మోడీ మాష్టారు మాట మీద నిలబడలేదు.. పెట్రోల్.. డీజిల్ ధరల పెంపు
అనుకున్నదే జరిగింది. అంచనాలే నిజమయ్యాయి. గడిచిన పన్నెండేళ్ల కాలంగా మోడీ సర్కారు తీరు తెన్నుల్ని చూసినవారంతా ఊహించిందే నిజమైంది.
అనుకున్నదే జరిగింది. అంచనాలే నిజమయ్యాయి. గడిచిన పన్నెండేళ్ల కాలంగా మోడీ సర్కారు తీరు తెన్నుల్ని చూసినవారంతా ఊహించిందే నిజమైంది. ఎన్నికలు ముంచుకు వస్తున్నా.. ఎన్నికల గంట మోగేందుకు సమయం ఆసన్నమైనా.. ఎంత ఇబ్బంది అయినా సరే.. పైకి కించిత్ కనిపించకుండా ఉంటూ.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచే విషయంలో అసలేం పట్టనట్లుగా వ్యవహరించే కేంద్రం.. ఒకసారి ఎన్నికల ప్రక్రియ పూర్తై.. ఫలితాలు వెల్లడైనంతనే ధరలకు రెక్కలు రావటం మామూలే. తాజాగా అదే జరిగింది.
నిజానికి నాలుగు రాష్ట్రాలు.. ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల వేళలో.. పోలింగ్ పూర్తైన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరల్ని మోడీ సర్కారు పెంచుతుందంటూ విపక్షాలు చెబుతూనే ఉన్నాయి. అయితే.. తమకు అలాంటి ఉద్దేశం లేదన్న కేంద్రం మాటలే కాదు చివరకు మోడీషాలు సైతం ధరల పెంపుపై ఎలాంటి చర్యలు ఉండవన్నట్లుగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే.. ఇప్పటివరకు జరిగిన దానికి తాజాగా జరిగిన దానికి మధ్య తేడా ఏమంటే.. గతంలో ఎన్నికల పోలింగ్ పూర్తైన వెంటనే ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించేవారు.
తాజా ఎపిసోడ్ లో మాత్రం ఎన్నికల ఫలితాలు వెలువడి.. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు (అసోం, కేరళ మినహాయింపు) కొలువు తీరిన రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఆరు గంటల నుంచే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అమల్లోకి వస్తున్నట్లుగా ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్ రెండింటి మీదా లీటర్ కు రూ.3 చొప్పున పెంచారు. గడిచిన పదకొండు వారాల్లో పెట్రోల్.. డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి.
ఇరాన్ - అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధర భారీగా పెరిగింది. ఇందుకు తగ్గట్లే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 30- 45 శాతం వరకు పెరిగిన దాఖలాలు ఉన్నాయి. దీంతో పోలిస్తే.. తాజాగా పెరిగిన ధరలు 2.8 శాతం నుంచి 3.5 శాతం మేరకు పెరిగినట్లుగా చెప్పాలి. ఆయిల్ కంపెనీలు లీటరుకు రూ.3 చొప్పున పెంచిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పన్నుల కారణంగా తుదకు వినియోగదారుడికి దగ్గర దగ్గర రూ.3.20 - 3.50 మధ్య పెరిగే వీలుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రెటోల్.. డీజిల్ మీద రాష్ట్రాల పన్నులు ఎక్కువగా ఉండటంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో కంటే తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎక్కువగా ఉన్న పరిస్థితి. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ధరలు ఎక్కువగా ఉండటం తెలిసిందే.