతూ వంద నిముషాలకు పైగా ఆయన సుదీర్ఘమైన స్పీచ్ నే ఇచ్చారు. ఈ స్పీచ్ లో అనేక విషయాలను ప్రస్తావించారు. జాతీయ అంతర్జాతీయ సమస్యలను కూడా జనం ముందు ఉంచారు. అంతే కాదు ఒక వైపు పాక్ సవాళ్ళకు ధీటైన జవాబు ఇస్తూ మరో వైపు అమెరికా దూకుడుకు ధీటైన బదులు ఇచ్చారు.
ఆర్ఎస్ఎస్ కి కితాబు :
దేశం కోసం ఒక ప్రభుత్వేతర సంస్థ వందేళ్ళ పాటు పనిచేయడం అన్నది గొప్ప విషయంగా నరేంద్ర మోడీ చెప్పారు. 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టింది అని గుర్తు చేశారు. గత వంద సంవత్సరాలుగా దేశానికి సేవ చేస్తున్న ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకుల అంకితభావానికి ప్రధానమంత్రి మోదీ అభివందనం చేశారు. వ్యక్తి నిర్మాణ్ సే రాష్ట్ర నిర్మాణ్ అనే సంకల్పంతో స్వయంసేవకులు దేశ సంక్షేమానికి తమ జీవితాలను అంకితం చేశారని మోడీ కొనియాడారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీఓ అని మోడీ చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ కి వంద సంవత్సరాల అంకితభావ చరిత్ర ఉందని సరైన వేదిక మీద జాతికి సరైన సందేశం ఆ సంస్థ గురించి మోడీ పంపించారు.
గ్యాప్ ఉందన్న ప్రచారంతో :
ఆర్ఎస్ఎస్ తో బీజేపీకి భారీ గ్యాప్ ఉందని ప్రచారం ఇటీవల కాలంలో జరుగుతోంది. అంతే కాదు ఏడున్నర పదుల వయసు పూర్తి చేసుకున్న వారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని కూడా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఈ మధ్య సూచించారు. దాంతో అవన్నీ మోడీ గురించే అని కూడా అనుకున్నారు. ఇలా ఆర్ఎస్ఎస్ విషయంలో ఏదో దూరం అయితే ఉందని అంతా అనుకుంటున్న వేళ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ని ఆకాశానికి ఎత్తేశారు. అంతే కాదు ప్రపంచంలో సరిసాటి మరోటి లేదని కూడా బల్ల గుద్ది చెప్పారు.
జన్ సంఘ్ వ్యవస్థాపకుడిని తలుస్తూ :
అంతే కాదు జనసంఘ్ వ్యవస్థాపకుడిగా ఉంటూ తొలి ఎంపీ అయి కేంద్రంలో ఆ పార్టీ తరఫున తొలి మంత్రిగా కొన్నాళ్ళ పాటు పనిచేసిన శ్యామా ప్రసాద్ ముఖరీ గురించి కూడా మోడీ గొప్పగా చెప్పారు. ఆయన దేశం కోసం బలిదానం చేశారని అన్నారు. ఆయన సేవలను ప్రజలు ఎప్పటికీ మరచిపోరని చెప్పారు. దేశం బాగుండాలని ఆశించిన తొలి తరం నాయకులలో శ్యామా ప్రసాద్ ముఖరీ కీలక వ్యక్తిగా కూడా మోడీ పేర్కొన్నారు. మొత్తం మీద మోడీ ప్రసంగంలో సంఘ్ గురించి బీజేపీ పూర్వ రూపం అయిన జన సంఘ్ అధినేత గురించి సంస్మరించుకోవడం విశేష పరిణామం అని అంటున్నారు.