పవన్...ఒక అద్భుత సందేశం
యుద్ధ కళలు అభ్యసించడానికి శారీరక బలంతోపాటు మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణ అవసరం అని మోడీ తన సందేశంలో చెప్పుకొచ్చారు.;
జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన మొదటి నుంచి పవన్ మీద ప్రత్యేకంగా అభిమానం చూపిస్తూనే ఉంటారు. అలాంటిది పవన్ ఒక గ్రేట్ అచీవ్మెంట్ ని సాధిస్తే ఇక ఆయన అభినందనలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. అదే విధంగా పవన్ ని ఉద్దేశించి మోడీ గొప్పగా మెచ్చుకున్నారు. మీరు యువతకు ఒక అద్భుతమైన సందేశం అని కొనియాడారు ఇక మార్షల్ ఆర్ట్స్ లో మీ విజయం స్ఫూర్తిదాయకం అని ప్రధాని కితాబు ఇచ్చారు.
దశాబ్దాల సాధన :
పవన్ ఈ విజయం వెనక దశాబ్దాల సాధన ఇందని నరేంద్ర మోడీ అన్నారు. జపనీస్ కత్తి సాము కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా అరుదైన ఘనత పవన్ సాధించారు అని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రికి ఒక సందేశాన్ని పంపారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలో మీరు సాధించిన విజయాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాను. కెంజుట్సు లో అధికారిక ప్రవేశంతో ఘనత సాధించినందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఇటు ప్రజా జీవితంలో, అటు సినిమా కెరీర్ లో బిజీగా ఉంటూనే క్రమశిక్షణతో, నిజాయితీతో మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడం ప్రశంసనీయం అని అన్నారు. మీ విజయం ద్వారా వృత్తిపరమైన బాధ్యతలు కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కాదన్న బలమైన సందేశాన్ని యువతరానికి ఇచ్చారని పేర్కొన్నారు.
మీ వ్యక్తిత్వాన్ని చెబుతోంది :
యుద్ధ కళలు అభ్యసించడానికి శారీరక బలంతోపాటు మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణ అవసరం అని మోడీ తన సందేశంలో చెప్పుకొచ్చారు. ఇంతటి కఠినమైన సంప్రదాయాన్ని అనుసరించడం మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోందని పవన్ గురించి శభాష్ అన్న తీరులో తన భావాలు వెల్లడించారు. ఆరోగ్యకరమైన చురుకైన సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో రూపొందించిన ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాలకు ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి వ్యక్తులు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉందని కూడా పవన్ ని కోరారు. ఫిట్ నెస్ పట్ల మీకున్న క్రమశిక్షణ, నిబద్దత ఎంతో మందికి ప్రేరణ ఇస్తుందని మోడీ చెప్పారు. భవిష్యత్తులో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని మోడీ తన సందేశాన్ని ముగించారు.
నాకు గొప్ప గౌరవం :
ఇదిలా ఉంటే దేశాధినేత్ నరేంద్ర మోడీ తనను మెచ్చుకుంటూ పంపించిన సందేశం పట్ల పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మోదీకి కృతజ్ఞత సందేశ లేఖను పవన్ పంపించారు. ప్రధాని పంపిన ఆత్మీయ అభినందన సందేశం నాకు గొప్ప గౌరవం అని ఆయన అన్నారు. ప్రేమపూర్వకమైన మీ సందేశం నాకు మరింత ప్రోత్సాహాన్నిస్తాయని చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం మీరు తీసుకువచ్చిన ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాలు మీ దూరదృష్టికి నిదర్శనం అని పవన్ చెప్పారు. మీ నాయకత్వంలో బలమైన దృఢమైన భారతదేశం నిర్మితమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వామి వివేకానంద ఆకాంక్షించిన బలమైన సమాజం ఆవిష్కృతం అవుతుందని కూడా చెప్పారు. ఆరోగ్యకరమైన, క్రమశిక్షణగల సమాజం కోసం నిరంతరం మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రతి భారతీయుడికీ ప్రేరణనిస్తాయని పవన్ అన్నారు. మీలాంటి గొప్ప నాయకుడి నుంచి లభించిన ఈ ప్రోత్సాహం అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలన్న నా సంకల్పానికి మరింత బలాన్నిస్తుందని చెప్పారు. ప్రతి అడుగులో మీరిస్తున్న మద్దతుకు రుణపడి ఉంటానని పవన్ తన కృతజ్ఞత సందేశంలో పేర్కొన్నారు.