బిజినెస్ మ్యాన్ బాబూభాయ్ మాదిరి చేస్తే.. అన్నదాతలకు కొండంత అండ
అందరూ ఖర్చు చేస్తారు. కానీ.. ఆ ఖర్చుతో కలిగే ప్రయోజనం చాలా ముఖ్యం. కొందరు అదే పనిగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు.;
అందరూ ఖర్చు చేస్తారు. కానీ.. ఆ ఖర్చుతో కలిగే ప్రయోజనం చాలా ముఖ్యం. కొందరు అదే పనిగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. వారి ఖర్చు కారణంగా ఎవరికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందన్నది కూడా క్వశ్చనే. అందుకు భిన్నంగా మరికొందరు తాము ఖర్చు చేసే ప్రతి రూపాయికి పది రూపాయిల ఫలితం కలిగేలా వ్యవహరిస్తుంటారు.వారి ఆలోచన ఏదైనా.. అలా తెలివిగా ఖర్చు చేసే వారి కారణంగా వందల కుటుంబాల కష్టాలు.. వారి బతుకుసిత్రం మారిపోతే అంతుకు మించి కావాల్సిందేంటి?
గుజరాత్ లోని వజ్రాల నగరిగా పేరున్న సూరత్ లో కోటీశ్వరులకు కొదవ లేదు. అదే సమయంలో సూరత్ లో పలువురు వ్యాపారవేత్తలు తమ ఉద్యోగులకు ఇచ్చే నజరానాలతోనూ.. వారు చేసే ఖర్చుతోనూ.. దాన ధర్మాలతోనూ మీడియాలో వార్తలుగా మారుతుంటారు. ఆ కోవలోకే వస్తారు వ్యాపారవేత్త బాబూభాయ్ జిరావాలా. ఆయన తాజాగా రూ.కోటి కంటే తక్కువ ఖర్చు చేశాడు
అయితేనేం.. ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగా 290 మంది రైతు కుటుంబాల బతుకు సిత్రాన్నే మార్చేశాడు. అమ్రేలీ జిల్లాలోని జిరా గ్రామస్థులు పలువురు తీసుకున్న రుణం.. వారిని దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉంది. 290 మంది రైతులు తాము తీసుకున్న రుణాలకు కిస్తీల పద్దతిలో మూడు దశాబ్దాలుగా (30 ఏళ్లుగా)చెల్లిస్తూనే ఉన్నా.. వారి అప్పు మాత్రం తీరని పరిస్థితి. వీరి దీనగాథ గురించి తెలిసిన బాబూభాయ్ రూ.89,89,209 మొత్తాన్ని 290 మంది రైతులకు అందజేశారు.
తన తల్లి వర్ధంతిని పురస్కరించుకొని రైతులకు అందజేసిన ఈ మొత్తంతో (రూ.కోటి కంటే తక్కువ) 1995 నుంచి ఆ రైతుల్ని వేధిస్తున్న రుణ భారం తీరిపోయేలా చేశారు. కోటి రూపాయిల కంటే తక్కువ మొత్తంతో 290 మంది రైతు కుటుంబాలను దశాబ్దాలుగా వేధిస్తున్న రుణ సమస్యను శాశ్వితంగా తొలగించిన వైనం అందరిని ఆకర్షిస్తోంది. ఖర్చు చేసే వారిలో కొంతమంది అయినా బాబూభాయ్ మాదిరి ఆలోచిస్తే ఎన్నో పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్న మాట నిజం.