పిఠాపురం వర్మ: రాజకీయానికి ఆయనే చెక్ పెట్టేసుకున్నారా ?
పిఠాపురం అసెంబ్లీకి నెగ్గిన ఎమ్మెల్యేల చరిత్ర ఒక్కసారి చూస్తే కనుక ఎక్కువ మంది ఆ సామాజిక వర్గం నుంచే గెలిచి వచ్చారు.;
పిఠాపురం ఏపీలో గోదావరి జిల్లాలలో ఒక కీలక అసెంబ్లీ నియోజకవర్గం. గోదావరి జిల్లాలు అనగానే అక్కడ బలమైన కాపు సామాజిక వర్గం అందరికీ గుర్తుకు వస్తుంది. ఆ సామాజిక వర్గం అత్యధిక ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలే ఎక్కువ. ఇక పిఠాపురం దీనికి మరింత ప్రత్యేకం. అక్కడ నూటిని ఎనభై శాతం పైగా కాపు సామాజిక వర్గం ఉంటుంది. పిఠాపురం అసెంబ్లీకి నెగ్గిన ఎమ్మెల్యేల చరిత్ర ఒక్కసారి చూస్తే కనుక ఎక్కువ మంది ఆ సామాజిక వర్గం నుంచే గెలిచి వచ్చారు. అది సహజం కూడా. అలాంటి బలమైన సామాజిక వర్గం కోటలో వర్మ కీలకంగా వ్యవహరించడమే కాదు ఏకంగా ఎమ్మెల్యే అయ్యారు. ఇది ఒక విధంగా రాజకీయ చిత్రంగానే చూడాలి.
జనసేనతో పొత్తు :
వర్మకు టీడీపీ టికెట్ కానీ ఆ పార్టీ రాజకీయం కానీ పెద్దగా కలిసి రాలేదు అని చెప్పాల్సి ఉంది. ఆయనకు టీడీపీ 2014లో టికెట్ ఇవ్వలేదు, అయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి దాదాపుగా 50 వేల మెజారిటీతో గెలిచారు. ఇక 2019లో పార్టీ టికెట్ ఇచ్చింది. అయినా వైసీపీ వేవ్ లో ఓటమి పాలు అయ్యారు. 2024 కి వచ్చేటప్పటికి టికెట్టూ లేదూ సీటూ లేదు దాంతో ఎన్నికల ముందే ఆయన రాజకీయంగా డీలా పడ్డారు. ఇక అక్కడ పోటీ చేసింది మామూలు వ్యక్తి కాదు, జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్. ఆయన పిఠాపురం ఎంచుకోవడంతోనే వర్మ రాజకీయం ఇబ్బందిలో పడింది అని అంటారు. అది ఈ రోజున ఆయనకు ఇంచార్జి పదవిని లేకుండా చేసే దాకా వచ్చింది.
దూకుడుగానే ఉంటూ :
ఇక వర్మ రాజకీయం చూస్తే దూకుడుగా సాగింది. ఆయన ఎంతసేపూ టీడీపీని బలోపేతం చేస్తున్నాను వాయిస్ వినిపిస్తున్నాను అని అనుకున్నారే తప్ప అధినాయకత్వం మనసెరిగి ఆలోచించడంలేదని అంటున్నారు. పవన్ చంద్రబాబు సమాన స్థాయిలో కూటమిలో ఉన్నారు. ఆయన్ని బాబు అదే తీరున గౌరవిస్తున్నారు. 2029 ఎన్నికల్లో కూడా కూటమి కలసికట్టుగా ఎన్నికలకు వెళ్తుంది. ఆ విధంగా చూస్తే పవన్ కే మళ్ళీ టికెట్ దక్కుతుంది. ఇవన్నీ తెలిసి కూడా వర్మ అయితే తన రాజకీయ దూకుడుతో ముందుకు సాగారు. అధినాయకత్వం మెప్పు దక్కుతుంది అనుకున్నారు. పార్టీని జనంలో ఉంచాలి, పటిష్టం చేయాలి, కానీ కూటమితో కలిసే సఖ్యతగా ముందుకు సాగాలి. ఈ విషయం అయితే వర్మ గ్రహించలేకపోయారా అన్న చర్చ సాగుతోంది.
సమీకరణలను చూసినా :
ఇక పిఠాపురంలో చూస్తే జనసేనకు పవన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీకి వంగా గీత అదే సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. టీడీపీ నుంచే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వర్మకు చాన్స్ ఇచ్చారు. ఒక విధంగా సామాజిక సమీకరణలను దాటి టీడీపీ తీసుకున్న కీలక నిర్ణయం ఇది. దానికి వర్మ కూడా కారణం. ఆయన సైతం అన్ని సామాజిక వర్గాల మద్దతు మన్నన పొందారు. అందరితో పాటుగా ఉంటూ కీలక నాయకుడిగా జనం మెప్పు పొందారు. అందుకే ఆయన విషయంలో సామాజిక సమీకరణలు పెద్దగా పార్టీ పట్టించుకోలేదు. ఎపుడైతే జనసేన ఎంట్రీ ఇచ్చిందో ఏకంగా అధినాయకుడు పవన్ ఎమ్మెల్యే అయ్యారు, దాంతో జనసేన వర్సెస్ వర్మ అంటే అది రాష్ట్ర స్థాయిలో పవన్ కి ఇబ్బందిగా ఉంది.
ఇపుడు వర్మ ఒంటరి :
ప్రత్యేకించి నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి యాంటీగా మారుతోంది అని గ్రహించిన అధినాయకత్వం కీలక సమయంలో వర్మను ఇంచార్జి పదవి నుంచి తప్పించేసింది. దాంతో ఇపుడు వర్మ ఒంటరి అయ్యారు. సొంత పార్టీలో ఏమీ కాని వారు అయ్యారు. రెండున్నర దశాబ్దాలుగా ఆయన టీడీపీని నమ్ముకుని చేసిన రాజకీయం రెండేళ్ళ కాలంలో ఆయన దూకుడుతో చెడగొట్టుకున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. కూటమిగా ఉన్నంతవరకూ అక్కడ టీడీపీ పక్క వాయిద్యం గా ఉండాలి. వర్మతో అయితే అది సాగేది లేదు, అందుకే ఆయనను పక్కన పెట్టేసారు అని అంటున్నారు. ఈ నిర్ణయంతో జనసేనకు టీడీపీ తన సానుకూలతను సఖ్యతను తెలియచేసింది. ఇక వర్మని పార్టీ దూరం పెట్టినా సామాజిక వర్గం పరంగా పెద్దగా నష్టం జరిగేది ఉండదని భావన కూడా ఉంది. మొత్తానికి వర్మ రాజకీయానికి ఆయనే చెక్ పెట్టేసుకున్నారా అన్న చర్చ సాగుతోంది. ఫ్యూచర్ లో ఆయనకు ఏ నామినేటెడ్ పదవులు కానీ ఎమ్మెల్సీ కానీ దక్కుతుందా అంటే అది మిలియన్ డాలర్ ప్రశ్నగానే ఉంది మరి. ఏది ఏమైనా పిఠాపురం వర్మ రాజకీయం ప్రస్తుతానికి అయితే ముగిసినట్లే అని అంటున్నారు.