వైసీపీ శత్రువు కాదా పవన్...?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరని జనసేనాని పవన్ కళ్యాణ్ అంటున్నారు.;
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరని జనసేనాని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆయన ఓల్డెస్ట్ పొలిటికల్ కొటేషన్ని మరోమారు తన పార్టీ సమావేశంలో వినిపించారు. నిజమే. పవన్ చెప్పారని కాదు కానీ రాజకీయాల్లో శత్రువులు ఏమిటి. అసలు ఆ కాన్సెప్ట్ అన్నదే పూర్తిగా తప్పు.
రాజకీయం అన్నది సేవా భావంతో చేసేది. ప్రజలకు మేము ఎక్కువగా సేవ చేస్తామని ఒకటి కంటే ఎక్కువ పార్టీలు పోటీ పడినపుడు అలా వారంతా జస్ట్ ప్రత్యర్ధులు అవుతారు. అంతే తప్ప శత్రువులు ఎలా అవుతారు ఇది కీలకమైన ప్రశ్నగానే ఉంది.
అయితే రాజకీయాల్లో ఆవేశ కావేశాలు ఇటీవల కాలాలలో హెచ్చిన మీదట ప్రత్యర్ధులు అన్న మాట కొట్టుకుపోతోంది. ప్రత్యర్ధులు స్థానంలో శత్రువులు పుట్టుకుని వస్తున్నారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా అధికారం శాశ్వతం కాదు, కేవలం అయిదేళ్ళు మాత్రమే ప్రజలు అవకాశాన్ని ఇస్తారు.
మరి అధికారం శాశ్వతం కానపుడు శత్రుత్వం కూడా ఎందుకు శాశ్వతం కావాలి. ఈ లాజిక్ పాయింట్ ని కనుక అంతా తెలుసుకుంటే రాజకీయాల్లో హుందాతనం వస్తుంది. ఆరోగ్యకరమైన రాజకీయానికి కూడా అది దారి తీస్తుంది. అయితే వ్యక్తిగత దూషణలు పెరిగి ఒక పార్టీ మరో పార్టీ మీద తిట్లూ శాపనార్ధాలు పెట్టుకుంటూ చివరికి ప్రత్యర్ధి పార్టీయే లేకుండా చేయాలన్న దారుణమైన ఆలోచనలతో రాజకీయాలు సాగుతున్నాయి.
ఇలాంటి భీభత్సపూరితమైన రాజకీయ వ్యవస్థలో ఒక మాట అన్నారు. శాశ్వత శత్రుత్వం అన్నది లేదు అని. ఇది మంచి మాటగానే చూడాలి. ఆయన చెబుతున్నది ఏంటి అంటే అంతిమంగా ప్రజలే ప్రమాణం కోలమానం కావాలని. ప్రజల మేలు కోరి చేసే రాజకీయాలలో పెట్టుకునే పొత్తులలో ఎవరు ఎవరితోనైనా కలవవచ్చు అని సూత్రీకరించారు.
గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నామని, ఈసారి బీజేపీతో జత కట్టినా లేక టీడీపీతో పొత్తు పెట్టుకున్నా అన్నీ కూడా ప్రజల కోసమే అని పవన్ అంటున్నారు. అలా రాజకీయాల్లో ఎవరినీ వ్యక్తిగతంగా దూషించరాదని అని ఆయన పార్టీ శ్రేణులకు హితబోధ చేసారు. పవన్ ఈ మాటలు చెప్పాక ఒక సందేహం వస్తోంది.
రాజకీయ శత్రుత్వం లేదు అంటే వైసీపీతో కూడా ఉండకూడదు కదా. జనసేనకు ఏ పార్టీతో వ్యక్తిగత పేచీ పంచాయతీ లేదని పవన్ పదే పదే చెబుతున్నారు. ఆ లెక్కన వైసీపీతో కూడా ఆయనకు పంచాయతీ లేదనే అనుకోవాలేమో. ఈ రోజున అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి గద్దె దించడం కోసం అని ఇతర పార్టీలతో జత కడుతున్నామన్న పవన్ రేపటి రోజున మరే రాజకీయ సమీకరణల కోసం వైసీపీతో కలసి అడుగులు వేస్తారా అన్న డౌట్లు అయితే ఉన్నాయి.
సరే ఒక్క వైసీపీతో తప్ప అన్ని పార్టీలతోనూ తనకు శత్రుత్వం లేదు అని పవన్ కండిషనల్ గా ఓల్డెస్ట్ కొటేషన్ ని మార్చి చదువుతారేమో. అయితే పవన్ అనే కాదు ఎవరైనా రాజకీయాలను సేవా భావంతో తీసుకున్న వారు ప్రత్యర్ధులుగానే ఎదుటి వారిని చూస్తారు. అంతే తప్ప వారిని శత్రువులుగా చూడరు. అలా చూస్తే కనుక మంచి రాజకీయాలకు అది దారి తీయదు.
ఇది అన్ని పార్టీలకూ వర్తించే సూత్రం. రాజకీయాలు ప్రజలే కేంద్రంగా సాగిన నాడు ఈ రాజకీయ శత్రుత్వాలు కచ్చితంగా పోతాయి. అలాగే అధికారం అశాశ్వతం అనుకుంటే రాజకీయాల్లో శత్రుత్వాలు సైతం ఉండవు. మరి ఈ దిశగా ఏపీలోనే కాదు దేశంలోని అన్ని పార్టీల అధినేతలు ఆలోచిస్తే అలా వ్యవహరిస్తే ఉత్తమమైన రాజకీయాలు తప్పకుండా వస్తాయని అంటున్నారు.