పిఠాపురం వైసీపీలో సంచలనాలు నమోదవుతాయా ?
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన బలంగా తయారు అయింది. ఎందుకు అంటే అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.;
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన బలంగా తయారు అయింది. ఎందుకు అంటే అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక పిఠాపురంలో జనసేన టీడీపీ కూటమి కట్టాయి. బీజేపీ మద్దతు ఉంది. దాంతో 2024లో వార్ వన్ సైడ్ అయింది.
ఇపుడు కూడా అలాగే సీన్ ఉంది. పైగా 2019 నుంచి 2024 దాకా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగిన పెండం దొరబాబు ఎన్నికల అనంతరం జనసేనలోకి తన అనుచరులతో కలసి చేరిపోయారు. దాంతో వైసీపీ బలహీనపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి పవన్ చేతిలో ఓటమి పాలు అయిన వంగా గీత గురించి అంతా చర్చించుకుంటున్నారు.
ఆమె వైసీపీ తరఫున పెద్దగా కార్యక్రమాలు నిర్వహించడంలేదు అని అంటున్నారు. వైసీపీ రాష్ట్ర శాఖ ఏ పిలుపు ఇచ్చినా పిఠాపురంలో మొక్కుబడిగా సాగుతున్నాయని అంటున్నారు. దానికి కారణం ఆమె పెద్దగా ఆసక్తిని చూపించడంలేదు అని అంటున్నారు. పిఠాపురంలో జనసేన బలంగా ఉండటం మరో కారణంగా చెబుతున్నారు. ఇంకా కూటమికి నాలుగేళ్ల వరకూ అధికారం ఉంటుంది మధ్యలో ఆందోళనలు చేస్తే టార్గెట్ అవుతామని చాలా మంది వైసీపీ నేతలు కూడా తెర చాటు అవుతున్నారు.
దాంతో వంగా గీత సైతం డీలా పడుతున్నారని అంటున్నారు. ఇక వైసీపీ ఎత్తిగిల్లకపోవడంతో పాటు ఆ పార్టీ పెద్దల చూపు టీడీపీ ఇంచార్జి అయిన వర్మ మీద ఉండడం కూడా ఆమెను పునరాలోచన పడేలా చేస్తోంది అని అంటున్నారు. తాను ఎంత తెగించి పోరాడినా 2029 ఎన్నికల నాటికి ఎవరు వచ్చి టికెట్ అందుకుంటారో తెలియని నేపథ్యంలో ఎందుకొచ్చిన గోడు అని ఆమె గమ్మున ఉంటున్నారు అని అంటున్నారు.
ఇక మరో వైపు జరుగుతున్న ప్రచారం ఏమిటి అంటే పిఠాపురం వర్మ వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ వైపు వస్తారని. ఆయనకు పవన్ ఉండగా ఎమ్మెల్యేగా కూటమి నుంచి పోటీ చేసే చాన్స్ దక్కదని అంటున్నారు. దాంతో ఆయనను లాగే ప్రయత్నాలు వైసీపీ మొదలెట్టింది అని అంటున్నారు. వర్మ వస్తే ఆయన వైపు ఉన్న అతి పెద్ద వర్గం కూడా వైసీపీ వైపు వస్తుందని అలా పార్టీ స్ట్రాంగ్ అవుతుందని పవన్ కి యాంటీగా పోటీ చేసే సత్తా వర్మకు ఉందని వైసీపీ నమ్ముతోంది. అందుకే ఆయనకు అనేక హామీలు ఇచ్చేందుకు సైతం సిద్ధపడుతున్నారు అని అంటున్నారు.
ఇక వర్మ సైతం కూటమిలో అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మరి ఈ పరిణామాలు ఇలా సాగుతూండగానే వంగా గీత గతంలో ప్రజారాజ్యం లో పనిచేయడంతో పాటు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో మంచి పరిచయాలు ఉండడంతో కచ్చితంగా ఆమె జనసేన వైపు వస్తారని అంటున్నారు. అందుకే ఆమె పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అని అంటున్నారు.
మొత్తం మీద పిఠాపురం రాజకీయం ఇప్పటికి అయితే ఎవరికీ అర్ధమవకుండా ఉంది. కానీ అర్ధం కావాలంటే కొంతకాలం పోవాలని అంటున్నారు. అపుడు వారు వీరు అవుతారని వీరు వారు అవుతారని అలా ఎవరు ఎక్కడ ఉంటారో ఒక క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ రోజున మాత్రం చూస్తే పిఠాపురంలో ఫ్యాన్ పార్టీ అయితే పెద్దగా తిరగడం లేదు అని అంటున్నారు. అక్కడ నాయకత్వం సమస్య ఉందని అధినాయకత్వం భావిస్తోంది అంటే గీత దాటేది ఎవరో వేచి చూడాల్సిందే.