అతి పెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టు... ఏపీకే గర్వకారణం

ఏపీ దశ తిరిగేలా మరో భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టనున్నారు. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ఎగుమతి టెర్మినల్ ఏర్పాటు కానుంది.;

Update: 2026-01-17 03:45 GMT

ఏపీ దశ తిరిగేలా మరో భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టనున్నారు. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ఎగుమతి టెర్మినల్ ఏర్పాటు కానుంది. ఈ టెర్మినల్‌ ని ఏఎం గ్రీన్‌ సంస్థ ఏర్పాటు చేయనుంది. దీంతో ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎగుమతులు జర్మనీ, సింగపూర్, జపాన్‌కు పెద్ద ఎత్తున జరుగుతాయి. అంతే కాదు గ్రీన్‌ ఎనర్జీ రంగంలో ఏకంగా వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ విధంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశానికి దిశా నిర్దేశం చేసేలా ఏపీలో ఈ కొత్త ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. అలాగే గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో కొత్త చరిత్రకు శ్రీకారం కూడా చుట్టనుంది.

చంద్రబాబు చేతుల మీదుగా :

ఇదిలా ఉంటే ఏపీలో 3 వేల కోట్ల రూపాయలతో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నరు. కాకినాడలో 495 ఎకరాలలో గ్రీన్ అమోనియా ప్లాంట్‌ కానుంది. ఇది ఏడాదికి ఒక మిలియన్ మెట్రిక్ టన్ను గ్రీన్ అమోనియా ఉత్పత్తిని చేస్తుంది. ఆ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది అని చెప్పాలి. . గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత పరిశ్రమలలో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక అడుగు వేయనుంది.

కూటమి ప్రభుత్వం అనుమతులు :

ఇక ఈ ప్రాజెక్ట్ విషయంలో చూస్తే గత ఏడాది గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన ఏఎమ్ గ్రీన్ సంస్థకు ఏడాదికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దాంతో అతి తక్కువ సమయంలోనే అంటే ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం విశేషంగా చెబుతున్నారు. గ్రీన్ హైడ్రోజన్‌ను ఉపయోగించి పూర్తిగా పునరుత్పాదక శక్తితో తయారయ్యే కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేస్తారు. బొగ్గు, చమురు, సహజ వాయువులతో తయారయ్యే గ్రే, బ్లూ అమోనియాకు భిన్నంగా ఈ ఉత్పత్తి జరుగుతుందని చెబుతున్నారు. ఈ విధంగా పర్యావరణానికి ఏమాత్రం హానికరం కాకుండా ప్రపంచం మొత్తం డీకార్బనైజేషన్, నెట్-జీరో ఎమిషన్స్ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా భవిష్యత్ ఇంధనాలుగా మారుతున్నాయని గట్టిగా చెప్పాల్సి ఉంది.

ఏపీకే గర్వకారణంగా :

కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దేశానికే గర్వకారణంగా నిలవనుంది అని నిపుణులు చెబుతున్నారు. 2027 చివరి నాటికి ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే విధంగా ఈ ఉప్తత్తులకు మంచి ఎగుమతుల అవకాశంగా కూడా ఉంది. గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడ పోర్ట్‌కు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దాంతో ఈ పోర్టు ద్వారా గ్రీన్ అమోనియాను అవసరమైన ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసే అద్భుత అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఏఎమ్ గ్రీన్ సంస్థ ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిపర్ ఎస్ఈతో ఒప్పందం కుదుర్చుకుంది. 2028 నుంచి ఏడాదికి 125 కేటీపీఏ గ్రీన్ అమోనియాను ఆ దేశానికి ఎగుమతి చేయనుందని చెబుతున్నారు. అలాగే మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్‌కు చెందిన జీఐసీ, యూఏఈకి చెందిన ఏడీఏఐ వంటి సంస్థల సహకారంతో ఏర్పాటు చేస్తోన్న ఈ ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందనుందని అంటున్నారు. అంతే కాదు ప్రాజెక్టుతో పాటే కాకినాడలోనే రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్‌ను కూడా ఏఎమ్ గ్రీన్ ఏర్పాటు చేస్తోంది. మొత్తానికి కొత్త ఏడాదిలో ఏపీకి సరికొత్త పారిశ్రామిక విప్లవంగా దీనిని చూడాల్సి ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News