అమెరికా ఎంత గాయి చేసినా.. భారత్ తలొగ్గదంతే?

భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై జరుగుతున్న కీలక చర్చల నేపథ్యంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి;

Update: 2025-10-24 21:30 GMT

భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై జరుగుతున్న కీలక చర్చల నేపథ్యంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ ఎటువంటి దేశ ఒత్తిడికీ లొంగదని, దేశ ప్రజల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిస్తామని ఆయన దృఢంగా ప్రకటించారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య, ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా గోయల్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

* స్వతంత్ర ఆర్థిక వ్యూహమే భారత్ లక్ష్యం

"భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే స్వతంత్ర ఆర్థిక వ్యూహాలను అవలంబించడం తప్పనిసరి. ఏ దేశం చెప్పిందని వెంటనే మేము నిర్ణయాలు తీసుకోబోము. ప్రతి ఒప్పందం భారత ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే పరిశీలించబడుతుంది" అని గోయల్ స్పష్టం చేశారు.

కొవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో మార్పులు వచ్చాయని గుర్తుచేస్తూ ప్రపంచ దేశాలతో విశ్వసనీయ సంబంధాలను కొనసాగించాల్సిన అవసరాన్ని భారత్ గుర్తించిందని ఆయన తెలిపారు. అందులో భాగంగానే పలు అభివృద్ధి చెందిన దేశాలతో వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఒప్పందాలు కేవలం సరుకు మార్పిడికి మాత్రమే కాకుండా, సాంకేతికత, పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్ ప్రాప్తికి కూడా దోహదపడతాయని వివరించారు.

*సుంకాల బెదిరింపులకు తలొగ్గం

అమెరికా తరఫున పలు సందర్భాల్లో భారత్‌పై సుంకాల బెదిరింపులు వినిపిస్తున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు మరింత విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి. "ఇప్పటికే భారత్‌పై ఉన్న సుంకాలను అంగీకరిస్తున్నాం కదా అని మరిన్ని సుంకాలు విధిస్తే, మేము ఇతర ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తాం. భారత్ ఎప్పుడూ బెదిరింపులకు లొంగదు. చర్చలు పరస్పర గౌరవం, సమాన భాగస్వామ్యం ఆధారంగా ఉండాలి" అని ఆయన గట్టిగా తేల్చి చెప్పారు.

*భారత్ వాణిజ్య దిశ: ఎఫ్‌టీఏలపై దృష్టి

ప్రస్తుతం భారత్ యూరోపియన్ యూనియన్, యుకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి దేశాలతో కూడా సమగ్ర వాణిజ్య ఒప్పందాలు (FTA) కుదుర్చుకునే దిశగా చురుకుగా అడుగులు వేస్తోంది. ఈ ఒప్పందాల ద్వారా ఉత్పత్తి, ఎగుమతి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. "మేడ్ ఇన్ ఇండియా – ట్రేడ్ ఫర్ ది వరల్డ్" అనే ధ్యేయంతో భారత్ ముందుకు సాగుతోందని ఆయన పునరుద్ఘాటించారు.

అమెరికా లేదా ఏ దేశం ఒత్తిడికీ లొంగకుండా, దేశ ఆర్థిక స్వాభిమానాన్ని ప్రతిబింబిస్తూ, ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ తన స్థానాన్ని దృఢంగా నిలబెట్టుకుంటుందని పీయూష్ గోయల్ వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.

Tags:    

Similar News