పినరయి విజయన్...మౌనంగా దూరంగా !
అయితే ఎన్నికల తరువాత పినరయి విజయన్ తన కంటికి ఆపరేషన్ చేయించుకున్నారని దాని వల్ల కొంత విశ్రాంతి తీసుకుంటున్నారు అని అంటున్నారు.;
ఆయన కమ్యూనిస్టు దిగ్గజ నేత. కేరళ రాష్ట్రాన్ని 2016 నుంచి వరసగా రెండు సార్లు గెలిపించి పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిత్వం వహించిన ఘనాపాఠీ. గత ఐదున్నర దశాబ్దాల నుంచి కేరళ రాజకీయాల్లో తలపండిన వారు. 1970లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విజయన్ అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వివిధ మంత్రిత్వ శాఖలను చూశారు. కేరళ రాష్ట్ర సీపీఎం కమిటీకి ఏకంగా 17 ఏళ్ళ పాటు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఎనిమిది పదుల వయసు కలిగిన పినరయ్ విజయన్ కేరళ వామపక్ష పార్టీలకే కాదు దేశంలో వామపక్ష భావజాలానికి కూడా ఆశాకిరణంగా ఉన్నారు. దేశంలో వామపక్షాలకు ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. అక్కడ మరోసారి కనుక లెఫ్ట్ కూటమి అధికారంలోకి రాకపోతే పినరయి విజయన్ తో పాటుగా వామపక్ష అధికార ప్రభ కూడా ఇబ్బందుల్లో పడుతుంది.
ఎన్నికల తరువాత :
కేరళలో ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. ఆ తరువాత నుంచి ముఖ్యమంత్రి విజయన్ తన అధికారిక కార్యక్రమాలకు దూరం పాటిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు మీడియా ముందు కూడా పెద్దగా కనిపించడం లేదని పూర్తి మౌనం దాల్చారని అంటున్నారు. మరి ఫలితాల గురించి ఏమైనా విశ్లేషించుకుని ఈ విధంగా వ్యూహాత్మకంగా సైలెన్స్ పాటిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. కేరళ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కి కొంత మొగ్గు ఉందని ప్రీ పోల్ సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. దానికి తోడు పోలింగ్ అనంతరం ప్రతీ పార్టీ సొంతంగా చేయించుకున్న సర్వేలు క్యాడర్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా ఉంటుంది. బహుశా ఇవన్నీ చూసుకుని కేరళ సీఎం గా పినరయి విజయన్ మౌనం దాల్చారా అన్న చర్చ వస్తోంది.
వైద్యం వల్లనే అంటూ :
అయితే ఎన్నికల తరువాత పినరయి విజయన్ తన కంటికి ఆపరేషన్ చేయించుకున్నారని దాని వల్ల కొంత విశ్రాంతి తీసుకుంటున్నారు అని అంటున్నారు. అయితే ఆయన సొంత రాష్ట్రం కేరళలో కాకుండా తమిళనాడులోని చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోవడం పట్ల కూడా విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం గొప్పదని చెబుతూ వచ్చిన ఈ కామ్రేడ్ ప్రైవేట్ వైద్యాన్ని ఆశ్రయించడమేంటని కూడా విపక్షాలు నిందిస్తున్నాయి. ఇక ప్రభుత్వ పాలన సంగతి ఏమిటి అని కూడా నిలదీస్తున్నాయి. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఆయన దైనందిన పాలనా వ్యవహరాలు చూడాల్సి ఉంటుంది కదా అని అంటున్నారు.
అంతా సజావుగానే :
అయితే ముఖ్యమంత్రి ఆరోగ్యం విషయంలో కానీ పాలన విషయంలో కానీ విపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని వామపక్ష పార్టీలు అంటున్నాయి. ఆయన కొంత విశ్రాంతిని తీసుకుంటున్నప్పటికీ ఆరోగ్యం బాగానే ఉందని ఇక పాలనా పరంగా చూస్తే ఆన్ లైన్ లో కేబినెట్ మీటింగ్ ని నిర్వహించారని కూడా చెబుతున్నారు. అంతా సజావుగా సాగుతోందని కూడా అంటున్నారు. 81 ఏళ్ళ విజయన్ మరోసారి గెలుస్తారు అని హ్యాట్రిక్ సీఎం గా గద్దెనెక్కి రికార్డు క్రియేట్ చేస్తారు అని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా ఈ ఎన్నికలు వామపక్షాలకు ప్రత్యేకించి సీపీఏం కి జీవన్మరణ సమస్యగా మారాయని అంటున్నారు. కేరళను నిలబెట్టుకోకపోతే దేశంలో ఎర్ర పార్టీకి రెడ్ సిగ్నల్ అని కూడా విశ్లేషణలు ఉన్నాయి.