జగన్ నెత్తిన పాలు పోసిన పవన్....?
అదే విధంగా 2019 ఎన్నికల్లో కూడా జనసేనకు ఆరేడు శాతం ఓట్లు రావడానికి కారణం కాపులలో యూత్ ఓట్లు పోలరైజ్ కావడమే అంటున్నారు.;
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలు పసిగట్టడం రాజకీయ చాణక్యుడు అయిన చంద్రబాబుకే కావడంలేదు. జనసేన నాయకుడు పవన్ ఆవేశపూరిత నిర్ణయాలతో వైసీపీని దెబ్బతీయాలని అనుకున్నా అవి చివరికి ప్లస్ అయ్యేలాగానే ఉన్నాయని అంటున్నారు. ఎన్నికల ముందు వరకూ జనసేన సోలోగా ఫైట్ చేసి చివరి నిముషంలో పొత్తుల వైపు దారి తీసినా ఒక లెక్క ఉండేది.
అలా కాకుండా ఎన్నికలకు చాలా ముందుగానే టీడీపీతో దోస్తీ ప్రకటన పవన్ చేయడం ద్వారా ఆ పార్టీ ఆశావహులను అవకాశాలను కూడా దెబ్బ తీశారని అంటున్నారు. అదే టైం లో ఒక బలమైన సామాజికవర్గంగా నిర్ణయాత్మకమైన శక్తిగా ఉన్న కాపులను పూర్తిగా నిరాశలో నెట్టారని అంటున్నారు.
కాపులు ఏపీలో ఎపుడూ ఏకపక్షంగా లేరు. వారికి నచ్చిన పార్టీలో ఉంటూ వస్తున్నారు. అయితే వారు ఒకటి రెండు సందర్భాలలో మాత్రం మెజారిటీ ఓట్లను గంపగుత్తగా వేసిన నేపధ్యం ఉంది. 2009లో చిరంజీవి స్టార్ ఇమేజ్ ని చూసి ప్రజారాజ్యం పార్టీకి వారు మద్దతు ప్రకటించారు. అపుడు కాంగ్రెస్ టీడీపీల నుంచి ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ మెజారిటీ ప్రజారాజ్యం వైపు టర్న్ అయింది. దాంతోనే 18 శాతం ఓట్ల షేర్ తో పాటు 18 సీట్లు ఆ పార్టీకి వచ్చాయని అంటున్నారు.
అదే విధంగా 2019 ఎన్నికల్లో కూడా జనసేనకు ఆరేడు శాతం ఓట్లు రావడానికి కారణం కాపులలో యూత్ ఓట్లు పోలరైజ్ కావడమే అంటున్నారు. వారంతా పవన్ సీఎం అవుతారన్న ఆశలతో వేసిన ఓట్లుగా పేర్కొంటున్నారు. ఇక 2024 ఎన్నికల ముందు జనసేన టీడీపీతో పొత్తు అంటూ ప్రకటించడం ద్వారా సీఎం రేసులో నుంచి పవన్ లేడన్న సంకేతాన్ని పంపించేసింది అంటున్నారు.
దీంతో హార్డ్ కోర్ జనసేన క్యాడర్ ఆ పార్టీ వెంటనే ఉంటుంది, అలాగే యూత్ సపోర్ట్ కూడా ఉంటుంది. అయితే కాపులలో న్యూట్రల్ సెక్షన్స్ కానీ ఇతర వర్గాలు కానీ గతంలో మాదిరిగానే తమకు నచ్చిన రాజకీయ పార్టీని చాయిస్ గా తీసుకునే వెసులుబాటు పవన్ ముందే కలిగించారు అని అంటున్నారు. వైసీపీకి టీడీపీకి కూడా కాపుల ఓటు బ్యాంక్ ఉంది. అవి యధాప్రకారం కంటిన్యూ అయ్యే సూచనలు పవన్ తాజా ప్రకటనతో కనిపిస్తోంది అంటున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ గ్రాఫ్ పెరిగింది అని నూటికి 75 శాతం మంది తమ పార్టీకి మద్దతుగా ఉంటున్నారని ఈ పొత్తు ప్రకటన తరువాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. మళ్లీ వచ్చేది వైసీపీయే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇక మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా మరో ఇరవై ఏళ్ళ దాకా జగన్ని కదపలేరని కూడా జోస్యం చెప్పారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే తమకు ప్రజలతోనే పొత్తు ఉందని, వారే తమకు అధికారాన్ని మళ్ళీ ఇస్తారని అంటున్నారు
ఇవన్నీ ప్రకటనలు అనుకున్నా వీటి వెనక లెక్కలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జనసేన వల్ల టీడీపీకి 40కి పైగా సీట్లలో గెలుపు అవకాశాలకు గండి పడింది. అదంతా జనసేన సోలో ఫైట్ అని పవన్ సీఎం అని ఇచ్చిన నినాదం వల్ల వచ్చిన ఓట్ల షేర్ అనుకోవాల్సిందే అంటున్నారు. టీడీపీ జనసేన పొత్తు బాబు సీఎం అంటే ఆ 40 సీట్లలో కూడా సగానికి సగం ఓట్లు వెనక్కి వచ్చేస్తాయని అంటున్నారు.
అలా కనుక చూసుకుంటే ఇరవై సీట్ల దాకా జనసేన తన పాత ఓటు షేర్ ని నిలబెట్టుకుని అక్కడికి టీడీపీకి ఆ ఓట్లను బదిలీ చేసినా టీడీపీకి 23 ప్లస్ పాతికగా కలుపుకుని 43 సీట్లు అవుతాయని అంటున్నారు. ఇక టీడీపీ గ్రాఫ్ కూడా పెరిగింది అంటున్నారు. అయితే ఎంత పెరిగినా ఆ 23 సీట్లు డబుల్ అవుతాయనే లెక్క వేస్తోంది వైసీపీ. అంటే ఈ 43 సీట్లకు ఆ ఇరవై మూడుని కలుపుకుంటే 66 నంబర్ దగ్గర టీడీపీ ప్లస్ జనసేన కూటమి ఆగిపోతుంది అని అంటున్నారు.
అంటే 2019 ఎన్నికల్లో 151 సీట్లను తెచ్చుకున్న వైసీపీకి ఈ పొత్తు వల్ల అదనంగా మరో యాభై సీట్లు తగ్గినా 110 సీట్లకు పైగా నిఖార్సుగా గ్యారంటీ అని ఒక బండ్ లెక్క వేసుకుంటున్నారు. అంటే ఇది కనాకష్టంగా హోరాహోరీగా పోరు సాగితే కూడా వైసీపీ గెలిచే సీట్లు అని భావిస్తున్నారు.
ఇక జనసేన టీడీపీ పొత్తుల వల్ల రెండు పార్టీలలో అసంతృప్తులు, ఓట్ల బదిలీ కాకపోవడాలు, జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే అది టీడీపీకి ఎంతలా నష్టం చేస్తుందో ఆ లెక్కలు అదే విధంగా టీడీపీ ఏపీలో ఎపుడూ గెలవని 40 సీట్లు ఇవన్నీ కూడా కలిపి కూడితే కూటమికి సీట్లు అధికంగా అంటే గరిష్టంగా 50 నుంచి 60 దాకా వస్తే గొప్పే అన్నది వైసీపీ మరో విశ్లేషణ అంటున్నారు. అంటే అలా జరిగితే కనుక వైసీపీకి 125 సీట్లకు తక్కువ లేకుండా వస్తాయని అంటున్నారు
వీటికి మించి సజ్జల చేస్తున్న విశ్లేషణ చూస్తే 75 శాతం పాజిటివ్ ఓటింగ్ అంటే సంక్షేమమే గెలిస్తే సాలిడ్ గా వైసీపీకి 151 సీట్ల కంటే గెలిచి మరోసారి అధికారంలోకి వస్తుందని అంటున్నారు. అయితే 151 సీట్లు అన్నది మాటలకే చెప్పుకున్నా వైసీపీ 125, ఇంకా తగ్గితే 110 నంబర్ మీదనే నిలిచి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో 110 కంటే తగ్గదని, మళ్లీ అధికారం ఖాయమనే ధీమాతో ఉంది అంటున్నారు. ఇక జనసేన టీడీపీ పొత్తు వల్ల బలమైన సామాజిక వర్గం ఓట్లలో చీలిక తప్పించారని కూడా సంతోషితోంది.