ఇరాన్ నుండి ఢిల్లీలో ల్యాండ్ అయిన విమానం... ప్రజల భయంకర అనుభవం ఇదే!
అవును... అత్యంత దారుణంగా పతనమైన కరెన్సీ మారకం విలువ, విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు వెరసి.. ఇరాన్ లో తీవ్ర నిరసనలకు దారి తీసిన సంగతి తెలిసిందే.;
ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో రగిలిపోతూ, నెత్తురోడుతున్న ఇరాన్ లో దాదాపు గత రెండు వారాలకు పైగా పరిస్థితులు రోజు రోజుకీ మరింత హింసాత్మకంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. అక్కడ చిక్కుకున్న భారతీయులను విదేశాంగ శాఖ సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. తొలివిడతలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పలువురు భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారి భయంకరమైన అనుభవాలను వెల్లడించారు.
అవును... అత్యంత దారుణంగా పతనమైన కరెన్సీ మారకం విలువ, విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు వెరసి.. ఇరాన్ లో తీవ్ర నిరసనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అవి కాస్తా దారుణమైన హింసాత్మకంగా మారాయి. దీంతో.. ఇరాన్ వీధులన్నీ నెత్తురోడుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ చిక్కుకున్న భారతీయులు కొంతమంది ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా.. ఎటు చూసినా ఆందోళనకారులే ఉన్నారని.. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు.
ఇదే సమయంలో.. ఇంటర్నెట్ సదుపాయం నిలిపివేయడంతో తమ పరిస్థితిని కుటుంబసభ్యులకు వివరించే అవకాశం లేక తీవ్ర భయాందోళనకు గురయ్యామని.. విదేశాంగశాఖ అధికారులను సంప్రదించడానికి కూడా వీలు కాలేదని.. ఈ రెండు వారాలు తీవ్ర భయాందోళనల మధ్య గడిచిందని.. అసలు తిరిగి భారత్ కు వస్తామని అనుకోలేదని.. ఆ స్థాయిలో అక్కడ పరిస్థితులు ఉన్నాయని.. ఎటు చూసినా నిరసనలు, వీధుల్లో మృతదేహాలు, రక్తసిక్తమైన రహదాలులే కనిపించాయని తెలిపారు!
అటువంటి పరిస్థితుల్లో ఉన్న తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో తాము రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించలేకపోయామని తెలిపారు. ఈ సందర్భంగా ఎవరికి వారు వారి వారి అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వీరిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వీరి కుటుంబ సభ్యులు.. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా... డిసెంబర్ చివరలో ఇరాన్ లో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలపై భద్రతా దళాలు ఉక్కుపదం మోపడంతో దాదాపు గత రెండు వారలాకు పైగా ఇవి కాస్తా తీవ్ర హింసాత్మకంగా మారిపోయాయి. ఈ క్రమంలో.. మృతుల సంఖ్య 3,000 దాటిందని అధికారికంగా చెబుతుండగా.. 12 నుంచి 20 వేల మంది చనిపోయి ఉంటారని అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్న పరిస్థితి!
ఇరాన్ లో 10వేల మంది వరకూ భారతీయులు!:
ఇరాన్ లో ప్రస్తుతం విద్యార్థులు సహా 10 వేలమందికి పైగా భారతీయులు నివసిస్తున్నట్లు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వీరిని సంప్రదించేందుకు టెహ్రాన్ లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో.. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు పనిచేస్తుండడం ఇందుకు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.