పవన్ జీ... పట్టించుకోండి జీ!

పిఠాపురం పవన్ కళ్యాణ్ కి ఎంతో స్పెషల్. ఎందుకంటే ఆయనను తొలిసారి ఎమ్మెల్యేగా చేసిన అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది.;

Update: 2025-08-11 13:23 GMT

పిఠాపురం పవన్ కళ్యాణ్ కి ఎంతో స్పెషల్. ఎందుకంటే ఆయనను తొలిసారి ఎమ్మెల్యేగా చేసిన అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది. 2019లో మొదటిసారి సార్వత్రిక ఎన్నికల బరిలోకి తన పార్టీని దించిన పవన్ కళ్యాణ్ తాను ఎలాగైనా అసెంబ్లీకి వెళ్ళాలని అనుకున్నారు. అందుకే ఆయన రెండు అసెంబ్లీ సీట్లకు పోటీ చేశారు. అందులో ఒకటి విశాఖ జిల్లాలోని గాజువాక అయితే రెండు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. అయితే ఈ రెండు చోట్ల ఓడిన పవన్ ని జనసేనను నేనున్నాను అని ఆదరించి అక్కున చేర్చుకున్న అసెంబ్లీ నియోజకవర్గం పిఠాపురం.

అదే శాశ్వతం నియోజకవర్గంగా :

పవన్ రాజకీయాల్లో ఉన్నంతకాలం పిఠాపురం నే తన శాశ్వత నియోజకవర్గంగా చేసుకుంటారు అని అంతా గట్టిగా నమ్ముతున్నారు. జనసైనికులు అయితే పవర్ కేరాఫ్ పిఠాపురం అని కూడా ఎపుడో డిసైడ్ అయ్యారు. అటువంటి పిఠాపురంలో పవన్ గెలిచిన తరువాత జనసేన రాజకీయ బలం కూడా పెరిగింది. దాంతో పవన్ సొంత సీటుని కంచుకోటగా మార్చాలని జనసేన నాయకులు సైతం తగిన వ్యూహాలను రచిస్తున్నారు. అయితే జనసేన పదిహేను నెలల పనితీరు మీద జనాలలో ఏ రకమైన స్పందన ఉంది అన్నదే ఇపుడు చర్చగాఉంది.

గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇదేనా :

గ్రౌండ్ లెవెల్ లో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇదే అని అంటున్నారు. పవన్ జీ ముందుగా పిఠాపురాన్ని పట్టించుకోండి అని ప్రజలు కోరుతున్నారని చెబుతున్నారు. అంతే కాదు వివిధ రకాలైన స్థానిక సమస్యల మీద వారు ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. కాకినాడ మున్సిపాలిటీ పరిధిలో పేరుకుపోయిన సమస్యల పట్ల జనంలో అయితే అసహనం వ్యక్తం అవుతోంది అని అంటున్నారు. దానికి తాజాగా ఒక వార్డు ప్రజానీకం వెళ్ళబుచ్చిన మనోభావాలే ఉదాహరణ అంటున్నారు.

మా దుస్థితి ఇదీ అంటూ :

తాజాగా పిఠాపురం మున్సిపాలిటీ లోని 28వ వార్డు ప్రజలు అయితే తమ వద్దకు వచ్చిన మున్సిపల్ అధికారిని చుట్టుముట్టి మరీ అనేక ఫిర్యాదులే చేశారు. తమ బాధను కూడా వారు వ్యక్తం చేశారు. తాము సమయానికి సకాలంలో పన్నులు కడుతున్నామని వారు గుర్తు చేస్తున్నారు. అయినా తమకు ఏమిటీ ఈ దుస్థితి అని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ ఏఈని అయితే వారు ఏకంగా నిర్బంధించి మరీ ప్రశ్నల వర్షం కురిపించారు. తాము గత కొంతకాలంగా మురికి నీటిలోనే ఉంటున్నామని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు పాలకుల మీదనే :

తమ సాధక బాధకాలను అధికారులు పాలకులు కనీసంగా కూడా చూడరా అని ఆ వార్డు జనాలు అయితే మండిపడుతున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా తమ నియోజకవర్గానికి చెందిన వారు తాము ఓటేసి గెలిపించిన పవన్ కళ్యాణ్ ఉండడం సంగతి ఎలా ఉన్నా ముందు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండాలని వారు గట్టిగా కోరుతున్నారు. తొలుత పవన్ ఎమ్మెల్యేగా తనను ఎన్నుకున్న ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి న్యాయ్మ్ చేస్తూ అభివృద్ధి చేయాలని కూడా వారు కోరుతున్నారు. ఇక స్థానికంగా ఉన్న జనసేన నేతలు అయితే చాలా మంది ఫోటోలకే పరిమితం అవుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫోకస్ పెట్టాల్సిందేనా :

ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అని అంటారు. ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా ప్రజా ప్రతినిధిగా ముందు ఎవరైనా ఒక స్థానం నుంచి గెలవాల్సిందే. అలా చూస్తే తాము గెలిచిన సీటు పదిలంగా ఉంటే అన్నీ బాగా ఉంటాయి. అలాంటి పునాది లాంటి పిఠాపురం సీటు విషయంలో పవన్ కళ్యాణ్ మరింత ఫోకస్ పెట్టాల్సి ఉందని ఆ వార్డు ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను బట్టి అర్ధం అవుతోంది అంటున్నారు. తమ సమస్యలు ఇవీ అని జనాలు చెబుతున్నారు. అధికారులు ఎన్నుకున్న వారు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరి పిఠాపురాన్ని జనసేనానికి కంచుకోటగా చేస్తామని చెబుతున్న జనసైనికులు సైతం రంగంలోకి దిగి ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గాలు చూడాలని కోరుతున్నారు. ఏది ఏమైనా పిఠాపురం అయితే పవన్ ని పిలుస్తోంది. చూడాలి మరి జనసేన ఏ విధంగా స్పందిస్తుందో.

Tags:    

Similar News