ఇక పెద్దిరెడ్డి వంతు.. ఈ సారి చిక్కినట్టేనా.. ?
వైసీపీ నాయకులు.. చాలా మందిపై కూటమి ప్రభుత్వం వచ్చాక కేసులు నమోదైన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణంలో 3500 కోట్ల రూపాయల మేరకు బొక్కేశారన్న కేసు ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది
వైసీపీ నాయకులు.. చాలా మందిపై కూటమి ప్రభుత్వం వచ్చాక కేసులు నమోదైన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణంలో 3500 కోట్ల రూపాయల మేరకు బొక్కేశారన్న కేసు ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. జగన్ అప్పటి పీఎ.. కె, నాగేశ్వరరావుపై ప్రస్తుతం దృష్టిపెట్టారు. ఇక, అప్పట్లోనే జరిగిన మరిన్ని వివాదాలు.. హత్యలు.. శవం డోర్ డెలివరీ కేసులు.. నాయకులను వెంటాడుతున్నాయి. ఈ పరంపరలో ఇప్పుడు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంతు వచ్చింది.
వైసీపీ హయాంలో పంచాయతీ, అటవీశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి వ్యవహరించారు. ఆ సమయంలో కేంద్ర నిధులతో పంచాయతీల్లో రహదారులువేసే పనులు చేపట్టారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగాసాగాయి. ఆయా జిల్లాలో వైసీపీకి చెందిన వారు కాంట్రాక్టులు దక్కించుకున్నారన్నది తెలిసిందే. అయితే.. ఇప్పుడు కేంద్రం నుంచి పనుల నాణ్యతపై సందేహాలు వచ్చాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో రహదారులు పాడయ్యాయని.. ప్రస్తుతం పంచాయతీ రాజ్ అధికారులు కేంద్రానికి లేఖలుపంపారు.
వీటికి నిధులు ఇవ్వాలని కోరారు. అయితే... తాము నిధులు ఇచ్చి, ఆయా పనులు చేపట్టి .. కేవలం నాలు గేళ్లు కూడా కాకుండానే ఎందుకు పాడయ్యాయని.. వీటిపై విచారణ చేయాలని కేంద్రం నుంచి రాష్ట్రానికి తాఖీదు అందింది. దీంతో పెద్దిరెడ్డి జమానాలో చేపట్టిన రహదారుల నిర్మాణం. ముఖ్యంగా ఆయన సొంత నిర్మాణ సంస్థ పీఎల్ఆర్ దక్కించుకున్న కాంట్రాక్టులు.. చేపట్టిన పనులు వంటివాటిపై విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో 500 కోట్లరూపాయల మేరకు.. నిధులు సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు వున్నాయి.
తన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సంస్థ చేపట్టిన పనులు నాసిరకంగా ఉండడం.. ఇక్కడి రహదారులు రెండేళ్లకే ధ్వంసం కావడంతో ఆయా పనులపై విచారణ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. దీనిలో అవకతవకలు భారీగానే జరిగాయని విజిలెన్స్ అదికారులు భావిస్తున్నారు. దీనికితోడు కాంట్రాక్టర్ల ను కూడా బెదిరించి.. పీఎల్ ఆర్ సంస్థకే అన్ని పనులు కట్టబెట్టారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పెద్దిరెడ్డిపై చర్యలు ఖాయమని.. నిజాలు నిగ్గుతేలుతాయని చిత్తూరు రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాగా.. గత ఏడాది అటవీ భూములు ఆక్రమించుకున్నారని.. పవన్ కల్యాణ్ విమర్శలు చేసినప్పటికీ.. వాటిపైచర్యలు ఏమయ్యాయో.. ఇప్పటికీ అంతుచిక్కడం లేదు.